ఇటీవల ఎన్టీఆర్ పై టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్ పడింది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు టీడీపీకి, ముఖ్యంగా చంద్రబాబుకి గట్టి షాకిచ్చారు. అది కూడా కుప్పంలో కావడం విశేషం. బాబులకే బాబు తారక్ బాబు అంటూ కుప్పంలో హల్ చల్ చేశారు అభిమానులు. అక్కడితో ఆగలేదు.. సీఎం సీఎం.. ఎన్టీఆర్ సీఎం.. అంటూ ఓ రేంజ్ లో రచ్చ చేశారు.
ఎందుకిదంతా..?
ఎన్నికల కోసం తనని వాడుకుని వదిలేసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి బాగా దూరంగా ఉంటున్నారు. చంద్రబాబుతో కూడా అంటీముట్టనట్టుగానే ఉన్నారు. అయితే ఇటీవల చంద్రబాబు ఏడుపు సీన్, భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలంటూ జరిగిన ప్రచారంతో ఎన్టీఆర్ కూడా తప్పనిసరి పరిస్థితుల మధ్య లైన్లోకి రావాల్సి వచ్చింది. అయితే ఎన్టీఆర్ స్పందన కాస్త వెరైటీగా ఉంది. పరుష వ్యాఖ్యలను ఖండిస్తున్నానంటూనే చంద్రబాబు ఏడుపు గురించి అస్సలు ప్రస్తావించలేదు.
దీంతో సహజంగానే టీడీపీలో అలజడి మొదలైంది. అయితే ఎన్టీఆర్, చంద్రబాబుకి సపోర్ట్ గా మాట్లాడటమే చాలా ఎక్కువ అని సర్దిచెప్పుకున్నారు. కానీ మరో వర్గం మాత్రం ఎన్టీఆర్ ని అణగదొక్కడానికి ఇదే అదను అని భావించింది. చంద్రబాబు డైరక్షన్లో వర్ల రామయ్య విమర్శలు మొదలు పెట్టగా.. మరికొంతమంది వాటిని కంటిన్యూ చేశారు. దీనిపై ఎన్టీఆర్ అభిమానులు రియాక్ట్ అవ్వరని అనుకున్నారు.
కానీ ఎన్టీఆర్ అభిమాన వర్గం చంద్రబాబుపై సీరియస్ అవుతోంది. అందులోనూ కుప్పం నియోజకవర్గంలో గతంలో కూడా ఎన్టీఆర్ జెండా ఎగిరింది. ఇప్పుడు కూడా అక్కడినుంచే తిరుగుబాటు మొదలైంది.
పక్కా ప్లాన్ తో..
ఎన్టీఆర్ అభిమానులంతా ఓ చోట గుమిగూడాలంటే దానికి ఏదో ఒక కారణం ఉండాలి. అందుకే కుప్పంలోని ఎస్ఆర్ఎం థియేటర్లో జై లవకుశ మూవీ స్పెషల్ షో పడింది. దాని కోసం తరలివచ్చిన అభిమానులంతా ఎన్టీఆర్ ఫొటోలతో ఉండే జెండాలు పట్టుకొచ్చారు. థియేటర్ వద్ద హల్ చల్ చేశారు. బాబులకే బాబు తారక్ బాబు అంటూ పరోక్షంగా చంద్రబాబుని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. “సీఎం సీఎం.. ఎన్టీఆర్ సీఎం” అంటూ మరింతగా హడావిడి చేశారు.
అయితే ర్యాలీకి పోలీసులు అనుమతివ్వకపోవడంతో చంద్రబాబు పరువు కాస్తో కూస్తో నిలిచింది. ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు రావడంతో మరోసారి టీడీపీ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ అలజడి మొదలైంది. ఈసారి లోకేష్, భరత్, బాలయ్య లాంటి నందమూరి కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ను తక్కువచేసి మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకంటే, రాజకీయంగా వాళ్లకే అంత సీన్ లేదు కాబట్టి.