టీడీపీ కొంప ముంచిన లాయ‌ర్ లూథ్రా!

టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల ఆత్మ విశ్వాసం దెబ్బ‌తినేలా చంద్ర‌బాబునాయుడు న్యాయ‌వాది సిద్ధార్థ లూథ్రా ట్వీట్ చేశార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. టీడీపీ కొంప ముంచాడ‌ని ఆ పార్టీ నాయ‌కులు ల‌బోదిబోమంటున్నారు. స్కిల్ స్కామ్‌లో అరెస్ట్ అయిన…

టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల ఆత్మ విశ్వాసం దెబ్బ‌తినేలా చంద్ర‌బాబునాయుడు న్యాయ‌వాది సిద్ధార్థ లూథ్రా ట్వీట్ చేశార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. టీడీపీ కొంప ముంచాడ‌ని ఆ పార్టీ నాయ‌కులు ల‌బోదిబోమంటున్నారు. స్కిల్ స్కామ్‌లో అరెస్ట్ అయిన చంద్ర‌బాబునాయుడు ప్ర‌స్తుతం రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. చంద్ర‌బాబునాయుడు జైలు గ‌డ‌ప తొక్క‌కుండా నిలువ‌రించేందుకు ఢిల్లీ నుంచి అత్యంత ఖ‌రీదైన ప్ర‌ముఖ న్యాయ‌వాది సిద్ధార్థ లూథ్రాను విజ‌య‌వాడ‌కు తీసుకొచ్చారు.

అరెస్ట్ అయిన త‌ర్వాత ఆయ‌న్ను ఏసీబీ కోర్టులో హాజ‌రుప‌రిచారు. బాబుకు రిమాండ్ త‌ప్పించేందుకు సిద్ధార్థ లూథ్రా త‌న శ‌క్తియుక్తుల్ని ప్ర‌యోగించారు. అయినా సీఐడీ త‌ర‌పున న్యాయ‌వాది సుధాక‌ర్‌రెడ్డి వాద‌న‌లే నెగ్గాయి. దీంతో చంద్ర‌బాబును రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల‌కు త‌ర‌లించారు. ఆ త‌ర్వాత ప్ర‌య‌త్నంలో హౌస్ రిమాండ్‌కు అనుమ‌తించాల‌ని మ‌రో పిటిష‌న్ వేశారు.

దేశంలో ఎక్క‌డెక్క‌డ ఏఏ సంద‌ర్భాల్లో హౌస్ రిమాండ్ విధించారో కోర్టు ముందు లూథ్రా వుంచారు. ప్చ్‌…లూథ్రా ప‌ప్పులుడ‌క‌లేదు. తాజాగా హైకోర్టులో క్వాష్ పిటిష‌న్ వేశారు. వెంట‌నే వాద‌న‌లు వినాల‌న్న లూథ్రా అభ్య‌ర్థ‌న‌పై న్యాయ‌మూర్తి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వ‌చ్చే వారానికి కేసు వాయిదా వేశారు. దీంతో లూథ్రా పేరు కాస్త చంద్ర‌బాబు కేసు పుణ్యాన తేలిపోయింది. అబ్బే…లూథ్రాకు కోట్లాది రూపాయ‌లు ఇచ్చినా ప్ర‌యోజ‌నం లేద‌ని టీడీపీ నేత‌లు నిట్టూర్చుతున్నారు. ఈ నేప‌థ్యంలో టీడీపీ మ‌రింత‌గా నిరాశ‌నిస్పృహ‌ల్లో కూరుకుపోయేలా లూథ్రా ట్వీట్ ఎఫెక్ట్ చూపుతోంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఆ ట్వీట్ ఏంటో చూద్దాం.

 “అన్ని విధాలుగా ప్ర‌య‌త్నించిన‌ప్పుడు ఇంకా న్యాయం క‌నుచూపు మేర‌లో లేద‌ని తెలిసిన‌ప్పుడు… క‌త్తి తీసి పోరాటం చేయ‌డ‌మే స‌రైంది” అని గురు గోవింద్ సింగ్ చేసిన వ్యాఖ్య‌ల‌ను ఆయ‌న ట్వీట్ చేశారు. “ఇదే ఈ రోజు మా నినాదం” అని కూడా ఆయ‌న పేర్కొనడం గ‌మ‌నార్హం. అంటే ఇప్ప‌ట్లో చంద్ర‌బాబుకు బెయిల్ దొర‌క‌ద‌ని తేలిపోయిందంటూ న్యాయ‌వ‌ర్గాలు లూథ్రా ట్వీట్‌కు అర్థాల్ని చెబుతున్నాయి. 

చంద్ర‌బాబు లాయ‌ర్ ట్వీట్ చ‌దివితే…చిన్న‌పిల్లాడికైనా అర్థ‌మ‌య్యేది ఏంటంటే, ఇప్ప‌ట్లో బాబుకు బెయిల్ వ‌స్తుంద‌నే ఆశ‌ను వ‌దులుకోవాల్సిందే అనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. లూథ్రా ట్వీట్‌తో టీడీపీ శ్రేణులు ఆందోళ‌న‌కు గుర‌వుతున్నాయి.