పొమ్మనకుండా పొగబెడితే అలిగి వెళ్లిపోయేవాళ్లు ఒక కేటగిరీ ఉంటారు. కానీ.. అలవిమాలిన ఆశలు పెంచుకుని, అవి నెరవేరలేదని తాము కూర్చున్న కొమ్మను తామే నరుక్కునే వారెవ్వరుంటారు? తమ గోతిని తామే తవ్వుకునే వాళ్లెవరుంటారు? నీడనిచ్చి పండ్లు ఇచ్చే చెట్టుపై రాళ్లు విసిరే ధూర్తులు ఎవరుంటారు?. సాధారణ ప్రపంచంలో ఉండరు. కానీ రాజకీయాల్లో అన్నీ సాధ్యమే. అవివేకమో, అనాలోచన నిర్ణయాలో, అహంకారమో, ఏమైనా కావొచ్చు కానీ తమ పతనాన్ని తామే నిర్దేశించుకునే వారు కూడా ఉంటారు. వారిని నమ్మకద్రోహులు, వెన్నుపోటు దారులు అని అందరూ అంటుండవచ్చు గాక. కానీ వారు స్వీయద్రోహులు!వారి ఆలోచనలు, ఆశలు, అత్యాశల మీదనే ఈ వారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ.
‘రాజకీయాల్లో హత్యలుండవు.. అన్నీ ఆత్మహత్యలే’ అనేది చాలా చాలా పాపులర్ నానుడి! ప్రతి ఒక్కరికీ తెలిసిన సత్యం ఇది. ఇప్పటి వర్తమాన ఏపీ రాజకీయాలను గమనిస్తే మాత్రం.. ఈ నానుడి కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తుంది. ఆత్మహత్యలకు ఉరకలెత్తుతున్న నాయకులు మనకు కనిపిస్తున్నారు. అంతా సజావుగా సాగిపోతున్న తరుణంలో తమ సమాధులను తామే తవ్వుకుంటున్నారు. తమకు రాజకీయ భిక్ష పెట్టిన, గత్యంతరం లేని పరిస్థితుల్లో ఒక తెరువు చూపించిన పార్టీకి వెన్నుపోటు పొడుస్తున్నారు.
నెల్లూరు జిల్లా రాజకీయాల్లో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ల వైఖరి గమనించినప్పుడు ఇలాంటి అభిప్రాయాలే ప్రజల్లో కలుగుతున్నాయి. ఈ ఇద్దరి విషయంలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంత మేలు చేసిందో ప్రజలందరికీ తెలుసు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి రాజకీయ భిక్ష పెట్టిందే వైసీపీ. జగన్ పుణ్యమా అని ఆయన ఎమ్మెల్యే అయ్యారు. మూడు తరాలుగా వైఎస్ కుటుంబానికి సేవ చేశానని అంటున్నారు గానీ.. ఆయన సేవకు ఒక గుర్తింపు అంటూ లభించిందంటే.. అది వైఎస్ జగన్ చలవ మాత్రమే. స్థానికంగా సొంత పార్టీలోనే ఇతర నాయకులతోనే మితిమీరిన విభేదాలు, వారి వెనుక కుట్రలు చేయడం వంటి అనేక ఆరోపణలు అడపాదడపా తెరమీదకు వస్తూనే ఉన్నప్పటికీ.. కోటంరెడ్డి విషయంలో వైఎస్ జగన్ సానుభూతి ధోరణినే అవలంబిస్తూ వచ్చారు.
