ఇంతకు ముందు సీజన్లలో బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేస్తున్న ఒక చోటా సెలబ్రిటీకి అనుకూలంగా ఏవో ర్యాలీలు తీశారు కొంతమంది! అప్పుడే జనాలకు పిచ్చి ముదిరిందని అనుకుంటే.. ఇప్పుడో టీవీ యాంకర్ ను ఆ షో నుంచి ఎలిమినేషన్ చేశారని.. ధర్నాల వరకూ వచ్చారు! ఇంకా నయం.. రేపోమాపో తెలుగు రాష్ట్రాల బంద్ ప్రకటించలేదు బిగ్ బాస్ ఫ్యాన్స్ లేదా, ఆ టీవీ యాంకర్ ఫ్యాన్స్!
దీనిపై సోషల్ మీడియా, కొందరి ఫేస్ బుక్ పేజ్ లలో, మరి కొందరి ఇళ్లల్లో కూడా చర్చలు చూస్తుంటే.. నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి! అయితే.. స్థూలంగా ఆలోచిస్తే.. అంతిమంగా ఈ చర్యలతో లాభపడేది మాత్రం మళ్లీ బిగ్ బాస్ నిర్వాహకులే!
వాస్తవానికి రీజనల్ లాంగ్వేజెస్ లో ఈ షోలను హిట్ చేయడానికి బిగ్ బాస్ నిర్వాహకులు నానా కష్టాలు పడాల్సిందేనని ఏ యేడాదికాయేడు స్పష్టం అవుతూనే ఉంది. ఫస్ట్ ఇయర్ ఏదో కొత్తదనం, ఎన్టీఆర్.. ఆ షోను హిట్ చేశాయి. ఆ తర్వాత ఆసక్తి క్రమంగా సన్నగిల్లుతూ వచ్చింది.
తొలి సీజన్ ను క్రమం తప్పకుండా చూసిన వారిలో కూడా రెండో సీజన్ పై అనాసక్తి. మూడో సీజన్ పై మరింత చిన్న చూపు. ఈ క్రమంలో లేటెస్ట్ సీజన్ ను పెద్దగా పట్టించుకున్న వాళ్ల సంఖ్య బాగా తగ్గింది కూడా!
అయితే… వీరాభిమానులు కొందరు మిగిలే ఉన్నారు. ఈ వెర్రి విపరీత స్థాయికి వెళ్లి.. నిరసన ప్రదర్శన వరకూ వెళ్లింది. వీళ్లంతా ఏదో కుట్ర జరిగి సదరు యాంకర్ ను ఎలిమినేట్ చేశారని వాదిస్తున్నారు! ఆ కుట్రలో నాగార్జునకు భాగస్వామ్యమట! మరి ఇంతటితో అయినా ఆగుతారో లేక.. దీని వెనుక రాజకీయ కుట్రలు, అంతర్జాతీయ కుట్రలు కూడా ఉన్నాయనే ప్రచారాలు చేస్తారో!
వాళ్లు పక్కా కమర్షియల్ లెక్కలతో షో నిర్వహించుకుంటున్నారు. రేటింగ్స్ కోసం ఏదైనా చేస్తారు! ఎలిమినేట్ చేసినా, వైల్డ్ కార్డు ఎంట్రీలిచ్చినా.. అంతా రేటింగు లెక్కల మేరకే జరుగుతుంది. ఈ ట్రాప్ లో పడే వెర్రి ప్రేక్షకులు ఇలా ధర్నాలు, నిరాహార దీక్షలు చేసుకోవాల్సిందే కాబోలు.
అమెరికాలో.. ఈ రియాలిటీ షోల పుట్టుక ఆరంభం లోనే.. 'ది ట్రూమన్ షో' అనే సినిమా వచ్చింది. ఈ వెర్రి ప్రజలను ఎక్కడి వరకూ తీసుకెళ్తుంది, ఈ షోల్లో పాల్గొనే వారి మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది, రేటింగ్స్ కోసం ఇలాంటి షో నిర్వాహకులు ఏం చేస్తారనే.. అంశాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపించారు! ఆ సినిమా పూర్తిగా కల్పితం అయినా, ఇప్పుడు ఇలాంటి షోలను చూసి.. ధర్నాలు, దీక్షలకు దిగుతున్న వారిని చూస్తే మాత్రం.. వీరి వెర్రి గురించి అప్పట్లోనే బాగా అంచనా వేశారనిపించమానదు!