ఒమిక్రాన్.. మరోసారి హైదరాబాద్ లో గుబులు

దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా వేరియంట్ ఒమిక్రాన్, ప్రపంచాన్ని వణికిస్తోంది. దేశాలన్నీ అప్రమత్తమయ్యాయి. భారత్ కూడా ఎయిర్ పోర్టుల్లో ఆంక్షలు విధించింది. అయితే ఇదంతా జరగడానికి ముందే ఒమిక్రాన్ విస్తరించిన ప్రాంతాల నుంచి హైదరాబాద్ కు…

దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కరోనా వేరియంట్ ఒమిక్రాన్, ప్రపంచాన్ని వణికిస్తోంది. దేశాలన్నీ అప్రమత్తమయ్యాయి. భారత్ కూడా ఎయిర్ పోర్టుల్లో ఆంక్షలు విధించింది. అయితే ఇదంతా జరగడానికి ముందే ఒమిక్రాన్ విస్తరించిన ప్రాంతాల నుంచి హైదరాబాద్ కు కొంతమంది వచ్చారు. దీంతో మరోసారి భాగ్యనగరంలో గుబులు పట్టుకుంది.

ఈనెల 25వ తేదీ నుంచి 3 రోజుల్లో దక్షిణాఫ్రికా నుంచి హైదరాబాద్ కు ఏకంగా 185 మంది వచ్చారు. ఒమిక్రాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న బోట్సువానా నుంచి 16 మంది హైదరాబాద్ లో దిగారు. ఒమిక్రాన్ మేటర్ బయటకొచ్చిన వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ 185 మందికి పరీక్షలు నిర్వహించారు. వీళ్లలో 11 మందికి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది.

అయితే వీళ్లలో ఎంతమందికి ఒమిక్రాన్ వేరియంట్ సోకిందనే విషయంపై ఇంకా అధికారిక సమాచారం లేదు. ప్రస్తుతం వీరికి సంబంధించిన బ్లడ్ శాంపిల్స్ ను సీసీఎంబీకి పంపించారు. ఈ 11 మందితో పాటు మిగతా అందర్నీ క్వారంటైన్ లో ఉంచారు.

ఇదిలా ఉండగా.. వివిధ కరోనా వేరియంట్ల ప్రభావం ఉన్న రిస్క్ దేశాల జాబితాను భారత్ ప్రకటించింది. అలా ప్రకటించిన రిస్క్ దేశాల్లో 57 దేశాల నుంచి గడిచిన 3 రోజుల్లో హైదరాబాద్ కు ప్రయాణికులు వచ్చారు. వీళ్లలో అత్యథికంగా బ్రిటన్ నుంచి.. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ నుంచి ఎక్కువ మంది వచ్చారు.

తాజా పరిణామాలతో మరోసారి తెలంగాణ వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. మంత్రి హరీశ్ రావు, అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కరోనా హాస్పిటల్స్ ను పూర్తిగా సన్నద్ధం చేశారు. శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి ఆంక్షలు విధించారు.