ప్రధాని నరేంద్ర మోడీ. 2014 ఎన్నికల ముందు ఆయన పేరు చెబితే దేశం యావత్తు ఊగిపోయేది. అప్పటికి రెండు పర్యాయాలు కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీయే ప్రభుత్వం వరస కుంభకోణాలతో అవినీతితో జనం విసిగి వేసారారు. దాంతో ఆల్టర్నేషన్ గా, అవతార పురుషుడిగా మోడీ జాతి జనులకు కనిపించారు.
అలా మోడీ ప్రధానిగా వచ్చారు. ఇక మొదటి దఫాలో ఎలా ఉన్నా గత రెండున్నరేళ్లలో మోడీ పాలన ఎలా ఉంది అంటే భారాల బతుకు దుర్బర జీవితం అంటూ జనం అనుకునేలా అన్నదే అందరి మాట. అవును అన్నింటా ధరలు పెరిగిపోయాయి.
దీని మీద కరెక్ట్ గా లెక్కలు తీసి చెప్పగలిగేది వామపక్షాల నేతలే. విశాఖలో సీపీఎం జిల్లా మహా సభల సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర కారదర్శి వర్గ సభ్యుడు ఎంవీఎస్ శర్మ అయితే మోడీ సర్కార్ ని చీల్చిచెండాడారు. జనాల మీద మరీ ఇంత పెద్ద ఎత్తున భారాలా అంటూ విమర్శించారు.
కేంద్రం అక్షరాలా పదహారు లక్షల కోట్ల భారాన్ని గత రెండున్నరేళ్లలో మోపిందని ఆయన గణాంకాలతో సహా వివరించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో ప్రత్యక్షంగా భారాలు పడితే, రవాణ చార్జీలు పెరిగి నిత్యావసరాల ధరలు దారుణంగా కొండకెక్కడంతో లక్షల కోట్ల భారాన్ని పేదలు, మధ్యతరగతి జనాలు మోయాల్సి వస్తోందని ఆవేదన చెందారు.
కార్పోరేట్ శక్తులకు పాలకులు కొమ్ము కాస్తున్నారని, దాని ఫలితమే ఇదంతా అంటూ శర్మ విశ్లేషించడం విశేషం. మొత్తానికి చూస్తే ఇన్ని లక్షల కోట్ల ప్రజల సొమ్ము ఖజానాకు చేరింది అన్న మాట. అది కూడా కరోనా కాలంలో కరువు కాలంలో ప్రజలు కట్టి పంటి బిగువున భారాలను మోసారు అంటే హేట్సాఫ్ అని ఎవరికి చెప్పాలో ఆర్ధిక వేత్తలే జవాబు చెప్పాలి మరి.