అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో మళ్లీ డొనాల్డ్ ట్రంప్ రాసలీలలపై చర్చ తెరమీదకు వస్తోంది. గత పర్యాయం తొలిసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగినప్పుడే ట్రంప్ మీద అనేక మంది మహిళలు రకరకాల అభియోగాలు మోపారు. అతడు తమను వేధించాడని, రేప్ చేశాడంటూ కూడా పలువురు ఆరోపించారు. ఎప్పుడో దశాబ్దాల కిందట అలా జరిగిందని ట్రంప్ గురించి వారు ఆరోపించారు. కొందరు డేట్లు, స్థలాలతో సహా చెప్పి ట్రంప్ వేధించాడంటూ వాపోయారు.
అలా ఎన్ని ఆరోపణలు వచ్చినా ట్రంప్ ను వైట్ హౌస్ లో అడుగుపెట్టనీయకుండా అవి ఆపలేకపోయాయి. ఇక గెలిచాకా కూడా ట్రంప్ విషయంలో అవి తగ్గుముఖం పట్టలేదు. అనేక మంది మోడళ్లు ట్రంప్ గురించి లైంగిక వేధింపుల ఆరోపణలు, అనుభవాలను వివరించారు. వాటిని అస్సలు లెక్క చేయడం లేదు ట్రంప్.
ఈ క్రమంలో మరోసారి యూఎస్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యేందుకు ఆయన ప్రయత్నాలు ముమ్మరంగా సాగిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో మళ్లీ ట్రంప్ గురించి అలాంటి కథనాలే వస్తున్నాయి. తాజాగా ఒక మాజీ మోడల్ ట్రంప్ తనను ఎలా వేధించాడో వివరించింది.
ఒక టెన్నిస్ మ్యాచ్ కు తను అతిథిగా హాజరు కాగా, అప్పటికే ప్రముఖ వ్యాపారవేత్తగా ట్రంప్ ఆ కార్యక్రమానికి వచ్చారని.. ఆ సమయంలో ఆయన తనతో అనుచితంగా ప్రవర్తించారని ఆమె ఆరోపించింది. ట్రంప్ తన వక్షాలపై చేతులు వేశాడని, తన పిరుదులను తడిమాడని, తన శరీరాన్నంతా అయాచితంగా తాకాడని ఆమె వివరించింది. తను ఆయనను నెట్టివేసిన ఆయన అలా రెచ్చిపోయి ప్రవర్తించాడని ఆ మోడల్ వివరించింది. ఈ మేరకు బ్రిటీష్ డైలీ 'ది గార్డియన్' కు ఆమె ఇంటర్వ్యూ ఇచ్చింది. అయినా ట్రంప్ విషయంలో ఇలాంటి ఆరోపణలేవీ కొత్త కాదు కదా!