హైదరాబాదులో కంటే దుబాయిలో ఇల్లు కొనడం చవక. అవును ఒకరకంగా ఇది నిజమే. హైదరాబాదులో రూ 3 కోట్లు పెట్టి గేటెడ్ కమ్యూనిటీలో లగ్జరీ ఫ్లాట్ కొనుక్కోవచ్చు. కానీ అదే పెట్టుబడి దుబాయిలో పెడితే అంతే అద్భుతమైన, ఒక్కోసారి అంతకంటే అద్భుతమైన నివాసాలు దొరికేస్తున్నాయి. పైగా అది టూరిష్ట్ డెస్టినేషన్ కావడంతో సగటున రోజుకి రూ 20,000 సంపాదించుకునే అవకాశం లభిస్తోంది. అదే హైదరాబాదులో కొన్న ఆ స్థాయి ఫ్లాట్ అద్దెకిస్తే నెల మొత్తానికి లక్షన్నరో-రెండు లక్షలో రావచ్చు. అంతకు మించి కష్టం.
దీనికి తోడు దుబాయిలో కోటిన్నర పైన పెట్టుబడి పెట్టి ఫ్లాట్ కొంటే పదేళ్ళ పాటు గోల్డెన్ వీసా కూడా ఇస్తున్నారు..అది కూడా కుటుంబం మొత్తానికి. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు దుబాయిలో పీక్ సీజన్ నడుస్తుంది. అందులో మరీ ముఖ్యంగా డిసెంబర్-జనవరి సీజన్. ఆ సమయంలో ఈ ఫ్లాట్స్ ని రోజుకి రూ 30000 చొప్పున అద్దెకి ఇస్తున్నవారు కూడా ఉన్నారు. ఎలా చూసుకున్నా ఇండియాతో పోలిస్తే దుబాయ్ టాక్స్ హెవెన్. కనుక పన్నుపోటుండదు.
ఉండడానికైతే ఓకే కాని పెట్టుబడి కోసం ఆస్తి కొనాలంటే ఇండియాకంటే దుబాయే ఎన్నో రెట్లు లాభసాటి అని ప్రూవ్ అయిపోయింది. పైగా దుబాయిలో ఆస్తి విలువ పెరుగుదల కూడా ఎక్కువ.
2022లో దుబాయిలో ఇళ్ల కొనుగోళ్ల మీద భారతీయులు రూ 35,500 కోట్లు ఖర్చుపెట్టారంటే ఆలోచించండి. ఇది 2021 తో పోలిస్తే రెట్టింపు. వీళ్లంతా అపరకుబేరులు, టాటాబిర్లాలు, అంబాని-అదానిలు కారు. వీరిలో అధికశాతం మంది రూ 2 కోట్ల పైచిలుకులో పెట్టుబడి పెట్టగలిగేవాళ్లే ఎగువ మధ్యతరగతి భారతీయులే ఎక్కువ ఉన్నారు.
దుబాయిలో ప్రపంచస్థాయి సదుపాయాలు ఉండడం, ప్రపంచంలోని ధనిక పర్యాటకులకి ఇష్టమైన నగరం కావడంతో ఇక్కడ పెట్టుబడులు ప్రపంచవ్యాప్తంగా ఎందరో పెడుతున్నారు. వారిలో భారతీయులు ముందంజలో ఉన్నారన్నది వాస్తవం.
2019లో ఏడాది మొత్తం కష్టపడితే అమ్మగలిగే ఇళ్లను ఇప్పుడు కేవలం ఒక నెలలో అమ్మేస్తున్నమని, డిమాండ్ ఆ రేంజులో ఉందని దమాక్ ప్రొపెర్టీస్ డైరెక్టర్ అష్రత్ అన్నారు. భారతీయుల తర్వాత రష్యావాళ్లు ఇక్కడ ఇళ్లు కొంటున్నారట. ఆ తర్వాత లిస్టులో బ్రిటన్, చైనా, పాకిస్తానీయులు ఉంటున్నారని వెల్లడించారు అష్రత్. దుబాయిలోని 15%-20% రియలెస్టేట్ భారతీయుల పెట్టుబడుల్లోనే ఉందట.
ఇంతకీ పైన చెప్పుకున్న గోల్డెన్ వీసాలో చాలా వెసులుబాట్లున్నాయి. అది కేవలం టూరిస్ట్ విసా కాదు. దుబాయిలో పదేళ్ల పాటు నివశించవచ్చు, పిల్లల్ని చదివించుకోవచ్చు, ఉద్యోగాలు, వ్యాపారాలు కూడా చేయవచ్చు.
“మా పిల్లలు దుబాయిలోనే చదువుతున్నారు. ఇక్కడ ప్రపంచంలోనే ఉన్నతశ్రేణి ప్రమాణాలున్న స్కూల్స్ ఉన్నాయి. సిటీ కూడా చాలా సేఫ్. క్యాబులో క్యాష్ మరిచిపోయినా డ్రైవర్లే తీసుకొచ్చి ఇస్తారు”, అని విజయవాడ నుంచి గోల్డెన్ వీసా మీద దుబాయికి వెళ్లిన రాహుల్ అనే వ్యక్తి చెప్పారు.
ఎగువ మధ్యతరగతి, ఆ పై తరగతుల వారికి దుబాయిలో ఇళ్ల పెట్టుబడులు లాభసాటిబేరమే అనిపిస్తోంది. అయితే మంది ఎక్కువైతే మజ్జిగ పలుచన అయ్యే చందాన ఈ మార్కెట్ సాచ్యురేట్ అయిపోతే అప్పుడు ఇళ్లు అమ్ముకోవడానికి తిప్పలు పడాలేమో ఆలోచించాలి. అయితే ఆ పరిస్థితి ఇప్పట్లో రాకపోవచ్చని, అది వచ్చే నాటికి పెట్టుబడంతా వెనక్కి వచ్చేసి ప్రాపర్టీ మిగిలి ఉంటుందని అంటున్నారు ఇప్పటికే దుబాయిలో విస్తృతంగా పెట్టుబడులు పెట్టిన ఇండియన్ రియాల్టర్స్ కూడా.