చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కొడాలి నాని.. వీరిద్దరికీ పోలిక పెట్టే ప్రయత్నం ఇప్పటివరకూ ఎవరూ చేయలేదు. వీరి మధ్య పోటీ కానీ, వ్యతిరేకత కానీ లేదు. కానీ.. ఇప్పుడో చిక్కొచ్చిపడింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వల్ల కొడాలి నాని ఇబ్బంది పడుతున్నారని చెప్పలేం కానీ.. సోషల్ మీడియాలో చెవిరెడ్డి పేరు చెప్పి నానిని టార్గెట్ చేస్తున్నారు కొంతమంది.
సీమ సంస్కారం, కృష్ణా జిల్లా రౌడీయిజం అంటూ ప్రాంతీయ చిచ్చు కూడా రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కుటిల రాజకీయాలు టీడీపీ బ్యాచ్ వేనని వేరే చెప్పాల్సిన పనిలేదు కానీ.. ఇక్కడ చెవిరెడ్డి చేసిన ఓ నమస్కారం సంచలనానికి కేంద్ర బిందువైంది.
ఆ మధ్య చిత్తూరు జిల్లాలో వరద బాధితుల పరామర్శకు వెళ్లిన చంద్రబాబు, తన కాన్వాయ్ లో వెళ్తుండగా.. అక్కడే ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆ కాన్వాయ్ ని చూసి నిలబడి మరీ చంద్రబాబుకి నమస్కారం పెట్టారు. కారులో నుంచే చంద్రబాబు ప్రతినమస్కారం చేయగా.. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ ఆ తర్వాతే అసలు విషయం మొదలైంది.
చంద్రబాబు, లోకేష్ పేరెత్తితే మండిపడే కొడాలినానికి చెవిరెడ్డి వీడియోని ట్యాగ్ చేస్తూ టీడీపీ సోషల్ మీడియాలో కొంతమంది హడావిడి చేయడం మొదలుపెట్టారు. వైసీపీకి చెందిన కొడాలి నాని చంద్రబాబుని బండబూతులు తిడతారని, అదే పార్టీకి చెందిన చెవిరెడ్డి మాత్రం చంద్రబాబుని చూసి లేచి నిలబడి నమస్కారం చేశారని, అదీ ఆయన సంస్కారం అని కామెంట్లు పెడుతున్నారు.
చెవిరెడ్డి సీమ సంస్కారం చూపించారని, కొడాలి నాని కృష్ణాజిల్లా రౌడీయిజాన్ని చూపించారని లేనిపోని పోలికలు తెచ్చిపెడుతున్నారు. అది కొడాలి స్టైల్, ఇది చెవిరెడ్డి స్టైల్.. ఇద్దరికీ ఎక్కడా పోలిక లేదు. కానీ కావాలనే టీడీపీ బ్యాచ్ పోలిక తీసుకొచ్చి మరీ కొడాలిని టార్గెట్ చేసింది.
చెవిరెడ్డిని చూసి సంస్కారం నేర్చుకోవాలని హితవు చెబుతోంది. మరి వయసు పెరిగినా సంస్కార హీనంగా మాట్లాడే చంద్రబాబుకి టీడీపీ బ్యాచ్ ఈ సూచన చేస్తుందా..? అడ్డమైన బూతులు తిడుతున్న లోకేష్ ను, చెవిరెడ్డిని చూసి నేర్చుకో అని చెప్పొచ్చు కదా..?
గాల్లోనే వచ్చాడు, గాల్లోనే పోతాడంటూ.. తన అక్కసునంతా వెళ్లగక్కిన చంద్రబాబు సంస్కారానికి శాసనసభలో సీఎం జగన్ నమస్కారం పెట్టారు. మీ సంస్కారానికి నా నమస్కారం బాబూ అంటూ సెటైర్ పేల్చారు. జగన్ ని నేరుగా ఎదుర్కోవడం చేతగాక.. ఆయనకి హాని జరిగితే తాను గద్దెనెక్కచ్చనే నీఛపు ఆలోచనలు చంద్రబాబు చేస్తున్నారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఆ విమర్శల్లో నిజం లేకపోలేదు, అదే చంద్రబాబు నైజం.
చంద్రబాబులో ఉన్న ఆ వక్రదృష్టిని కొడాలి నాని పరుషపదజాలంతో ఎదుర్కొంటే.. చంద్రబాబు వయసుకి మాత్రమే గౌరవం ఇస్తూ చెవిరెడ్డి లేచి నిలబడి నమస్కారం చేశారు. అక్కడ అది కరెక్ట్ అయితే ఇక్కడ ఇది కరెక్ట్. అంతమాత్రాన ఇద్దరి మధ్య పోలికలు పెట్టి రాక్షసానందాన్ని పొందాలని చూడటం టీడీపీకే చెల్లింది.