ఆమధ్య బీహార్ లో రిపేర్ కోసం తెచ్చి ఉంచిన ఓ రైలింజన్ ను దొంగలు పార్ట్ లు పార్ట్ లు గా ఊడదీసి ఎత్తుకెళ్లిన ఘటన తెలిసిందే. రైలే కాదు, ఇప్పుడు రైలు పట్టాలకు కూడా రెక్కలొచ్చాయి. ఏకంగా పట్టాలను కూడా దోచుకెళ్లారు. రైల్వే ట్రాక్ మాయమైపోయవడంతో అధికారులు లబోదిబోమంటున్నారు, ఎంక్వయిరీ మొదలు పెట్టారు.
ఎలా జరిగింది..?
బీహార్ లోని సమస్తిపూర్ జిల్లాలో లోహత్ చక్కెర కర్మాగారం ఉండేది. అయితే కొన్నాళ్లుగా అది మూతపడి ఉంది. అప్పట్లో ఆ షుగర్ ఫ్యాక్టరీ నుంచి సరకు లోడింగ్, అన్ లోడింగ్ కోసం లోపలికి గూడ్సు రైలు వెళ్లేందుకు వీలుగా ట్రాక్ నిర్మించారు. ఆ ట్రాక్ కూడా ఇప్పుడు నిరుపయోగంగా మారింది. షుగర్ ఫ్యాక్టరీ సామాన్లు తుక్కుకింద కొనుక్కోడానికి ఓ కంపెనీ కాంట్రాక్ట్ తీసుకుంది. అదే కంపెనీకి రైల్వే ట్రాక్ ఊడదీసే పనులు కూడా ఇచ్చేందుకు అధికారులు ఒప్పందం కుదుర్చుకోవాలనుకున్నారు.
అయితే ఆ సమాచారం ముందే లీక్ కావడంతో ఇంటిదొంగలు పని మొదలుపెట్టారు. రైల్వే సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు ఓ దొంగల ముఠా రైల్వే ట్రాక్ ఊడదీసుకుని పోయింది. ట్రాక్ ఊడదీయడమంటే మామూలు విషయం కాదు. కానీ రైల్వే ఉద్యోగుల సహకారంతో అది వారికి సులభమైంది.
ఎలా బయటపడింది…?
రైల్వే ట్రాక్ మాయం కావడంతో, చక్కెర కర్మాగారంలో పనులు చేస్తున్న కాంట్రాక్ట్ సంస్థ రైల్వే అధికారులుకు సమాచారమిచ్చింది. వారు వచ్చి చూస్తే.. రైల్వే ట్రాక్, సిమెంట్ కమ్మీలు.. ఏవీ లేవు. మొత్తం పక్కాగా ఊడదీసుకుని వెళ్లిపోయారు. అయితే వీటిని తరలించడం అంత సులభం కాదు. అందుకే చుట్టుపక్కల స్క్రాప్ గోడౌన్లలో వెదికారు. ఓ వ్యక్తి ఇంట్లో కొన్ని పట్టాలు దొరికాయి. తీగలాగి ఇప్పుడు డొంక కదిలించబోతున్నారు అధికారులు.
ముందుగా ఇద్దరు రైల్వే సిబ్బందిని సస్పెండ్ చేశారు. దొంగల ముఠా నాయకుడి కోసం వెదుకుతున్నారు. ఆర్పీఎఫ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సస్పెండ్ అయినవారు కూడా ట్రాక్ రక్షణ విధులు నిర్వహించాల్సిన ఆర్పీఎఫ్ సిబ్బందే కావడం విశేషం.
ఊహించని విధంగా దొంగతనాలు జరగడం బిహార్ లో కొత్తకాదు. ఆమధ్య ఇంటిపై ఉన్న సెల్ టవర్ మాయం చేశారు దొంగలు. ఇప్పుడిలా రైలు పట్టాలు ఎత్తుకెళ్లారు.