యూటర్న్ లు తీసుకోవడం..మాటలు మార్చడం, పొత్తులు- విధానాలకు ఒక నైతికత అంటూ లేకపోవడం, పరమ అవకాశవాదాన్ని కనబరచడం.. ఈ విషయంలో ఆరి తేరిపోయారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు. ఇందులో రహస్యాలు ఏమీ లేవు.
చంద్రబాబు రాజకీయంలో అణువంత నైతికత కూడా అగుపించదు. పొలిటికల్ కెరీర్ ప్రారంభంలో 'మామకు వ్యతిరేకంగా పోటీకి సై..' అని ప్రకటించి, ఆ తర్వాత ఎన్టీఆర్ పంచన చేరడంతో మొదలుపెడితే.. ఆ తర్వాత చంద్రబాబు నాయుడి కెరీర్ అంతా అలాంటి అవకాశవాదంతోనే సాగుతూ ఉంది.
చంద్రబాబు నాయుడుకు దత్తపుత్రుడుగా విమర్శలను ఎదుర్కొంటూ ఉన్న పవన్ కల్యాణ్ తీరు కూడా అచ్చం ఆయనలానే ఉంది. మరింత ప్రహసనం ఏమిటంటే.. పవన్ కనబరిచే అవకాశవాదం ముందు చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు చిన్నబోతూ ఉన్నారు.
ఇప్పటి వరకూ పవన్ కల్యాణ్ రాజకీయంగా చాలా రకాల ముసుగులే వేసుకుని వచ్చారు. 'ప్రజారాజ్యం'తో వచ్చారు. యువరాజ్యం అధ్యక్షుడిగా తిరిగారు. అప్పుడు కాంగ్రెస్, తెలుగుదేశాన్ని, బీజేపీని అందరినీ విమర్శించారు. ఆ తర్వాత ప్రజారాజ్యం విలీనం సమయంలో మొహం చాటేశారు. ఐదేళ్లు సినిమాలు చేసుని మళ్లీ ఎన్నికల సమాయినికి జనసేన అంటూ వచ్చారు. అప్పుడు ఆ పొత్తులు, ప్రచారాలు సాగించారు.
ఆ తర్వాత ఐదేళ్లు గాయబ్. మళ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టులతో పొత్తు. ఇక ఇప్పుడు బీజేపీకీ తనకూ అదే సాన్నిహిత్యమే ఉందని పవన్ ప్రకటించుకున్నారు. ఎన్నికల సమయంలో మాయవతిని పిలిపించుకుని సైతం ప్రచారం చేయించుకుని, ఇప్పుడు అమిత్ షా అంటే గౌరవం అంటూ పవన్ ప్రకటించుకుంటున్నారు.
కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసి, బీజేపీతో తనకు అదే మితృత్వం ఉందని ప్రకటించుకోవడం.. ఆయన తీరును చాటుతూ ఉంది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే.. చంద్రబాబు నాయుడు కన్నా పవన్ కల్యాణ్ ముదురుగా కనిపిస్తూ ఉండటం.
మాటలు మార్చడం, యూటర్న్ లు తీసుకోవడం, విధానాల విషయంలో అనైతికతను చాటుకోవడానికి పవన్ కల్యాణ్ ఏ మాత్రం మొహమాటపడటం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే.. పవన్ కల్యాణ్ ముందు చంద్రబాబు చిన్నబోతూ ఉన్నారంతే!