నిజానికి పార్టీ వ్యతిరేక స్వరం వినిపిస్తే, ప్రభుత్వానికి నష్టం జరిగే వ్యాఖ్యలు చేస్తే.. ఎంతటిపెద్ద నాయకులకు అయినా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అదే చివరి రోజు అన్నట్టుగా జగన్ చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన, ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలకు దిగజారిన వారిని ఏమాత్రం రెండో అభిప్రాయం లేకుండా పక్కన పెట్టేసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి నేపథ్యంలో కోటంరెడ్డి పట్ల ఉన్న ప్రత్యేకమైన అభిమానం జగన్ ను నిలువరించింది. రాష్ట్రప్రభుత్వం వేల లక్షల కోట్ల రూపాయల సంక్షేమ పథకాలు అమలు చేస్తుండగా.. కేవలం తన నియోజకవర్గంలో ఒక మసీదు నిర్మాణం గురించి.. రెచ్చిపోయి మాట్లాడుతూ.. ప్రభుత్వాన్నే బద్నాం చేసే వ్యాఖ్యలు రువ్వడం, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలకు కూడా గతిలేదు అన్నట్టుగా.. మసిపూసి మారేడుకాయ చేస్తే వక్రప్రచారాలకు దిగజారడం వంటి పనులకు కోటంరెడ్డి పాల్పడ్డారు. పెన్షనర్ల విషయంలో చాలా రొటీన్ ప్రాసెస్ జరుగుతూ ఉండగా.. ఎలాంటి కోతలు విధించకుండానే.. పచ్చమీడియా విష ప్రచారాల బుట్టలో పడి.. మరోసారి రెచ్చిపోయారు. ప్రభుత్వానికి పరువు పోయేలా మాట్లాడారు.
ఇదే ఇంకొకరి విషయంలో అయితే జగన్ అక్కడితో వారిని పూర్తిగా పక్కన పెట్టేసేవారు. కానీ కోటంరెడ్డి ని మాత్రం ప్రత్యేకంగా పిలిపించారు. అపాయింట్మెంట్ ఇచ్చి మాట్లాడారు. సొంతపార్టీ ఎమ్మెల్యేలే పార్టీకి చేటుచేసేలా మాట్లాడుతుంటే ఎలా.. అనే హితబోధ తప్ప.. జగన్ మాటల్లో మరొకటి దొర్లి ఉంటుందని అనుకోవడానికి వీల్లేదు. కానీ.. ఆ తర్వాతి పరిణామాలను గమనిస్తున్నప్పుడు, తొలి విమర్శలు చేసినందుకు పూర్వమే.. తెలుగుదేశంతో కోటంరెడ్డి ఒక ఒప్పందానికి వచ్చి ఉండచ్చుననే అభిప్రాయం పలువురికి కలుగుతోంది. ఆ రకంగా జగన్ మంచితనాన్ని కోటంరెడ్డి హేళన చేసినట్లు అయింది. ఫైనల్ గా ఆయన తెలుగుదేశంలో చేరబోతున్నట్లుగా ప్రకటించేశారు. పదేపదేసవాళ్లు విసురుతున్నారు.
ఇదే సమయంలో ఆనం రామనారాయణరెడ్డి ఎపిసోడ్ ను కూడా గమనించాలి. రాష్ట్ర విభజన నాటికి కాంగ్రెసులో ఉంటూ ఏపీ ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా ద్రోహచింతనతో, పదవీకాంక్షతో మౌనంగా ఉండిపోయిన రామనారాయణరెడ్డి రాజకీయజీవితం అప్పుడే ముగిసిపోయి ఉండాలి. విభజన తర్వాత ఆయన తనకు అనుచిత ప్రాధాన్యం ఇచ్చిన వైఎస్సార్ తనయుడి పార్టీ వైపు కాకుండా.. తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. అక్కడ ఆయనకు ప్రత్యేకంగా దక్కిందేమీ లేదు. కాగా, 2019లో జగన్ సర్కారు ఏర్పడబోతున్నదనే స్పష్టత వచ్చిన తర్వాత.. 2018లో తెలుగుదేశాన్ని వీడి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వేరే గతిలేక, టీడీపీలో ఉంటే పరాభవం తప్పదనే భయంతోనే వైసీపీలోకి వచ్చారు. అవకాశవాది అని తెలిసినప్పటికీ కూడా జగన్ మిన్నకున్నారు. వెంకటగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేని చేశారు. ఆయన కూడా ఇప్పుడు.. టీడీపీ భజన చేస్తూ.. వచ్చే ఎన్నికలకు పార్టీని వీడిపోయే నేపథ్యం తయారుచేసుకున్నారు. అధికారిక ప్రకటన ఒక్కటే తక్కువ.
ఈ ఇద్దరు నాయకులు.. ఇంకా బహుశా రాష్ట్రంలో మరికొందరు ఇలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారో గానీ.. ఈ నిర్ణయాల ద్వారా తాము కూర్చున్న కొమ్మలను తామే నరుక్కుంటున్నారనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఎందుకు పార్టీని వెళ్లిపోతున్నారో మాత్రం ఎవ్వరికీ అంతుబట్టని సంగతి.
