“రాజకీయాల్లో లోకేశ్ ఫెయిలయ్యారని మా కుటుంబం నుంచి మరొకరు రావలసిన పనిలేదు. నా కోడలు బ్రాహ్మణితో పాటు సతీమణి భువనేశ్వరి ప్రస్తుతం వ్యాపారాలతో పాటు కుటుంబ వ్యవహారాలను చూసుకుంటున్నారు. రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదు”….బ్మాహ్మణి రాజకీయాల్లోకి వస్తున్నారన్న ప్రచారంపై టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందన.
రాజకీయం, వ్యాపారం-రెండూ వేర్వేరు అన్నట్టు చంద్రబాబు మాటలున్నాయి. ఆయన అన్నట్టు ఒకప్పుడు రాజకీయమంటే సేవారంగానికి సంబంధించిన వ్యవహారంగా భావించేవారు. రాజకీయాల్లో ఉంటే పది మందికి “సేవ” చేయవచ్చనే ఆశయంతో వచ్చిన వారున్నారు. ప్రస్తుతం రాజకీయాల్లో ఉంటే పది రూపాయలు “సేవ్” చేసుకోవచ్చనే ఆశతో వచ్చేవారే అధికం. నాటి రాజకీయాల్లో ఆశయం ఉంటే, నేటి రాజకీయాల్లో ఆశ ఉంది. అదే తేడా.
ఈ విషయాలేవీ తెలియని అమాయకుడేం కాదు చంద్రబాబు. మరెందుకో ఆయన తన కోడలు బ్రాహ్మణి రాజకీయాల్లోకి రావడాన్ని ఇష్టపడడం లేదు. జవహర్‌లాల్‌నెహ్రూ ఇలాగే ఆలోచించి ఉంటే ఇందిరాగాంధీ లాంటి డైనమిక్ లేడీ పొలిటీషయన్‌ను మనం చూసేవాళ్లమా? ఇందిర అంటే ఇండియా, ఇండియా అంటే ఇందిరానే అనేంతగా ఆమె రాజకీయాల్లో తనదైన ముద్రవేసుకుని ప్రపంచ దృష్టిని ఆకర్షించలేదా?
సానియాకు టెన్నిస్, పీవీ సింధూకు బ్యాడ్మింటన్, కోనేరు హంపీకి చెస్, సత్యం నాదేండ్లకు కంప్యూటర్ నేర్పించింది తానేనని చెప్పుకుంటున్న చంద్రబాబుకు…వినయ విధేయతలే అద్భుతమైన సౌందర్యంగా, తెలివితేటలే అమూల్యమైన జ్ఞానసంపదగా కలిగిన కోడలిని రాజకీయాల్లోకి తీసుకురావాలంటే ఎందుకు మనసు ఒప్పుకోవడం లేదు. జగన్ ఫెయిలయ్యారని బాబు విమర్శిస్తున్నా, వాస్తవానికి రాజకీయాల్లో ఫెయిల్ అయినది తన కుమారుడు లోకేశ్.
మంగళగిరిలో లోకేశ్ ఓటమిపాలై సొంత పార్టీ నేతల నుంచే తీవ్రమైన విమర్శలు ఎదుర్కుంటున్న దయనీయ స్థితి. బ్రాహ్మణిని తీసుకొచ్చినంత మాత్రాన లోకేశ్‌ను పక్కన పెట్టినట్టు కాదు కదా? ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు. ప్రస్తుతం బ్రాహ్మణి వ్యాపార, కుటుంబ వ్యవహారాల్లో చక్కగా రాణిస్తోందని బాబూనే చెబుతున్నాడు. అవే మేనేజ్‌మెంట్ స్కిల్స్‌ను బ్రాహ్మణి రాజకీయాల్లో అమలు చేసి అద్భుతాలు సృష్టించవచ్చేమో….ఏమో…సోనియాగాంధీ, మమతాబెనర్జీ, జయలలిత, మాయావతి…ఇలా ఎంతో మంది మహిళలు దేశ రాజకీయాలను శాసించడాన్ని, శాసిస్తుండడాన్ని చూస్తున్నాం.
అసలు రాజకీయాలను వ్యాపారాలను ప్రత్యేకంగా చూడటం వల్లే బాబుకు ఈ తిప్పలు. పాలునీళ్లలా రాజకీయాలు, వ్యాపారాలు కలసిపోయాయి సార్. బ్రాహ్మణిని రప్పించి ఆమె తెలివితేటలను రాష్ర్ట ప్రయోజనాలకు వినియోగించండి బాబు గారు.