ముంబైలో లగ్జరీ ఇళ్ల మార్కెట్ డీల్స్ భారీ నంబర్లను పలుకుతూ సగటు భారతీయుడిని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. బాలీవుడ్ తారల ఇళ్లకు సంబందించిన ధరలు వామ్మో అనిపించేలా ఉంటాయి. అడపాదడపా ఆ రిజిస్ట్రేషన్లకు సంబంధించిన వార్తలు వస్తూ ఉంటాయి. ముంబైలో భారతీయ స్టార్ క్రికెటర్లు, బాలీవుడ్ స్టార్లు పదుల కోట్ల రూపాయలు వెచ్చించి అపార్ట్ మెంట్ ఫ్లాట్లను కొన్నట్టుగా వార్తలు వస్తూ ఉంటాయి. అవే అనుకుంటే.. దేశ రియాలిటీ మార్కెట్ లోనే భారీ డీల్ లాంటిదొకటి ముంబై వేదికగానే చోటు చేసుకుంది.
ఒక రియాలిటీ సంస్థ నిర్మించిన లగ్జరీ హోమ్స్ డీల్ ఆశ్చర్య పరిచే రీతిలో ఉంది. వొర్లీ ఏరియాలో 23 లగ్జరీ హోమ్స్ ఏకంగా 1,200 కోట్ల రూపాయల ధరకు అమ్ముడుపోయాయి. ఒక్కో ఇంటి ధర అటు ఇటుగా 50 కోట్ల రూపాయలు!
మరో విశేషం ఏమిటంటే.. ఈ 23 ఇళ్లనూ ఒకే కుటుంబానికి సంబంధించిన దగ్గరి బంధువులే కొన్నారట! వీరంతా డీమార్ట్ ఫౌండర్ రాధాకృష్ణన్ దమానీ దగ్గరి బంధువులేనట. వారి కుటుంబీకులు, దగ్గరి బంధువులంతా కలిసి జాయింటుగా ఈ ఇళ్లన్నింటినీ కొన్నట్టుగా తెలుస్తోంది. బల్క్ డీల్ కావడంతో ఇళ్లు చావక ధరకు దక్కాయని కూడా అక్కడి రియలెస్టేట్ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు!
మామూలుగా ఒక్కొక్కటిగా కొని ఉంటే.. ఈ లగ్జరీ హోమ్స్ ధర అరవై కోట్ల రూపాయలపైనే అని అంటున్నారు. ఆ రియాలిటీ సంస్థకు కూడా వేరే లోన్లను క్లియర్ చేసుకునే అవసరం ఉండటంతో ఈ భారీ డీల్ కు ఒకేసారి ఓకే చెప్పిందని, ఒక్కో ఫ్లాట్ ను దాదాపు 50 కోట్ల ధరకు అమ్మేసిందని అంటున్నారు. ఇదే ఏరియాలో ఈ ఇళ్ల కన్నా కాస్త విస్తీర్ణం ఎక్కువగా ఉన్న లగ్జరీహోమ్స్ ను 75 కోట్ల రూపాయల ధర వరకూ అమ్మారట!
దేశ వాణిజ్య రాజధానిలో విలాసవంతమైన ఇళ్ల ధరలు సగటు పౌరుడిని నివ్వెరపోయేంత స్థాయిలో ఉన్నట్టున్నాయి! పది లక్షలు చేతిలో ఉంటే, 40 లక్షల రూపాయల లోన్ పెట్టి ఫ్లాట్ తీసుకుంటే జీవితంలో అది అతి పెద్ద సక్సెస్ గా భావించే వారు వంద కోట్ల మందికిపైనే ఉన్న దేశంలో ఒక్కో ఫ్లాట్ కోసం సింపుల్ గా 50 నుంచి 70 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే వాళ్లు హాట్ డీల్స్ తో వార్తల్లో నిలుస్తున్నారు!