అతిగా ఆశ పడినఫలితమే..
‘అతిగా ఆశపడిన మగాడు, అతిగా ఆవేశపడిన ఆడది సుఖపడినట్టు చరిత్రలో ఎక్కడా లేదు’ అంటూ నరసింహ చిత్రంలో రజనీకాంత్ అద్భుతమైన డైలాగ్ చెబుతాడు. మగ–ఆడ అనే వ్యత్యాసాలు కాదు గానీ, అతి-ఆశ, అతి-ఆవేశం రెండూ కూడా నష్టదాయకాలే. ఈ ఇద్దరు నాయకులు కూడా ఇవాళ ఆత్మహత్యాసదృశంగా తమ రాజకీయ మార్గాలను ఎంచుకుంటున్నారంటే, రాజకీయ భిక్ష పెట్టిన పార్టీని కక్ష కట్టినట్టుగా ద్వేషిస్తున్నారంటే కేవలం వారు తమ స్థాయికి తగని అతి-ఆశలను పెంచుకోవడమే కారణం.
కోటంరెడ్డి శ్రీధర రెడ్డి తన స్థాయి గురించి ఏం అనుకుంటారో గానీ.. మంత్రి పదవిని కోరుకోవడం ఆ జిల్లాలో ప్రజలకు కూడా పెద్ద కామెడీ. అయితే ‘మంత్రి పదవి’ అనే విషయానికి వచ్చినప్పుడు.. కుల మత సమీకరణలు, వారి వాగ్ధాటి, ప్రవర్తన, లేదా ఇతర అనేక అంశాలు నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి. రాజకీయంగా పెద్ద పదవులను కోరుకోవడానికి అవకాశమే లేని కులానికి చెందిన వాడిని తాను అని, తన కులంలో చాలా మంది సీనియర్లు ఉన్నందువల్ల.. మంత్రిపదవిపై అత్యాశలు పెంచుకోకుండా తమ ప్రస్థానం సాగించి ఉంటే ఎంతో బాగుండేది. కానీ ఆయన అలాంటి ప్రాక్టికల్ ఆలోచన చేయలేదు. అలకపూని పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ తెదేపాతో బేరం కుదుర్చుకున్నారు.
ఆనం వ్యవహారం కూడా మంత్రిపదవి మీద అత్యాశ కారణంగా వచ్చిందే. ఆయన వైఎస్ కేబినెట్లో చేసి ఉండొచ్చు.. కానీ.. విభజన తర్వాత.. జగన్ ను విశ్వసించి పార్టీలో చేరి ఉంటే ఆయనకు చాలా మర్యాద దక్కి ఉండేది. ఎక్కడా గతిలేనప్పుడు.. ఇక్కడకు వచ్చి తనకు కూడా మంత్రి పదవి కావాలని కోరుకుంటే ఎలా సబబు అనిపించుకుంటుంది? అలా ఇద్దరూ వెళ్లిపోవడానికి, ఆ రూపేణా తమ గోతిని తామే తవ్వుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారు.
వెన్నుపోటుకు వెరపు లేదే..
ఆరునెలలు సావాసం చేస్తే వారు వీరవుతారని అంటారు. చంద్రబాబునాయుడు విషయంలో ఆరునెలలు అవసరం లేదు. ఆయనతో సావాసం చేయాలని అనుకుంటేనే చాలు. నాయకులకు ఆయన లక్షణాలు వచ్చేసేలా కనిపిస్తున్నాయి. వెన్నుపోటు, నమ్మకద్రోహం అనే లక్షణాలు ఆయనను తలచుకున్నంతమాత్రాన అలవాటైపోయేలా ఉన్నాయి. ఈ నాయకులు కూడా ఇందుకు ఉదాహరణగానే నిలుస్తున్నారు. ఇంతగా తమను ఆదరించిన పార్టీకి వ్యతిరేకంగా వారు ఎన్నేసి మాటలు మాట్లాడుతున్నారో గమనిస్తే ఆ సంగతి స్పష్టంగా అర్థమవుతుంది.
