ఏపీ హైకోర్టు వర్సెస్ ఏపీ సర్కార్ అనేలా వ్యవహారం రోజురోజుకూ ముదురుతోంది. రెండు వ్యవస్థల మధ్య నివురు గప్పిన నిప్పులా ఉన్న వ్యవహారం ….ఇటీవల ఏసీబీ విచారణపై స్టే ఇవ్వడంతో పాటు మరీ ముఖ్యంగా ఎఫ్ఐఆర్ వివరాలను మీడియా రాయకూ డదని నిషేధం విధించడం తీవ్ర చర్చనీయాంశమైంది.
దేశ వ్యాప్తంగా సదరు ఉత్తర్వులపై నిరసన పెల్లుబికింది. ఏపీ హైకోర్టు వ్యవహా రంపై సాక్ష్యాత్తు దేశ అత్యున్నత చట్ట సభలైన లోక్‌సభ, రాజ్యసభలో కూడా ప్రస్తావనకు వచ్చాయి.
ఇదిలా ఉండగా మిషన్ బిల్డ్ ఏపీపై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ప్రభుత్వ ఆస్తుల విక్రయాలు ఆపేయాలని సామాజిక కార్యకర్త సురేష్ పిల్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా అడిషనల్ అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రతి పనికి అడ్డు తగులుతున్నారని, పరిపాలన కూడా వారినే చేసుకోమనండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలపై హైకోర్టు స్పందిస్తూ …ఎవరిని ఉద్దేశించి మీరన్నారు? హైకోర్టునా? పిటిషనర్లనా? అంటూ న్యాయమూర్తి ప్రశ్నిం చారు. అన్నింటిపై విచారించిన హైకోర్టు తీర్పును అక్టోబర్ 16న వెల్లడిస్తామని పేర్కొంది. కానీ ఏఏజీ వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
ప్రతి విషయంలోనూ హైకోర్టు అడ్డంకిగా మారిందని, ప్రభుత్వ విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని నిన్న రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. తాజాగా ఏఏజీ వ్యాఖ్యలు చూసిన తర్వాత …అంత మాటన్నారా? అని న్యాయ రంగానికి చెందిన వారు ఆశ్చర్యపోతున్నారు.