బాబు విషయంలో భాజపా అతి జాగ్రత్త!

‘చెరువు గట్టు మీద వెళుతున్నప్పుడు.. కట్టమీద నాగుపాము- మోసగాడు ఇద్దరూ ఒకేసమయంలో ఎదురుపడితే గనుక… నువ్వు నాగుపాము ఉన్న వైపునుంచే వెళ్లు… అది నీకేం హాని చేయదు. అంతే తప్ప.. దాన్నుంచి కాపాడుకోవడానికి… మోసగాడు…

‘చెరువు గట్టు మీద వెళుతున్నప్పుడు.. కట్టమీద నాగుపాము- మోసగాడు ఇద్దరూ ఒకేసమయంలో ఎదురుపడితే గనుక… నువ్వు నాగుపాము ఉన్న వైపునుంచే వెళ్లు… అది నీకేం హాని చేయదు. అంతే తప్ప.. దాన్నుంచి కాపాడుకోవడానికి… మోసగాడు ఉన్న వైపునుంచి వెళ్తే మాత్రం వాడు ఖచ్చితంగా నీకు కీడు చేస్తాడు’ అని పెద్దలు చెబుతుంటారు. కుత్సితపు బుద్ధులున్న  వారితో జాగ్రత్తగా మెలగవలసిన దాని గురించిన కథ ఇది.

ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు విషయంలో ఈ కథలో లాగానే జాగ్రత్త పాటిస్తున్నట్లుగా కనిపిస్తోంది. చంద్రబాబునాయుడుతో గత ఎన్నికల్లో పొత్తు పెట్టుకుని బరిలోకి దిగితే.. తనకు అవసరం ఉన్నన్నాళ్లూ స్నేహంగా మెలిగి.. ఏ రకంగా పక్కకు తప్పుకున్నాడో.. 2019 ఎన్నికలు వచ్చేసరికి.. తమ మీద ఎంతగా విషం కక్కాడో వారందరికీ గుర్తుంది. అలాంటి నేపథ్యంలో… ఇప్పుడు మళ్లీ చంద్రబాబు ప్రస్తావన వస్తే.. మాటమాత్రంగా కూడా స్నేహం కలుపుకోవడానికి వారు సిద్ధంగా లేరు.

నిజానికి ఇప్పుడు భాజపా కూడా క్రియాశీల ప్రతిపక్షంగా వ్యవహరిస్తూ.. వైకాపా మీద దాడి చేస్తోంది. అమరావతి రాజధాని విషయంలో కూడా జగన్ మీద విమర్శలు చేస్తోంది. అదే సమయంలో.. అమరావతి విషయంలో.. చంద్రబాబు అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేసి.. దానికి తమను ఆహ్వానించేసరికి వారు జాగ్రత్తపడ్డారు. మా పోరాటం మేం చేసుకుంటాం గానీ.. మీతో కనీసం సమావేశానికి కూడా జట్టు కట్టేది లేదు.. అంటూ తెగేసి చెప్పేశారు. చంద్రబాబు మీటింగు పెడితే.. 17 పార్టీలను ఆహ్వానించారు. భాజపా మేం హాజరయ్యేది లేదని తెగేసి చెప్పింది. పవన్ కల్యాణ్ కూడా ఏదో మొక్కుబడిగా ప్రతినిధిని పంపుతున్నారు.

చూడబోతే, భాజపా చంద్రబాబు విషయంలో అతిజాగ్రత్తకు పోతోందనిపిస్తోంది. అచ్చెన్నాయుడు… భాజపా, జనసేన, తెదేపా కలిసి పోరాడాలని ప్రజలంతా అనుకుంటున్నట్లు.. తమ మనోభీష్టాన్ని బయటపెట్టినా కూడా.. సమావేశానికి రాదలచుకోకపోవడం తెదేపాను ఛీ కొట్టడమేనని పలువురు విశ్లేషిస్తున్నారు.