ఇదో విచిత్ర ప్రేమ. పాకిస్తాన్ చొరబాటుదారుడని తెలిసి కూడా ఆమె అతడికి మనసిచ్చింది. ఎనిమిదేళ్లు కాపురం కూడా చేసింది. వాళ్ల ప్రేమకు ఫలితంగా నలుగురు బిడ్డలు కూడా పుట్టారు. కానీ అతను ఎప్పటికీ చొరబాటుదారుడేననే విషయం మరచిపోయింది. ఆ విషయం బయటపడి పోలీసులు పట్టుకునేసరికి ఇప్పుడు లబోదిబోమంటోంది. తన భర్తను తనకు అప్పగించాలని కోరుతోంది ఆ మహిళ.
రాంగ్ కాల్ ద్వారా..
ఆమె పేరు దౌలత్ బి. ఊరు నంద్యాల జిల్లా గడివేముల. పెళ్లయిన తర్వాత బిడ్డపుట్టాడు. ఏడేళ్లకు భర్త చనిపోయాడు. ఆ తర్వాత ఆమెకు రాంగ్ కాల్ ద్వారా పాకిస్తాన్ కి చెందిన గుల్జార్ ఖాన్ పరిచయమయ్యాడు. అప్పటికి అతడు సౌదీలో పెయింటర్ గా పనిచేసేవాడు. దౌలత్ బి తో మాట కలవడంతో అది ప్రేమగా మారింది. ఆమెకోసం అతడు అక్రమంగా భారత్ లోకి ప్రవేశించాడు.
సౌదీ నుంచి నంద్యాలకు వచ్చిన గుల్జార్ ఖాన్ దౌలత్ బి ని నిఖా చేసుకున్నాడు. నలుగురు బిడ్డలు పుట్టిన తర్వాత ఆ కుటుంబం సౌదీకి వెళ్లానుకుంది. భార్యతో తనకు కలిగిన నలుగురు పిల్లలు, మొదటి భర్తతో ఆమెకు కలిగిన కొడుకు.. మొత్తం అతడితో కలిపి ఏడుగురు. అందరూ సౌదీ వెళ్లడానికి వీసాలు రెడీ చేసుకున్నారు.
అటునుంచి అటు పాకిస్తాన్ వెళ్లిపోయి అక్కడే స్థిరపడాలనేది వారి ఆలోచన. నంద్యాలలో గుల్జార్ ఖాన్ కి ఆధార్ కూడా సులువుగానే లభించడంతో వీసా ప్రక్రియ పెద్ద కష్టమేం కాలేదు. కానీ విమాన ప్రయాణం గుల్జార్ గుట్టు రట్టు చేసింది.
2019లో సౌదీ వెళ్లేందుకు ఆ కుటుంబం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చింది. సిబ్బంది తనిఖీల్లో గుల్జార్ ఖాన్ అసలు భారత పౌరుడే కాదనే విషయం తెలిసొచ్చింది. అతను పాకిస్తానీ అని, అక్రమంగా సౌదీ నుంచి భారత్ కి వచ్చి ఇక్కడ స్థిరపడ్డాడని తెలిసింది. దీంతో వెంటనే పోలీసులు అప్రమత్తం అయ్యారు. గుల్జార్ ఖాన్ ని జైలులో వేశారు. కరోనా కారణంగా గుల్జార్ ఖాన్ కి అదృష్టం కలిసొచ్చింది. జైలునుంచి అతడిని విడుదల చేశారు. కానీ గతేడాది మళ్లీ జైలుకి తరలించారు. దీంతో దౌలత్ బి కుటుంబం రోడ్డునపడింది.
తన భర్త పాకిస్తానీయే అయినా ఆయన మంచివాడని, తనకోసమే సౌదీ నుంచి అక్రమంగా భారత్ లో చొరబడ్డాడని చెబుతోంది దౌలత్ బి. ఆయన అమాయకుడని విడిచిపెట్టాలని ప్రభుత్వాలను వేడుకుంటోంది. ఆయన అండ లేకపోవడంతో తమ కుటుంబం కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తోందని. ఐదుగురు పిల్లలను పోషించడం ఇబ్బందిగా మారిందని, తన సోదరి భారం కూడా తనపైనే పడిందని అంటోంది.
కానీ అక్రమంగా భారత్ లో ప్రవేశించిన గుల్జార్ ఖాన్ ని విడిచిపెట్టాలంటే అంత సులభం కాదు. చట్టాలు అందుకు అంగీకరించవు. దౌలత్ బి అభ్యర్థనలను ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఆమె ఆశలు అడియాశలయ్యాయి.