అధికార పార్టీ వైసీపీపై వ్యతిరేకత వుంది. ఈ దఫా చాలా మందికి సీఎం జగన్ టికెట్లు ఇవ్వరనే ప్రచారం జరుగుతోంది. ఇది నిజం కూడా కావచ్చు. 151 మంది ఎమ్మెల్యేలుగా గెలిచిన నేపథ్యంలో 20-30 మందికి టికెట్లు ఇవ్వకపోవడం పెద్ద ఆశ్చర్యమేమీ కాదు. పాలక పార్టీ సంగతి కాసేపు పక్కన పెడదాం. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కథేందో తెలుసుకుందాం. వైసీపీపై వ్యతిరేకతను రాజకీయంగా సొమ్ము చేసుకునే దశలో టీడీపీ ఉందా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే, టీడీపీకి అంత సీన్ లేనట్టే కనిపిస్తోంది.
వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి వైసీపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అలాగే బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ కొరకరాని కొయ్యగా మారారు. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాత్రం తనకు తానుగా టీడీపీ టికెట్‌ను ప్రకటించుకున్నారు. రానున్న రోజుల్లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు, నాయకులు బయటికి వచ్చే అవకాశాలుంటాయి. వీరంతా టీడీపీలో చేరాలని మాత్రం ఉత్సాహం చూపే వాతావరణం లేదు.
ఆనం రామనారాయణరెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ ఆచితూచి అడుగులు వేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది. ఎందుకంటే వైసీపీ అధికారాన్ని పోగొట్టుకునేంత బలహీన స్థితిలో లేదనేది అన్ని పక్షాల నేతల అభిప్రాయం. టీడీపీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని చివరికి చంద్రబాబు, లోకేశ్ కూడా విశ్వసించే స్థితిలో లేరు. టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదిరి, అది కూడా పవన్‌కల్యాణ్‌కు తక్కువగా అంటే 15 నుంచి 20 లోపు సీట్లు మాత్రమే ఇస్తేనే చంద్రబాబుకు రాజకీయంగా లాభమనే చర్చ నడుస్తోంది. ఇది సాధ్యమా? అనేదిప్పుడు ప్రశ్న.
గౌరవప్రదమైన సీట్లు ఇస్తేనే టీడీపీతో పొత్తు అని పవన్‌కల్యాణ్ ఇప్పటికే ప్రకటించారు. 40 నుంచి 50 సీట్లు ఇవ్వాలని జనసేనాని పట్టుడుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇన్ని సీట్లు జనసేనకు ఇస్తే, వైసీపీని టీడీపీ దగ్గరుండి అధికారంలోకి తేవడం ఖాయమని ఆ పార్టీ నాయకులు చెబుతున్న మాట. పవన్‌కల్యాణ్ స్థిరత్వం లేని ప్రకటనలు చేస్తుండడంతో ఆయన్ను నమ్ముకోకపోవడమే మంచిదని టీడీపీ ఓ నిర్ణయానికి వచ్చింది. పవన్‌ను నమ్ముకుంటే మునిగిపోతామని టీడీపీ నేతలు అంటున్నారు. పవన్‌కే 40 సీట్లు ఇస్తే… తామెక్కడికి వెళ్లాలనే ప్రశ్న టీడీపీ నేతల నుంచి వినవస్తోంది. అంతకు తక్కువైతే పవన్‌కు ఏ గౌరమని జనసేన నేతలు ప్రశ్నిస్తున్నారు.
దీంతో టీడీపీ, వైసీపీలు ఒంటరిగా, బీజేపీ-జనసేన కూటమిగా పోటీ చేసే అవకాశాలే ఎక్కువని ప్రధాన ప్రతిపక్ష నేతలు చెప్పుకొస్తున్నారు. ఇలాగైతే జగన్‌ను గద్దె దించడం సాధ్యమా? అని వైసీపీ అసంతృప్తవాదుల ప్రశ్న. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో టీడీపీ వైపు చూడడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి భవిష్యత్‌పై భరోసా ఇవ్వడంలో టీడీపీ సక్సెస్ కాలేదు. అందుకే ఆ పార్టీలో చేరడానికి ఎవరూ ధైర్యం చేయలేదు.