ఏపీకి ప్రత్యేక హోదా.. కాంగ్రెస్ మార్క్ కధ

ప్రత్యేక హోదా. ఏపీ జనం ఇంకా గుర్తు పెట్టుకున్నారా అన్నది ఇపుడు అతి పెద్ద డౌట్. ఎందుకంటే అది ముగిసిన అధ్యాయం అని బీజేపీ నేతలు అనడం కాదు జనాలు కూడా ఏనాడో దాని…

ప్రత్యేక హోదా. ఏపీ జనం ఇంకా గుర్తు పెట్టుకున్నారా అన్నది ఇపుడు అతి పెద్ద డౌట్. ఎందుకంటే అది ముగిసిన అధ్యాయం అని బీజేపీ నేతలు అనడం కాదు జనాలు కూడా ఏనాడో దాని సంగతి తెలుసుకుని ఆశలు వదిలేసుకున్నారు. ప్రత్యేక హోదా ఇపుడు రాజకీయ అస్త్రంగా లేదు. కానీ 2014 తరువాత వస్తున్న మూడవ ఎన్నిక  2024లోనూ దాన్ని అస్త్రంగా చేసుకుని ఏదో బావుకుందామనుకునే వారు ఇంకా ఉన్నారు.

వామపక్షాలు ప్రజా సంఘాలు ఇటీవల అనంతపురం నుంచి ఇచ్చాపురం దాకా  ప్రత్యేక హోదా విభజన హామీల పేరిట బస్సు యాత్రను ప్రారంభించారు. అందులో ఆంధ్రా మేధావుల సంఘం నాయకులు కూడా పాలుపంచుకున్నారు. హోదా రావాల్సిందే. కేంద్రం దిగి రావాల్సిందే అని నినాదాలు అంతా చేశారు.

ఇపుడు కాంగ్రెస్ వంతు. ఆ పార్టీ ఏపీసీసీ కొత్త ప్రెసిడెంట్ గిడుగు రుద్రరాజు విజయనగరం పర్యటనలో మాట్లాడుతూ ప్రత్యేక హోదాను తాము ఏపీకి ఇస్తామని చెబుతున్నారు. దానికి ఆయన ఇఫ్ బట్ అని కొన్ని కండిషన్లు కూడా పెట్టారు. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలి. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి. ఏపీలో కూడా దండీగా కాంగ్రెస్ కి ఎంపీలు ఇవ్వాలి. అపుడు ప్రత్యేక హోదా ఏపీకి ఇస్తామని రుద్రరాజు అంటున్నారు.

ఇపుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ కి దేశంలో ఫుల్ మెజారిటీ వచ్చే చాన్స్ లేదు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు అయితే కచ్చితంగా రాహుల్ ప్రధాని అవుతారు అని కూడా లేదు. ఒక వేళ ఆయన అయినా ప్రత్యేక హోదాకు కూటమిలోని ఇతర పక్షాలు అంగీకరిస్తాయన్న గ్యారంటీలేదు. వీటికి మించి ఏపీ నుంచి కాంగ్రెస్ కి ఎంపీలు వచ్చే చాన్స్ కూడా లేదు అన్నది ఒక కఠిన రాజకీయ విశ్లేషణగా ఉంది.

అయినా సరే కాంగ్రెస్ నేతలు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇస్తున్నారు. నిజానికి ప్రత్యేక హోదా అన్న బ్రహ్మ పదార్ధాన్ని కనుక్కొని అయిదు కాదు పదేళ్ళు పెట్టమని రాజ్యసభలో నాడు నానా రభసా చేసిన బీజేపీ పెద్దాయనలు ఆనక చాలా కన్వీనియెంట్ గా మరచిపోయారు. విభజన నాడు ప్రత్యేక హోదా అన్న మాట కాంగ్రెస్ కి తట్టలేదు. ఇపుడు బీజేపీ వారి నోటి వెంట వచ్చి వారు కూడా తాము చేయలేమని చెప్పేసిన దాన్ని కాంగ్రెస్ చేస్తుందంటే ఆలోచించాల్సిందే. ప్రత్యేక హోదా అస్త్రం పదును ఏమైనా మిగిలి ఉందా అన్నదే 2024లో టెస్టింగ్ పాయింట్ తప్ప అది వస్తుందనో తెస్తారనో మాత్రం ఎవరికీ ఆశలు అయితే లేవు అనే అంటున్నారు.