బుట్ట బొమ్మ ఎలా మిస్ ఫైర్ అయింది?

కోవిడ్ టైమ్ లో ఓటిటి లో చకచకా సినిమాలు వస్తున్న రోజుల్లో ఆన్ లైన్ లో విడుదలయిన మలయాళ సినిమా కప్పెల. ఈ సినిమాను చూడగానే తెలుగులో చేసేయాలని సరదా పడ్డారు నిర్మాత నాగవంశీ.…

కోవిడ్ టైమ్ లో ఓటిటి లో చకచకా సినిమాలు వస్తున్న రోజుల్లో ఆన్ లైన్ లో విడుదలయిన మలయాళ సినిమా కప్పెల. ఈ సినిమాను చూడగానే తెలుగులో చేసేయాలని సరదా పడ్డారు నిర్మాత నాగవంశీ. చిన్న సినిమా. గట్టిగా మూడు నాలుగు కోట్లు మించి ఖర్చు కాదు. థియేటర్ కు కాకపోయినా ఓటిటికి అయినా ఇచ్చేయవచ్చు అనే ఆలోచన వుండనే వుంది. కానీ ఒక్కటే థింక్ చేయలేకపోయారు. నెగిటివ్ షేడ్ వున్న హీరో క్యారక్టర్ చేసేందుకు తెలుగులో ఎవరు ముందుకు వస్తారు అన్నది. అక్కడే ఫస్ట్ దెబ్బ తగిలింది.

తెలుగులో చాలా మందిని ఎలా అడిగినా ఆ క్యారెక్టర్ చేయడానికి నో అన్నదే సమాధానం అయింది. విష్వక్ సేన్, సుశాంత్, సత్యదేవ్, సిద్దు జొన్నలగడ్డ ఇలా చాలా మందిని ట్రయ్ చేసారు. కానీ ఫలితం దక్కలేదు. ఆఖరికి కొత్త కుర్రాడితో సెటిల్ అయ్యారు. దీని వల్ల చాలా టైమ్ తినేసింది. వడ్డీలు ప్రాఙెక్టు మీద పడిపోయాయి. అలా బడ్జెట్ పెరిగిపోయింది బుట్టబొమ్మ ప్రాజెక్టుకు.

మలయాళ సినిమా స్క్రీన్ ప్లేను మారుద్దామని ప్రయత్నిస్తున్నారు అని వార్తలు వినిపించాయి. కానీ ఒరిజినల్ సీన్లను,  స్క్రీన్ ప్లే ను తొంభై శాతం ఫాలో..ఫాలో అయిపోయారు. చాలా సీన్లలో డైలాగులు కూడా మలయాళ వెర్షన్ ను ఫాలో అయ్యాయి.

సహజంగా బుట్టబొమ్మ సినిమా థియేటర్ కు సెట్ అయ్యేది కాదు. సినిమా క్లయిమాక్స్ లో వచ్చే ట్విస్ట్ నే దానికి ఆయువుపట్టు. ఓటిటి పుణ్యమా అని అది తెలిసిపోయిన తరువాత ఎంత మంచిగా చూపిస్తున్నా, హీరో క్యారెక్టర్ జ‌నాలకు కనెక్ట్ కావడం కష్టం.  పైగా మలయాళ వెర్షన్ లో హీరోయిన్ పూర్తిగా ఇన్నోసెంట్. ఇక్కడ మాత్రం అలా కాదు. తండ్రి మీద అసంతృప్తితో వుంటుంది. తనకు ఓ బాయ్ ఫ్రెండ్ వుండాలని కోరుకుంటుంది.

గమ్మత్తేమిటంటే బాయ్ ఫ్రెండ్ కావాలని కృష్ణుడిని కోరుకోగానే హీరోలా కనిపించే విలన్ ను ఫోన్ లో పరిచయం చేయడం. అంటే దేవుడు విలన్ ను ప్రెండ్ గా ప్రసాదించాడనుకోవాలా? నిజానికి బుట్టబొమ్మకు కృష్ణుడు రక్షణగా వుంటాడు. తనతోనే వుంటాడు అన్నది ముందు నుంచి ఎస్టాబ్లిష్ చేయడం వరకు ఓకె. అదే విధంగా కృష్ణుడే కాపాడాడు మరో హీరో రూపంలో అన్నది ఏదో విధంగా చెప్పి వుంటే బాగుండేది. అలా చెప్పకుండా ఇలా చూపించడం వల్ల మిస్ కమ్యూనికేషన్ అయింది.

సినిమా తొలిసగం తిరిగిన చోటే తిరుగుతూ నసపెట్టినట్లు అయింది స్క్రీన్ ప్లే వల్ల. రోడ్ రోలర్ కు కట్టి లాగినా కదలనని కథ మొరాయించినట్లయింది. ద్వితీయార్థం బాగుందని అనిపించడానికి ఇదొక కారణం. ద్వితీయార్థంలో కాస్త థ్రిల్లింగ్ సీన్లు వుండడం మరో కారణం. తొలిసగానికి సరైన ఎంగేజ్డ్ స్క్రీన్ ప్లే అందించలేకపోయారు.

అసలు హీరోయిన్ క్యారెక్టర్ డిజైనింగ్ నే తెలుగు స్క్రీన్ ప్లే లో దెబ్బతినేసింది. హీరోయిన్ ఫ్రెండ్ బెటర్. బాయ్ ఫ్రెండ్ చేయి వేస్తే చెంప చెళ్లు మనిపించింది. కానీ హీరోయిన్ లాడ్జిలో హీరో దగ్గరకు లాక్కోగానే పెద్దగా అభ్యంతరం పెట్టదు. డైలాగుల్లో కూడా ఎంత సేపూ హీరోను మంచి వాడికి ఓవర్ ప్రోజెక్ట్ చేయడానికి ప్రయత్నించారు తప్ప, కొత్తగా ప్రయత్నించలేదు.కొత్త పదాలు వినిపించలేదు.

ప్రేమించడానికి అందం కావాలని కొత్తగా సూత్రీకరించారు. ప్రేమ అనేది ఇలాగే పుడుతుంది అని ఎవ్వరూ డిఫైన్ చేయలేదు. దానికి క్వాలిఫికేషన్ ఇదీ అని చెప్పలేదు. ఇప్పుడు కొత్తగా అందమే క్లాలిఫికేషన్ అని ఫిక్స్ చేసారు. మరి హీరోయిన్ స్నేహితురాలు అందంగా లేని కమెడియన్ ను ఎలా ప్రేమించినట్లో?

బుట్టబొమ్మను ఇలా మార్చాలని కానీ, మార్చ కూడదని కానీ ఓ ఐడియా పెట్టుకుని ముందుకు వెళ్లినట్లు లేదు. పైగా రివర్స్ మెథడ్ అన్నట్లుగా ముందు నుంచి వెనుక్కు..మళ్లీ ఫ్లాష్ కట్ లు వేసి చూపించిందే చూపించి బోర్ కొట్టించేసారు. హీరో..హీరోయిన్ల మీద వేసిన మాంటేఙ్ సాంగ్ అస్సలు ఇంట్రస్ట్ కలిగించడంలో విఫలమైంది.

చిన్న పాయింట్ లేదా చిన్న ట్విస్ట్ ల మీద బేస్ అయిన సినిమాలను ఈ డిజిటల్ యుగంలో రీమేక్ చేయడం అన్నది చాలా సాహసం. మొత్తం సమర్థవంతగా మార్చనన్నా మార్చగలగాలి. లేదా ఊరుకోవాలి. ఇలా అరకొరగా చేస్తే ఫలితం రాదు.