భారతదేశంలో రూపాయి కథ!

ప్రపంచంలోనే ఆర్ధికంగా ఐదవ స్థానంలో నిలబడి దూసుకుపోతున్న దేశం ఇండియా. ఇక్కడ రూపాయి రాబడి ఎలా ఉంది, పోబడి ఎలా అవుతోంది అనేది స్థూలంగా తెలుసుకుందాం. ఇక్కడ చెప్పుకునేవి తాజా గణాంకాలు.  Advertisement ముందుగా…

ప్రపంచంలోనే ఆర్ధికంగా ఐదవ స్థానంలో నిలబడి దూసుకుపోతున్న దేశం ఇండియా. ఇక్కడ రూపాయి రాబడి ఎలా ఉంది, పోబడి ఎలా అవుతోంది అనేది స్థూలంగా తెలుసుకుందాం. ఇక్కడ చెప్పుకునేవి తాజా గణాంకాలు. 

ముందుగా దేశం ఖజానాలోకి వచ్చిపడే రూపాయిలో దేనిది ఎంత శాతమో చూద్దాం. 

34% అప్పుల ద్వారా వస్తోంది. ఈ అప్పులు పపంచబ్యాంక్ ద్వారా కావొచ్చు, ఇతర మార్గాల ద్వారా అయ్యుండొచ్చు. ఇదే ఆదాయంలో సింహభాగం. ఇక ఇతర ఆదాయ మార్గాలేవిటంటే- ఆదాయపు పన్ను ద్వారా 15%, ఎక్సైజ్ ద్వారా 7%, కార్పొరేషన్ పన్నుల ద్వారా 15%, జీఎస్టీ ద్వారా 17%, కస్టంస్ 4%, కేపిటల్ రసీదులు 2%, పన్ను రహిత రసీదులు 6%. ఇక్కడ గమనించవలసింది జీఎస్టీని. ఆదాయంలో 17% అంటే మామూలు విషయం కాదు. ఇదే ఇప్పుడు దేశానికి ఆర్ధికపరిపుష్టిని ఇస్తోంది. గతంలో ఒక్క ఆదాయపు పన్ను శాతమే రాబడిలో 25% ఉండేది. ఇప్పుడది 15% మాత్రమే కావడానికి కారణం జీ.ఎస్.టి వసూళ్లు పెరగడం. 

ఇక పోబడి విషయం ఎలా ఉందంటే పైన చెప్పుకున్న 34% తాలూకు అప్పులకు కట్టే వడ్డీ 20% ఉంటోంది. ఇక కేంద్రం ఇచ్చే సంక్షేమ పథకాలకి 9%, సబ్సిడీలకి 7%, రక్షణ శాఖకి 8%, కేంద్ర సెక్టార్ స్కీములకి 17%, రాష్ట్రాల పన్నుల్లో వాటా 18%, పెన్షన్స్ 4%, ఇతర ఖర్చులు 8%. ఇందులో పెన్షన్స్ క్రమంగా కనుమరుగవుతున్నాయి. ఈ ఖర్చు ఇక భవిష్యత్తులో ఉండదు. ఈ స్థానంలో అమెరికాలో మాదిరిగా సోషల్ సెక్యూరిటీ కింద ప్రభుత్వ, ప్రైవేట్ అన్న తేడా లేకుండా ప్రతి ఉద్యోగికి ఒక చిన్న మొత్తం కట్ చేసి ఆ మొత్తాన్ని 65 ఏళ్లు దాటినప్పటి నుంచి పెన్షన్ గా ఇచ్చే ఏర్పాటు రావాలి. దానివల్ల ప్రతి పౌరుడికి వృద్ధాప్యంలో ఇతరులపైనా, ప్రభుత్వంపైనా ఆధారపడకుండా బతకడానికి మినిమం గారెంటీ ఉంటుంది. పైగా ఇలా కట్ చేసుకునే మొత్తంతో ప్రభుత్వం అప్పులు కూడా కొద్ది కొద్దిగా తీర్చుకోవచ్చు. ఆ రకంగా 34% అప్పు క్రమంగా తగ్గే అవకాశముంటుంది. 

ఎలా చూసుకున్నా దేశం మునుపటికంటే ఆర్ధికంగా బలోపేతమయ్యింది. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటివి అధికశాతం ప్రజలు వాడుతుండడం వల్ల బ్యాంకింగ్ వ్యవస్థ కూడా బలం పుంజుకుంటోంది. చిన్నమొత్తాలుగా కరెన్సీ బ్యాంకుల్లోకి రాకుండా బ్లాక్ మనీ రూపంలో జనం దగ్గరే సర్క్యులేట్ అవుతూ ఉండిపోకుండా ప్రతి రూపాయి బ్యాంక్ ద్వారా.. బ్యాంక్ నుంచి ..బ్యాంకుకి అన్నట్టుగా ప్రవహిస్తోంది ఈ డిజిటల్ పేమెంట్స్ వల్ల. ఇది శుభపరిణామం. 

రానున్నకాలంలో దేశంలో తీసుకురావాల్సిన మార్పుల్లో పైన చెప్పుకున్న సోషల్ సెక్యూరిటీ ఒకటి, అలాగే పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు అంతర్జాతీయ స్థాయిలో కల్పించడమొకటి. వీటితో పాటు అంతర్జాతీయ విపణిలో దేశాల మధ్య జరిగే ట్రేడ్ లో రూపాయి పాత్రని గణనీయంగా పెంచుకోవడం మరొకటి. ఇప్పటికే ఈ దిశగా అడుగులు పడ్డాయి. 

కనుక ఇవన్నీ జరిగితే దేశం మరో రెండు స్థానాలు దాటి ప్రపంచంలోనే ఆర్ధిక పరిపుష్టి గల దేశంగా మూడవ స్థానంలో నిలబడడానికి 2030 వరకు ఆగాల్సిన పనుండదు. 

– విన్నకోట కామేశ్వరరావు