ఒకవైపు అత్యవసరమైన వ్యక్తులకు రష్యా రూపొందించిన కరోనా విరుగుడు వ్యాక్సిన్ స్ఫూత్నిక్ ను వేసే విషయమై ఆలోచిస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆ వ్యాక్సిన్ విషయంలో ఒకింత ఆందోళనకరమైన ఫలితాలు చర్చలోకి వస్తున్నాయి. ఆ వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉన్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. వ్యాక్సిన్ వేయించుకున్న ప్రతి ఏడు మందిలోనూ ఒకరికి కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ ను నోట్ చేస్తున్నారట పరిశోధకులు.
ప్రధానంగా నిస్సత్తువ, తీవ్రమైన జ్వరం, కండరాల నొప్పులు వంటి ఫలితాలను గమనించినట్టుగా వార్తలు వస్తున్నాయి. సాధారణంగా కూడా కొన్ని రకాల వ్యాక్సిన్ ల వల్ల జ్వరం వస్తుంది. చిన్న పిల్లలకు వ్యాక్సినేషన్ ఇచ్చినప్పుడు కూడా డాక్టర్లు ఈ విషయాలు చెబుతారు. నెల వారీగా కొన్ని వ్యాక్సిన్ లు వేసినప్పుడు కాస్త జ్వరం వస్తుందని ఆందోళన చెందనక్కర్లేదని, చెబుతూ డోలోను ప్రిస్క్రైబ్ చేస్తుంటారు చిన్న పిల్లల వైద్యులు. పిల్లలకు వేసే అన్ని రకాల వ్యాక్సిన్ లకూ జ్వరాలు రావు. కొన్ని వ్యాక్సిన్ ల విషయంలోనే ఆ సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. అయితే ఆ జ్వరం స్వల్పమైన స్థాయిలోనే, డోలోతో తగ్గిపోయే రీతిలో ఉంటుంది, కాబట్టే ఆ వ్యాక్సిన్ లు చాలా కాలంగా వినియోగంలో ఉన్నాయి.
కరోనా వ్యాక్సిన్ విషయంలో కూడా పలు పరిశోధన సంస్థలు జ్వరం వస్తుందని చెబుతున్నాయి. అది తక్కువ స్థాయిలోనే అని, తగ్గిపోతోందని చెబుతున్నాయి. అయితే అంతకు మించి సైడ్ ఎపెక్ట్స్ నోట్ చేస్తున్నారట రష్యన్ వ్యాక్సిన్ ప్రయోగాల్లో. ఇవి కూడా స్వల్పమైనవే, పెద్ద ఆందోళన చెందనక్కర్లేదేమో. ఇప్పటికే వినియోగంలో ఉన్న రకరకాల వ్యాక్సిన్ లతోనూ చిన్నపాటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా.. వాటిపై విస్తృతమైన పరిశోధనలు జరిగాయి. చాలా టైమ్ తీసుకుని వాటిని అభివృద్ధి చేశారు.
కాబట్టితో వాటితో ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ పై వైద్యులకూ స్పష్టమైన అవగాహన ఉంది. కరోనా విరుగుడు వ్యాక్సిన్ లతో సైడ్ ఎఫెక్ట్స్ స్వల్పమైనవే అయినా.. ఈ వ్యాక్సిన్ ల విషయంలో విస్తృతమైన పరిశోధనలు లేకపోవడం, త్వరత్వరగా ఈ వ్యాక్సిన్ ల ప్రయోగాలు సాగించేస్తూ ఉండటంతో.. చిన్న పాటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా పెద్దవి గా కనిపిస్తున్నాయి. వ్యాక్సిన్ తయారు చేయడం తేలిక కాదు అని కొంతమంది పరిశోధకులు మొదటి నుంచి చెబుతున్న విషయం సామాన్య ప్రజలకు కూడా ఇప్పుడిప్పుడు అవగాహనలోకి వస్తోంది.
వ్యాక్సిన్ తయారు చేయడం పరిశోధన సంస్థలకు పెద్ద కష్టం కాకపోవచ్చు.. దానిపై నియంత్రణ సంస్థల్లోనూ, ప్రజల్లోనూ నమ్మకాన్ని పెంపొందించడానికి మాత్రం చాలా సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.