వెన్నుపోటు రాజకీయాలకు ఆద్యుడిగా కీర్తి గడించి ఆరితేరిపోయిన చంద్రబాబునాయుడు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అదే రీతిగా దెబ్బతీయాలని అనుకున్నారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన.. మంత్రి పదవులు, కోరుకున్నంత వైభవం దక్కలేదని అసంతృప్తితో ఉన్న వారిని రెచ్చగొట్టి తమకు అనుకూలంగా మార్చుకోవాలని చంద్రబాబునాయుడు స్కెచ్ వేశారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఆ పార్టీ నేతలతోనే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని తిట్టిస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని అనుకున్నారు. అందుకోసం నెల్లూరు, ప్రకాశం జిల్లాల రెడ్లలో పెద్ద ప్రయత్నమే చేశారు.
నిజానికి ఇప్పుడు బయటపడిన ఈ ఇద్దరు మాత్రమే కాదు. కందుకూరు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి లను కూడా పచ్చదళంలో కలుపుకోవాలని చూసినట్టుగా ప్రచారం ఉంది. అయితే సకాలంలో ఈ వెన్నుపోటు కుట్రలను గమనించిన జగన్మోహన్ రెడ్డి కాస్త జాగ్రత్త పడడంతో కట్టుతప్పకుండా కొందరిని కాపాడుకోగలిగారు. అత్యాశకు పోయిన వారు జారిపోయారు.
అక్కడ దక్కేదేంటి?
నిజానికి ఆనం రామనారాయణ రెడ్డి తెలుగుదేశంలో చేరకుండా వైసీపీలో కొనసాగినా కూడా, పార్టీ వ్యతిరేక ప్రచారాలు చేయకుండా మిన్నకున్నా కూడా.. ఆయనకు వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కడం అసాధ్యం! తన సొంత నియోజకవర్గంలో ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకతను ఆయన మూటగట్టుకున్నారనే ప్రచారం ఉంది. ఆయనకు ఇప్పటికిప్పుడు పార్టీ మారడం తప్ప వేరే గతిలేదు. అందుకని తెలుగుదేశం తీర్థం పుచ్చుకుంటున్నారు. పోనీ ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యేగానైనా గెలుస్తారా? అంటే అది కూడా సందేహమే.
ఎటూ వెంకటగిరిలో ప్రజలు తనను ఛీకొడుతున్నారనే సంగతి ఆయనకు కూడా తెలుసు కాబట్టి.. కొత్త చోటు వెతుక్కుని గెలిచినా సరే.. ఆయనకు ఏం దక్కుతుంది? తెలుగుదేశం గెలిచి అధికారంలోకి వస్తుందనే నమ్మకం ఆయనకు ఉన్నదా? అంటే అనుమానమే. ఒకవేళ తెలుగుదేశం గెలిచినా కూడా.. ఆనంకు మంత్రి పదవి లాంటిది కట్టబెడతారనుకోవడం భ్రమ. మంత్రిపదవి కాదు కదా.. ఇన్నిసార్లు జెండాలు మార్చే నాయకుడికి కనీస గౌరవం కూడా దక్కదు. ఏదో పార్టీలో చేరేవరకు ఒక రకంగా మాట్లాడతారు, ఒక రకం ప్రాధాన్యం ఇస్తారు. ఆ తర్వాత పూచికపుల్లలా, కరివేపాకులా తీసిపారేస్తారు!
కోటంరెడ్డికి కూడా ఇంతకంటె భిన్నమైన అనుభవం ఎదురవుతుందని అనుకోనక్కర్లేదు. ఆయన ఆల్రెడీ బేరం మాట్లాడుకున్నారు కాబట్టి.. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే టికెట్ ఖరారే. కాకపోతే చంద్రబాబు వెన్నుపోటుకు సహకరించిన కోటంరెడ్డిని నియోజకవర్గం ప్రజలు క్షమిస్తారా? అనేది పెద్ద ప్రశ్న!
మనిషికి ఆశ ఉండాలి. కానీ అత్యాశ పెట్టుకుంటే.. వేసే అడుగులు కూడా నిలకడగా పడవు. ఆ ప్రస్థానంలో నిజాయితీ ఉండదు. దానికి ఫలితాలు కూడా నిలకడైనవి దక్కవు. ఆ సంగతి ‘రాజకీయ ఆత్మహత్యలకు’ పాల్పడుతున్న ఈ నాయకులు తెలుసుకోవాలి.
.. ఎల్. విజయలక్ష్మి