అది పవన్ కి రాయాల్సిన లేఖ పెద్దాయనా…!

విశాఖకు చెందిన యువ మంత్రి గుడివాడ అమరానాధ్ పంచులు వేయడంలో దిట్ట. తన తండ్రి దివంగత గుడివాడ గురునాధరావు నుంచి ఆయనకు అది అలవడింది. స్మూత్ గా సెటైర్లు పేల్చి అవతల వారు గిలగిల…

విశాఖకు చెందిన యువ మంత్రి గుడివాడ అమరానాధ్ పంచులు వేయడంలో దిట్ట. తన తండ్రి దివంగత గుడివాడ గురునాధరావు నుంచి ఆయనకు అది అలవడింది. స్మూత్ గా సెటైర్లు పేల్చి అవతల వారు గిలగిల కొట్టుకునేలా చేయడంలో గుడివాడ దిట్ట. ఆయన చెడుగుడుకు పవన్ కళ్యాణ్ సైతం కౌంటర్లు ఇవ్వాల్సి వస్తోంది.

జనసైనికులకు అయితే గుడివాడ కంట్లో నలుసుగా మారిపోయారు. మినిస్టర్ గా ఉన్న గుడివాడ ముఖ్యమంత్రి జగన్ కి అత్యంత సన్నిహితుడు. విశాఖలో బలమైన సామాజికవర్గానికి చెందిన వారు. పవన్ కళ్యాణ్ మీద కామెంట్స్ చేయాలీ అంటే గుడివాడ తరువాతనే ఎవరైనా అన్నట్లుగా ఆయన మోత ఉంటుంది.

ఇప్పటిదాకా జనసైనికుల నుంచి పవన్ కళ్యాణ్ వరకూ గుడివాడ మీద కౌంటర్లు వేసినా ఆయన ధాటి ఏ మాత్రం తగ్గడంలేదు సరికదా మరింతగా జోరు పెంచుతున్నారు. దీంతో పెద్దాయన హరి రామజోగయ్య సీన్ లోకిరావాల్సి వచ్చిందేమో. కాపు సంక్షేమ సేన అంటూ పవన్ కోసమే తాను తన సేనలూ అన్నట్లుగా జోగయ్య అన్నీ చేస్తూ వస్తున్నారు.

ఇప్పటికి యాభై ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్న జోగయ్య అన్ని పార్టీలు మారినా తాను సమర్ధ నాయకుడిగా ఉన్నా ముఖ్యమంత్రి కాలేకపోయారు. కానీ పవన్ లో ఆయన భవిష్యత్తు సీఎం ని చూస్తున్నారు. ఆయన ఆశ మంచిదే. కానీ పవన్ కళ్యాణ్ జనసేన 175 సీట్లకు పోటీ చేసినపుడు పెద్దాయన దీవెనలు ఫలిస్తాయి కానీ పొత్తులతో కాదు కదా. ఈ విషయం రాజకీయాల్లో నిండా పండిన జోగయ్య లాంటి వారికి తెలియనిది కాదు.

అయినా ఆయన తపన ఆయనది. రాజకీయంగా జగన్ని మాత్రమే టార్గెట్ చేసుకుని విమర్శలు చేసే జోగయ్య ఇపుడు గుడివాడ మీద పడ్డారు. యువ మంత్రిని పట్టుకుని రాజకీయ బచ్చా అనేశారు. కాపుల రాజకీయ ప్రయోజనాలు దెబ్బ తీయవద్దు అని సుతిమెత్తగా హెచ్చరించారు. అయితే ఇవన్నీ పవన్ కళ్యాణ్ కి చెప్పాల్సిన సూక్తులు నీతులు నాకెందుకు పెద్దాయనా అంటూ గుడివాడ ఘాటైన రిప్లై ఇచ్చారు.

పవన్ కి రాయాల్సిన లేఖ పొరపాటున నాకు రాశారు మీరు అంటూ హరి రామ జోగయ్యకు గట్టిగానే రిటార్టు ఇచ్చారు. కాపుల విషయంలో చంద్రబాబుతో జత కడుతున్న పవన్ కళ్యాణ్ కి మీ నీతులు చెప్పండి అని నిర్మొహమాటంగానే తిరుగు టపాలో లేఖ రాసి పంపించారు. 

కాపుల ప్రయోజనాలను తాను తాకట్టు పెట్టడం లేదని పవన్ పెడుతున్నారు అని చెప్పడం ద్వారా జోగయ్యకు గుడివాడ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు అంటున్నారు. మీరు ఆయురారోగ్యంగా ఉండాలని మానసికంగా దృఢంగా ఉండాలనీ కూడా గుడివాడ కోరుకోవడం ద్వారా లేఖ ముగించారు. గుడివాడ రాజకీయ బచ్చా అనుకుని లేఖ రాసిన పెద్దాయనకు ఈ జవాబు ఎలా తోస్తుందో చూడాలని అంటున్నారు.