అప్పుడు అన్న చిరంజీవి, ఇప్పుడు తమ్ముడు పవన్‌కల్యాణ్. నాడు ప్రజారాజ్యం, నేడు జనసేన. అప్పుడు జాతీయ పార్టీ కాంగ్రెస్సే, ఇప్పుడూ జాతీయ పార్టీనే…అదీ బీజేపీ. పట్టుమని పదికాలాల పాటు పార్టీని నడపలేని అశక్తత. అన్నదమ్ములిద్దరిలోనే కొట్టిచ్చినట్టు కనిపిస్తోంది. కాకపోతే చిరంజీవి కాస్తా మాటల పొదుపు పాటించాడు. కానీ పవన్ అన్నలా కాదు. మాటలు కోటలు దాటుతాయి. మనిషి మాత్రం ఇంటి గడప దాటాలంటే నెలల సమయం కావాలి.
రాయలసీమలో జనసేనాని పవన్‌కల్యాణ్ మాటలు వింటుంటే…బీజేపీ వైపు శరవేగంగా అడుగులు వేస్తున్నాడని తెలిసిపోతోంది. ఇటీవల ఆయన ఢిల్లీలో పర్యటించడం, పర్యటన వివరాలను గోప్యంగా ఉంచడాన్ని చూస్తుంటే బీజేపీ పెద్దలతో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా…ఆయన ఢిల్లీ పర్యటనానంతరం వ్యవహార శైలి తెలియజేస్తోంది. ఇప్పుడాయన పేరుకు జనసేనానే కానీ, మాట బీజేపీ భావజాలం నుంచి పుట్టుకొచ్చిందే.
బీజేపీలో జనసేనను విలీన ప్రక్రియ చేపట్టేందుకు కార్యకర్తలను మానసికంగా సిద్ధం చేసేందుకే అన్నట్టుగా ఆయన మాట తీరు ఉంటోందని జనసేన కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. తిరుపతిలో రెండురోజుల వ్యవధిలో ఆయన మాటలను ఒక్కసారి పరిశీలిద్దాం.
“ఉక్కుపాదంతో అణచివేసే వారికే వీళ్లు భయపడతారు. అమిత్‌షా వంటివారే ఈ దేశానికి కరెక్ట్. తిరుమలలో అన్యమత ప్రచారం ఎక్కువగా జరుగుతోందని స్థానికులు వాపోతున్నారు. ఎవరి అండతో రాష్ర్టంలో సామూహిక మత మార్పిడులు జరుగుతు న్నాయి. ప్రత్యేక హోదా సహా కొన్ని అంశాల కోసం విమర్శలు చేశానే తప్ప ఏరోజూ బీజేపీకి దూరం కాలేదు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్రహోంమంత్రి అమిత్‌షా అంటే నాకెంతో ఇష్టం “
బీజేపీలో జనసేన విలీన నిర్ణయం అయిపోయిందని, ప్రక్రియే మిగిలిందనేందుకు ఈ మాటలకు మించిన సాక్ష్యం ఏం కావాలి? నిన్నమొన్నటి వరకు వామపక్షాలతో చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్న సమయంలో చేగువేరా తనకు స్ఫూర్తి, ఆదర్శం అని చెప్పిన పవన్‌కల్యాణ్, ఇప్పుడు అమిత్‌షా అంటే తనకెంతో ఇష్టమనే వరకు వెళ్లాడంటే ఎంతలో ఎంత మార్పో గమనించాల్సిన అవసరం ఉంది. పదేపదే మతం, మతమార్పిడులు, కులం గురించి పవన్ నోట బీజేపీ భావజాలంతో కూడిన మాటలు ఆయన పలుకుతున్నారా లేక మరెవరైనా పలకిస్తున్నారా అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
“జగన్‌రెడ్డి మాట్లాడుతూ నా మతం మానవత్వం, కులం మాట నిలబెట్టుకోవడం అంటున్నాడు. మరి వేరే కులాలు మాట తప్పేవా? ఇతర మతస్తులకు మానవత్వం లేదని మీ అభిప్రాయమా” అని పవన్ ప్రశ్నించడం వెనుక ప్రతి దాన్ని మతం కోణంలో రాజకీయం చేయాలనే కుట్ర దాగి ఉండడాన్ని గుర్తించవచ్చు.
“మనది ఏడు దశాబ్దాల బలమైన పార్టీ కాదు. దిగువ మధ్యతరగతి వ్యక్తి పెట్టిన జనసేన వెంటనే అద్భుతాలు చేస్తుందని భావించకండి. అలాగే పార్టీని పెట్టడం, నడిపించడం అంత సులువు కాదు (మదనపల్లెలో)” …లక్ష పుస్తకాలు చదివిన మేధావి మాట్లాడిన మాటల వెనుక ఏ ఉద్దేశం లేదనుకుంటే పొరపాటే. తానేమీ అద్భుతాలు చేయలేనని, పార్టీని నడపడం తన వల్ల కాదని పవన్‌కల్యాణ్ చెప్పకనే చెప్పాడు. అంతేకాదు, ఈ కారణాల రీత్యా తాను బీజేపీలో పార్టీని విలీనం చేసేందుకు నిర్ణయించానని రాష్ర్ట వ్యాప్తంగా పర్యటనల ముగింపు తర్వాత పవన్ ప్రకటించే అవకాశం ఉంది.
2009లో ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి నాయకత్వంలో ముందుకొచ్చి, తిరిగి అంతే వేగంతో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో విలీనమైంది. ఇప్పుడు చిరంజీవి తమ్ముడు పవన్ మరో జాతీయ పార్టీ బీజేపీ వైపు మొగ్గు చూపుతుండడం గమనార్హం.
తమ విధానాలు నచ్చి బీజేపీతో కలిసి పనిచేయాలనుకుంటే.. ప్రాంతీయ పార్టీల విలీనాన్ని స్వాగతిస్తామని పవన్‌కల్యాణ్ ప్రకటనపై బీజేపీ ఎంపీ జీవీఎల్ ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకొంది. ఏరోజూ బీజేపీకి దూరం కాలేదని, బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్రహోంమంత్రి అమిత్‌షా అంటే తనకెంతో ఇష్టమని చెప్పడం ద్వారా బీజేపీలో తన మనసు ఎప్పుడో విలీనమైందని, ఇక కావాల్సిందే భౌతికమైన మనిషి మాత్రమేనని పవన్ చెప్పకనే చెబుతున్నాడు.