బాబుతో ములాఖ‌త్‌కు ప‌వ‌న్‌!

చంద్ర‌బాబునాయుడి అరెస్ట్‌తో తీవ్రంగా హ‌ర్ట్ అయిన వారిలో జ‌న‌సేనాని ప‌వ‌న్ ఒక‌రు. బ‌హుశా ర‌క్త సంబంధీకుల కంటే ఎక్కువ‌గా ఆయ‌న కుమిలిపోతున్నార‌ని ప‌వ‌న్ వ్య‌వ‌హార శైలే చెబుతోంది. ఈ నేప‌థ్యంలో రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో…

చంద్ర‌బాబునాయుడి అరెస్ట్‌తో తీవ్రంగా హ‌ర్ట్ అయిన వారిలో జ‌న‌సేనాని ప‌వ‌న్ ఒక‌రు. బ‌హుశా ర‌క్త సంబంధీకుల కంటే ఎక్కువ‌గా ఆయ‌న కుమిలిపోతున్నార‌ని ప‌వ‌న్ వ్య‌వ‌హార శైలే చెబుతోంది. ఈ నేప‌థ్యంలో రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైల్లో చంద్ర‌బాబుతో గురువారం ప‌వ‌న్‌క‌ల్యాణ్ ములాఖ‌త్ కానున్నారు. ఈ మేర‌కు జైలు అధికారులు ఆయ‌న‌కు అనుమ‌తి ఇచ్చారు.

బాబుతో ప‌వ‌న్ 40 నిమిషాల పాటు భేటీ కానున్నారు. ఈ భేటీలో టీడీపీ, జ‌న‌సేన మ‌ధ్య పొత్తు అంశం చర్చ‌కు రావ‌చ్చ‌ని అంటున్నారు. త‌న‌ను జైలుపాలు చేసిన సీఎం వైఎస్ జ‌గ‌న్‌పై చంద్ర‌బాబు మ‌రింత ఆగ్ర‌హంతో ర‌గిలిపోతుంటార‌న‌డంలో సందేహం లేదు. ఎలాగైనా రానున్న ఎన్నిక‌ల్లో ఓడించాల‌నే ప‌ట్టుద‌ల స‌హ‌జంగానే చంద్ర‌బాబులో పెరిగి వుంటుంది. ఇదే అవ‌కాశంగా తీసుకుని ప‌వ‌న్‌క‌ల్యాణ్ సీట్ల‌పై డిమాండ్ పెట్టే అవ‌కాశాల‌ను కొట్టి ప‌డేయ‌లేం.

బాబుతో ప‌వ‌న్ ములాఖ‌త్‌కు ఎంతో ప్రాధాన్యం వుంద‌ని జ‌న‌సేన నేత‌లు చెబుతున్నారు. టీడీపీ, జ‌న‌సేన మ‌ధ్య అధికారిక పొత్తుకు రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలు వేదిక కావ‌చ్చ‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. బాబుతో భేటీ త‌ర్వాత ప‌వ‌న్ మీడియాతో మాట్లాడ‌నున్నారు. భ‌విష్య‌త్ రాజ‌కీయ పంథాపై ఆయ‌న ఏమంటార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. బాబును అరెస్ట్ చేసిన‌ప్ప‌టికీ బీజేపీ మాత్రం మాట‌ల‌తో స‌రిపెడుతోందే త‌ప్ప‌, ఆయ‌న్ను క‌లిసే ప్ర‌య‌త్నం చేయ‌డం లేదు.

దీంతో బీజేపీతో మిత్ర‌ప‌క్షంగా ఉన్న ప‌వ‌న్‌క‌ల్యాణ్ నిర్ణ‌యంపై స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కుంది. బీజేపీతో సంబంధం లేకుండా టీడీపీతో క‌లిసి రాజ‌కీయ ప్ర‌యాణం సాగిస్తాన‌ని ప‌వ‌న్ అంటారా?  లేక మూడు పార్టీలు ఐక్యంగా జ‌గ‌న్‌ను ఎదుర్కొంటాయ‌ని చెబుతారా? అనేది ఆస‌క్తి రేపుతోంది. చంద్ర‌బాబు అరెస్ట్ అనేది టీడీపీ, జ‌న‌సేన దృష్టిలో భావోద్వేగంతో ముడిప‌డిన అంశం. ప‌వ‌న్ మెత్త‌బ‌డి టీడీపీ కోసం త్యాగానికి సిద్ధ‌ప‌డ‌తారా?  లేక అవ‌కాశంగా తీసుకుని లాభ‌ప‌డ‌తారా? అనేది తేలాల్సి వుంది.