ఈ సొసైటీలో ఒక మహిళ గళం విప్పడం అభినందించదగిన అంశం. శతాబ్దాలుగా స్త్రీని అణిచివేస్తున్న సమాజం మనది. ఎన్ని సుద్దులు చెప్పినా.. స్త్రీని సమాజం ఎలా చూస్తోందో వేరే చెప్పనక్కర్లేదు. ఇలాంటి క్రమంలో పలు రంగాల్లో రాణిస్తున్న వాళ్లు, ఆ రంగాల్లో ప్రతిభావంతమైన మహిళలను అభినందించాలి. అయితే మాట్లాడాల్సిన సమయంలో మాట్లాడితే అదో అందం, అభినందనీయం. అదే అర్థం లేనట్టుగా మాట్లాడితే మాత్రం అది అర్థరహితం.
ఇప్పటికే తన సాటి స్త్రీలను, తన సాటి హీరోయిన్లనూ కంగనా కించపరుస్తూ ఉంది. ఆమె తన అహంకారాన్ని చాటుకుంటూ ఉంది. కంగనా, ఆమె సోదరి.. తమలాగే పురుషాధిక్య ప్రపంచంలో పని చేస్తున్న పలువురు మహిళలను తీసికట్టుగా మాట్లాడుతున్నారు.
ఆ మధ్య తాప్సీని వీరు కెళుక్కున్నారు. తాప్సీని బీ గ్రేడ్ యాక్ట్రెస్ అంటూ తిట్టారు. అసలు సినిమా రంగంలో పని చేసే అమ్మాయిల మీదే సమాజంలో ఒక దారుణమైన అభిప్రాయాలున్నాయి. అవి ఎంతకూ మారడం లేదు. అలాంటప్పుడు వాళ్లలో వాళ్లే గౌరవించుకోకపోతే మరెవరైనా ఎలా గౌరవిస్తారు? ఎందుకు గౌరవిస్తారు? ఎవరు ఏ గ్రేడ్, ఎవరు బీ గ్రేడ్?
అంటే బీ గ్రేడ్ యాక్ట్రెస్ అంటే.. వాళ్లలో ఏం తక్కువ? తనను తాను కంగనా ఎక్కువగా ఫీల్ అయిపోవడం ఏమిటి? అలా ఎక్కువ అని ఫీల్ అయ్యే వాళ్ల మీదే కదా ఆమె పోరాడుతున్నట్టుగా చెప్పుకుంటున్నది. మళ్లీ ఆమె సుప్రిమసీ ఏమిటి?
ఇక ఊర్మిలను అయితే మరీ కించపరిచింది కంగనా. ఆమెను ఏకంగా సాప్ట్ పోర్న్ స్టార్ అంటూ అభివర్ణించింది. వాస్తవానికి కంగనా ఈ తరం నటేమో, రెండు దశాబ్దాల కిందటే కంగనా కన్నా చాలా ఎక్కువ గుర్తింపు, ఉన్నంతలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి ఊర్మిల.
ఈ కంప్యూటర్ యుగంలో కూడా కంగనా అంటే దేశంలో ఎంతమందికి తెలుసో కానీ, ఊర్మిల అంటే.. ఉత్తరాది, దక్షిణాది అంటూ తేడా లేకుండా.. మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆమెను బీ గ్రేడ్ యాక్ట్రెస్, సెమీ పోర్న్ స్టార్ అంటూ కంగనా నిందించింది.
అంటే.. బీ గ్రేడ్ నటీమణులు, సెమీ పోర్న్ నటీమణుల పట్ల కంగనాకు వివక్ష ఉందా? వాళ్లు మనుషులు కాదా? వాళ్లది నటన కాదా? తనది మాత్రమే నటన అని కంగనా ఫీలవుతోంది! వారసత్వంగా ఎవరైనా వస్తే వాళ్లను నెపోటిజం అంటుంది, సొంతంగా ఎదిగిన వారిని బీ గ్రేడ్ అంటోంది, ఇంతకీ ఏమిటి ఈమె మైండ్ సెట్? అహంకారం తప్ప మరేం కనిపించడం లేదు. ఇక అభిషేక్ బచ్చన్ గురించి కూడా అలా మాట్లాడింది కదా, మరి నెపోటిజమే ఇండస్ట్రీలో స్థిరపరచగలిగితే… అభిషేక్ అలా ఎలా మిగిలాడు?
ఇక కంగనా.. పలువురు వ్యక్తిగత జీవితాల్లోకి చొచ్చుకుపోయింది. సారా అలీఖాన్ – సుశాంత్ ల బ్రేకప్ కు కారణం కరీనా కపూరే అని, సుశాంత్ ను వదిలేయమని కరీనా సారాకు సలహా ఇచ్చిందని ఈమె చెప్పుకొచ్చింది. ఏదో రకంగా తన టార్గెట్ లోని వ్యక్తుల గురించి నోరు పారేసుకోవడానికి కంగనా ఏదో ఒకటి సృష్టించుకుంటోంది తప్ప.. ఈమె నమ్మదగిన వ్యక్తి కాదు.. అనే అభిప్రాయాన్ని బలపరుస్తున్నట్టుగా ఉంది.