కొన్ని సందర్భాల్లో మాట కంటే మౌనమే అత్యంత శక్తిమంతమైంది. ఎందుకంటే మౌనానికీ ఓ భాష వుంటుంది. ఆ భాషకు అర్థం, పరమార్థం నిగూఢంగా వుంటుంది. అందుకే కొన్ని విపత్కర పరిస్థితుల్లో పరిష్కారాన్ని కాలానికి వదిలేస్తారు. అంటే మౌనం పాటిస్తారు. కాలానికి, మౌనానికి వున్న శక్తి దేనికీ లేదు. రాజకీయాల్లో ఊరికే మాట్లాడ్డమే కాదు, మౌనంగా వుండడం కూడా వ్యూహంలో భాగమే. మౌనం కొందర్ని భయపెడుతోంది. అది ఎలా వుంటుందంటే… ప్రస్తుతం వైసీపీలో అంతర్గత ఆందోళనను ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
ఎన్నికల సీజన్ మొదలు కావడంతో సహజంగానే రాజకీయ పార్టీలకు రెబల్స్ చికాకు తప్పడం లేదు. అధికార పార్టీ కావడంతో వైసీపీలో కాస్త ఎక్కువ అసంతృప్తి కనిపిస్తోంది. అభ్యర్థుల ఖరారు సమయానికి టీడీపీలో కూడా వ్యతిరేక గళాలు గట్టిగానే వినిపిస్తాయి. ఒక వేళ జనసేనతో పొత్తు కుదిరితే… టీడీపీలో వ్యతిరేక స్వరాలు తీవ్రంగా ఉంటాయి. రెబల్స్ విషయంలో జగన్, చంద్రబాబు వైఖరులు భిన్నంగా వుంటాయి.
ఎవరైనా ఒక్కసారి ఎదురు తిరిగితే వెంటనే పక్కన పెట్టడం జగన్ నైజం. జనాన్ని తప్ప నాయకుల్ని నమ్మకం వృథా అని గతానుభవాల దృష్ట్యా జగన్ గట్టి నిర్ణయానికి వచ్చారు. అందుకే నాయకులు పార్టీని వీడుతున్నా జగన్ పెద్దగా ఆందోళన చెందుతున్నట్టు కనిపించరు. అలాగని సమూహానికి ఒక నాయకుడంటూ లేకపోవడాన్ని రాజకీయ వ్యవస్థలో సమర్థించలేం. ఇదే చంద్రబాబు విషయానికి వస్తే… బుజ్జగించి, ఓదార్చి చల్లబరిచేందుకు ప్రయత్నిస్తుంటారు. ఉదాహరణకు విజయవాడ ఎంపీ కేశినేని నాని ఉదంతమే నిదర్శనం. పార్టీని నడపడంలో అధినేతల పంథా ఒక్కో రకంగా వుంటుంది.
ప్రస్తుతం వైసీపీలో వ్యతిరేక గళాల గురించే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇటీవల ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వెంకటగిరి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తమ ప్రభుత్వంపైనే తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు, ఇంకా వాటిని కొనసాగిస్తున్నారు.
వీళ్లతో వైసీపీకి ప్రమాదం లేదు. సమస్యల్లా వైసీపీలో మౌనంగా ఉంటున్న ప్రభుత్వ, పార్టీ వ్యతిరేక అభిప్రాయాలున్న నాయకులతోనే. కోటంరెడ్డి, ఆనం మనసుల్లో సొంత ప్రభుత్వంపై ఎలాంటి అభిప్రాయాలున్నాయో బయటపడింది. వారిని ఎలా డీల్ చేయాలో అధికార పార్టీకి కష్టమైన పనికాదు. ఒకవైపు ప్రభుత్వంపై వ్యతిరేకత నింపుకుని, పార్టీలోనే కొనసాగుతూ ప్రధాన ప్రతిపక్షంతో టచ్‌లో ఉన్న నాయకుల వల్ల వైసీపీకి ఎక్కువ నష్టం అని హెచ్చరించక తప్పదు.
వైసీపీలో ఉంటూ, ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ ఏం జరుగుతున్నదో ఎప్పటికప్పుడూ ప్రత్యర్థులకు ఉప్పందిస్తూ కోవర్టు ఆపరేషన్ చేసే వాళ్లున్నారనే ప్రచారం జరుగుతోంది. గత ఏడాది డిసెంబర్ వరకూ వైసీపీలో కీలకంగా ఉన్న ముఖ్య నేతలు సైతం ఇప్పుడు పూర్తిగా సైలెంట్ మోడ్‌లోకి వెళ్లడాన్ని ఎలా చూడాలి? ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని కావాల్సినన్ని ఆర్థిక ప్రయోజనాలు పొందిన నాయకులు ….ఇప్పుడు రాజకీయాలతో తమకేమీ సంబంధం లేనట్టు మౌనవ్రతం పాటిస్తున్నారు. ఇలాంటి నేతల మౌనం వెనుక పెద్ద వ్యూహమే వుంది.
అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించుకున్న ఆస్తిపాస్తులను కాపాడుకునేందుకు మళ్లీ వారికి పవర్ కావాలి. పవర్ అనేది రాజకీయ పార్టీల్లో లేదు. డబ్బులో వుంది. ఎందుకంటే పవర్‌ను డబ్బు కొనుగోలు చేస్తుంది. ఎక్కడైనా రాజకీయాలు ఉండొచ్చేమో కానీ, ఒక్క డబ్బు వద్ద తప్ప అని మాట్లాడుకోవాల్సి వుంటుంది. డబ్బంటే ఎవరికి చేదు? డబ్బు పడేస్తే ప్రతిపక్షాల వారి పనులు చేయకుండా ఉంటారా? అధికారంలో ఉన్న పార్టీ ఏదైనా…. డబ్బున్న వాళ్లు అన్ని వేళలా అధికారాన్ని చెలాయిస్తుంటారు.
మరో ఆరేడు నెలలు గడిస్తే ఏపీ రాజకీయ సమీకరణలపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందనే సంకేతాలు వస్తే… మౌన నేతలంతా మళ్లీ యాక్టీవ్ అవుతారు. లేదంటే అధికారం దక్కించుకునే పార్టీలోకి రాత్రికి రాత్రే జంప్ కావడానికి వెనుకాడరు. ఈ నేపథ్యంలో తమ మౌనం ద్వారా అధికార పార్టీపై అసంతృప్తిగా ఉన్నామనే సంకేతాలు పంపడమే వారి ఉద్దేశంగా చెబుతున్నారు. కోటంరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి ఘాటు విమర్శల కంటే, పార్టీలోనే వుంటూ… మౌనంగా ప్రత్యర్థులకు సహాయ సహకారాలు అందించే వారిపై కూడా వైసీపీ ఓ కన్నేసి ఉంచాలి.
పార్టీ, ప్రభుత్వం నుంచి లబ్ధి పొంది, ఇప్పుడు తామరాకుపై నీటి బొట్టలా ఉంటున్న నేతలెవరో గుర్తించాల్సి వుంది. మాట అనేది కనిపించే శక్తి అయితే, మౌనం కనిపించని యుక్తి. దేనికైనా యుక్తి ప్రధానం. రెబల్స్ కథ పక్కన పెడితే, పార్టీలోనే వుంటూ పబ్బం గడుపుకుంటూ, పక్క చూపులు చూసే నాయకుల నుంచి పొంచి వున్న ప్రమాదంపై అధికార పార్టీ దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది.
– సొదుం రమణ