సుశాంత్ పై సింపతీ పోతోందా… అసలు నిజమేంటి?

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత బాలీవుడ్ లో నెపోటిజంపై తీవ్ర చర్చ జరుగుతోంది. అగ్ర హీరోలు, అగ్ర నిర్మాతలు, ప్రొడక్షన్ కంపెనీలు, కొంతమంది దర్శకుల కారణంగానే సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడని…

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత బాలీవుడ్ లో నెపోటిజంపై తీవ్ర చర్చ జరుగుతోంది. అగ్ర హీరోలు, అగ్ర నిర్మాతలు, ప్రొడక్షన్ కంపెనీలు, కొంతమంది దర్శకుల కారణంగానే సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపణలొచ్చాయి. సుశాంత్ అవకాశాలకు గండి పడటం వల్లే ఆయన ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని నెపోటిజాన్ని హైలెట్ చేశారు. కంగనా రనౌత్ లాంటి హీరోయిన్లు ఈ నెపోటిజంపై తీవ్ర విమర్శలు చేసి చాలామందిని టార్గెట్ చేశారు.

కానీ ఇప్పుడా నెపోటిజం ఎగిరిపోయి, ఆ స్థానంలో డ్రగ్స్ కేసు హైలెట్ అవుతోంది. రియా చక్రబొర్తిని పోలీసులు అరెస్ట్ చేసి కూపీ లాగుతున్నారు. ఆమె తమ్ముడితో పాటు మరికొంతమంది డ్రగ్స్ సరఫరాదారుల్ని అదుపులోకి తీసుకున్నారు. దీంతో సుశాంత్ ఆత్మహత్య కేసు కాస్తా, డ్రగ్స్ కేసుగా రూపాంతరం చెందింది. ఈ కేసులో బైటపడుతున్న విషయాలు చూస్తుంటే అసలు సుశాంత్ ఆత్మహత్యకు కారణాలు ఏంటా అనే అనుమానం కలగకమానదు.

సుశాంత్ తండ్రి ఆరోపించినట్టు ఆయన డబ్బుల్ని రియా చక్రవర్తి ఇతర అకౌంట్లకు తరలించలేదంటోంది ఈడీ. ఆయన్ని మోసం చేయలేదు. ఆమె చేసిందల్లా సుశాంత్ తో కలసి డ్రగ్స్ పార్టీలు చేసుకోవడం. ఈ వ్యవహారం అంతా ఇప్పుడు లోనావాలా ఫామ్ హౌస్ చుట్టూ తిరుగుతోంది. ఈ ఫామ్ హౌస్ సుశాంత్ దే. ఇక్కడ తరచూ రేవ్ పార్టీలు జరిగేవని ఫామ్ హౌస్ లో రెండేళ్లుగా పనిచేస్తున్న మేనేజర్ ఓ న్యూస్ ఏజెన్సీకి చెప్పినట్టు వార్తలొస్తున్నాయి.

రాయిస్ అనే సదరు మేనేజర్ ఇచ్చిన సమాచారం ప్రకారం ప్రతి వారాంతం అక్కడ పార్టీలు జరిగేవట. సైఫ్ అలీఖాన్ కుమార్తె సారా అలీఖాన్ ఈ పార్టీలకు సుశాంత్ తో కలసి హాజరయ్యేదట. కాస్ట్ లీ వోడ్కాతో పాటు.. గంజాయి కూడా ఈ పార్టీల్లో ఇచ్చేవారట. ఇక స్మోకింగ్ పేపర్ ని కూడా పెద్ద మొత్తంలో తెప్పించేవారట. డ్రగ్స్ తీసుకోవడంలో దీన్ని ప్రధానంగా వాడతారు.

ఈ ఫామ్ హౌస్ వ్యవహారం చూస్తే.. సుశాంత్ సింగ్ ఆత్మహత్యకు అసలు నెపోటిజమే కారణమా అనే అనుమానం కలుగుతుంది. ఫామ్ హౌస్ మెయింటెన్ చేసే స్థాయి ఉన్న సుశాంత్, ప్రతి వీకెండ్ ఫ్రెండ్స్ కి పార్టీలు ఇస్తూ, ఎంజాయ్ చేసేవాడట. చేతిలో సినిమాలున్నాయి, ఆస్తులు సంపాదించుకుంటున్నాడు, ఈ దశలో సుశాంత్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? డ్రగ్స్ కి బానిసై ఆయన ఆత్మహత్య చేసుకున్నాడా లేక నిజంగానే సినిమా అవకాశాలు లేక, రాక చనిపోయాడా, లవ్ ఫెయిల్యూరా, ప్రేమతో పాటు డబ్బూ పోగొట్టుకున్నాడా? అనే విషయాలపై మరింత సందిగ్ధత ఏర్పడింది.

ఇవన్నీ పక్కనపెడితే.. ఓ సెక్షన్ మీడియా వేదికగా బయటకొస్తున్న ఈ సమాచారంలో నిజమెంత అనేది కూడా తేలాల్సి ఉంది. మొత్తమ్మీద సుశాంత్ కేసు ఇలా అనూహ్య మలుపులు తిరుగుతోంది. ప్రస్తుతం మీడియా Vs ఎన్సీబీ అన్నట్టు తయారైంది ఈ కేసు. చివరికి దీన్ని ఎక్కడ ముగిస్తారో చూడాలి.

చంద్రబాబుకి నిద్ర లేకుండా చేస్తున్న అమరావతి