విడదీయలేని బంధం దర్శకుడు త్రివిక్రమ్-హీరో పవన్ కళ్యాణ్ లది. అది అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఐడియాలజీని చాలా వరకు త్రివిక్రమ్ ప్రభావితం చేసారు అనీ టాక్ వుంది. పవన్ జంథ్యం వేసుకోవడం, హోమాలు, యాగాలు, ఆఖరికి చాతుర్మాస వ్రతాలు వీటన్నింటి వెనుక త్రివిక్రమ్ వున్నారని టాక్ వుంది.
అలాంటి త్రివిక్రమ్-పవన్ కలిపి మంచి సినిమాలు అందించారు. జల్సా, అత్తారింటికి దారేది లాంటి బ్లాక్ బస్టర్లు ఇచ్చిన తరువాత అజ్ఞాతవాసితో గురి తప్పింది. అంత దారుణ పరాజయం మరొకటి లేదు. అసలు అంత దారుణంగా ఆ సినిమాను జనం ఎందుకు తిప్పికొట్టారన్నది త్రివిక్రమ్ విశ్లేషణకు కూడా అందిందా అన్నది అనుమానమే.
ఇలాంటి నేపథ్యంలో త్రివిక్రమ్ మళ్లీ అరవింద సమేత, అలవైకుంఠపురములో సినిమాలతో బౌన్స్ బ్యాక్ అయ్యారు. ఎన్టీఆర్ తో మరో సినిమా చేయబోతున్నారు. అజ్ఞాతవాసి తరువాత పాలిటిక్స్ లో చురుగ్గా పాల్గోన్న పవన్ కళ్యాణ్ మళ్లీ వెనక్కు వచ్చి సినిమాలు చేయడం ప్రారంభించారు.
త్రివిక్రమ్-పవన్ తరచు కలుస్తున్నారు, మాట్లాడుకుంటున్నారు. పవన్ చేసే సినిమాలు, వాటి సంగతులు, వాటి స్టార్ కాస్ట్, టెక్నికల్ కాస్ట్ అన్నీ వారిద్దరి మధ్య డిస్కషన్ కు వస్తున్నాయని కూడా బోగట్టా. కానీ ఈ ఇద్దరు కలిసి సినిమా చేస్తారా? చేయరా? అన్నదే అనుమానం.
నిజానికి త్రివిక్రమ్ అనుకంటే అది క్షణాల్లో పని. ఆయన ఎప్పుడు సెట్ మీదకు వెళ్దాం అన్నా, చేస్తున్న సినిమాలు అన్నీ పక్కన పెట్టి అయినా పవన్ వస్తారు. అందులో సందేహం లేదు. కానీ తివిక్రమ్ అనుకొవడం లేదు.
ఆయనకు ఎన్టీఆర్ సినిమా కమిట్ మెంట్ వుంది కదా? అని ఎవరైనా అనొచ్చు. మరి ఆ తరువాత? అసలు పవన్ మళ్లీ సినిమాల్లోకి వస్తారన్న సంగతి త్రివిక్రమ్ కు తెలియకుండా అయితే జరిగివుండదు. అప్పుడు ఆ సినిమాల మధ్యలో తనకు ఓ సినిమా ప్లాన్ చేయడం అన్నది పెద్ద విషయం కాదు. కానీ ఆ దిశగా అడుగులు పడలేదు?
పైగా ఎన్టీఆర్ సినిమా తరువాత రామ్ చరణ్ తో సినిమా చేస్తారని, దానికి పవన్ కళ్యాణ్ బ్యానర్ సమర్పణ వుంటుందని వినిపిస్తోంది. ఎన్టీఆర్ సినిమా తరువాత కూడా పవన్ తో సినిమా ఎందుకు ప్లాన్ చేయడం లేదు? పైగా త్రివిక్రమ్ హోమ్ బ్యానర్ హారిక హాసిని అనుబంధం సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ పవన్ తో సినిమా చేయాలని ఆలోచిస్తున్నట్లు బోగట్టా. దాని కోసం వెంకీ అట్లూరి, ఇంకా మరో ఒకరిద్దరితో కథలు తయారు చేయించే పనిలో వున్నారు.
అంటే తమ దగ్గర వున్న ఏస్ డైరక్టర్ త్రివిక్రమ్ తో కాకుండా వెంకీ అట్లూరి, ఇంకా అలాంటి మిడ్ రేంజ్ డైరక్టర్లను ఎందుకు ట్రయ్ చేస్తున్నట్లు? అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ విషయంలో పవన్ పేరు వినిపించినా, డైరక్టర్ గా ఎవ్వరి పేరు పక్కాగా వినిపించలేదు. అంటే మొత్తం మీద ఇప్పట్లో హారిక హాసిని లేదా సితారలో పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమా అయితే వుండదు. ఎన్టీఆర్, ఆ తరువాత రామ్ ఛరణ్, ఆపై బన్నీ ఇలా యంగ్ హీరోల పేర్లు వినిపిస్తున్నాయి తప్ప త్రివిక్రమ్ లైనప్ లో పవన్ పేరు వినిపించడం లేదు.
అంటే తమ కాంబినేషన్ అంటే మరీ అంచనాలు పెరిగిపోయి వాటిని అందుకోలేకపోతామేమో అన్న అనుమానం వుండి వుండాలి. లేదా అజ్ఞాతవాసి విఫలం కావడానికి కారణం పవన్ కు వున్న రాజకీయ బంధాలు, వాటి వ్యతిరేకవర్గాలు కారణం అనే అంచానా అయినా వుండి వుండాలి. అలాంటి నేపథ్యంలో తాను-పవన్ కలిసి మళ్లీ సినిమా చేస్తే లేని పోని ఇబ్బందులు అనే ఆలోచన అయినా వుండి వుండాలి.
మొత్తం మీద త్రివిక్రమ్ కు పవన్ కు బంధాలు బాగానే వున్నాయి. హారిక హాసిని లేదా సితారతో పవన్ అనుబంధాలు కూడా గట్టిగానే వున్నాయి. కానీ త్రివిక్రమ్-పవన్ కాంబో సినిమా మాత్రం ఇప్పట్లో వుండదని అంతకన్నా గట్టిగా అనుకోవాల్సి వస్తోంది.