దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు, హీరో బాలకృష్ణకు పోలిక పెట్టలేం. వాక్చాతుర్యంలో కానీ, సినిమాల పరంగా గానీ, వ్యక్తిగతంగా కానీ వీళ్లిద్దరూ రెండు భిన్న ధృవాలు. కానీ ఒకే ఒక్క విషయంలో మాత్రం వీళ్లిద్దరి మధ్య చిన్న పోలిక తీసుకురావొచ్చు. ఇద్దరూ తెగ ప్రకటనలు గుప్పిస్తారు. కానీ వాటి అప్ డేట్స్ ను మాత్రం గాలికొదిలేస్తారు.
ముందుగా రామ్ గోపాల్ వర్మనే తీసుకుందాం. ఆర్జీవీ ఇప్పటివరకు ఎన్ని సినిమాలు ప్రకటించి ఉంటారు, వాటిలో ఎన్నింటిని సెట్స్ పైకి తీసుకొచ్చి ఉంటారు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం చాలా కష్టం. ఓ సినిమా ఎనౌన్స్ చేసి మరో సినిమాను స్టార్ట్ చేయడం ఆయనకు మాత్రమే సాధ్యమైన విద్య. గట్టిగా అడిగితే క్రియేటివ్ ప్రాసెస్ అంటారు. తనకు ఆ క్షణానికి నచ్చింది సినిమా తీస్తానని చక్కగా సమర్థించుకుంటారు.
అలా రామ్ గోపాల్ వర్మ ప్రకటించి, తీయని సినిమాల లిస్ట్ తీస్తే దాదాపు 10 ప్రాజెక్టులు కనిపిస్తాయి. వాటి అప్ డేట్స్ విషయంలో కూడా గమ్మత్తుగా రియాక్ట్ అవుతుంటారు వర్మ. కచ్చితంగా ఆ సినిమా తీస్తానని పదేపదే ప్రకటనలు ఇస్తుంటారు. మరో అడుగు ముందుకేసి అది తన డ్రీమ్ ప్రాజెక్టు అని కూడా చెప్పుకుంటారు.
సరిగ్గా ఇవే పోలికల్ని నటుడు బాలకృష్ణలో కూడా చూడొచ్చు. బాలకృష్ణ కూడా చాలా చెబుతారు. కానీ అది ఎప్పుడు సెట్స్ పైకి వస్తుందని మాత్రం ఆయన్ను అడక్కూడదు. ఎందుకంటే, ఆయనకు కూడా తెలియదు కాబట్టి. ఇంకా గట్టిగా అడిగితే దైవేచ్ఛ, కాలం కలిసిరావాలి, నుదిటి రాత లాంటి పదాలు ఆసువుగా వాడేస్తారు.
వీరబ్రహ్మేంద్రస్వామి మీద సినిమా అన్నారు, రామానుజాచార్య కథను తెరకెక్కిస్తానన్నారు. ఆదిత్య 369 సీక్వెల్ అన్నారు, ఆ సీక్వెల్ తోనే తన కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ అన్నారు. ఇలా ఎన్నో ప్రకటనలు చేశారు. తాజాగా భక్తి ఛానెల్ కూడా పెడతానేమో అంటూ మరో ప్రకటన ఇచ్చారు.
ఓవైపు ఇలా రకరకాల ప్రకటనలు గుప్పిస్తూనే, మరోవైపు తన సినిమాలేవో తాను చేసుకుంటూ బిజీ అయిపోతున్నారు. ఇలా చూసుకుంటే.. ఒక్కోసారి ఆర్జీవీ, బాలయ్య ఒకటే అనిపిస్తుంది.