ఆంధ్రలో రెండే పార్టీలు

కేంద్రలో ఎన్ఢీఎ, ఇండియా అనే రెండు రాజకీయ కూటములు. లేదా ప్రో బీజేపీ లేదా యాంటీ బీజేపీ అనే రెండు రకాల జనాలు. ఎలా చూసుకున్నా ఇంతే. ఇప్పుడు ఆంధ్రలో కూడా అంతే ప్రో…

కేంద్రలో ఎన్ఢీఎ, ఇండియా అనే రెండు రాజకీయ కూటములు. లేదా ప్రో బీజేపీ లేదా యాంటీ బీజేపీ అనే రెండు రకాల జనాలు. ఎలా చూసుకున్నా ఇంతే. ఇప్పుడు ఆంధ్రలో కూడా అంతే ప్రో జగన్ లేదా యాంటీ జగన్. లేదూ… ప్రో చంద్రబాబు లేదా యాంటీ చంద్రబాబు. పార్టీలు అన్నీ పేరుకే . పార్టీ సభ్యత్వాలు కూడా నామ మాత్రమే. ఐడియాలజీ ప్రకారమే ముందుకు వెళ్తున్నారు. 

ఆంధ్రలో నిజానికి మూడో పార్టీ వుంది. కానీ అవకాశాలు అందిపుచ్చుకోవడం లేదు. జనసేన పార్టీకి నిజానికి ఇది బంగారు అవకాశం. రెండు పార్టీలు దొందుకు దొందే అని గట్టిగా ఫైట్ చేయాల్సిన తరుణం. కానీ జనసేన ఆదికి ముందుగానే తెలుగుదేశం పార్టీ అనుబంధంగా మారిపోతూ వస్తోంది. ముఖ్యంగా చంద్రబాబు అరెస్ట్ విషయంలో ఈ తరహా వైఖరి చాలా స్పష్టంగా కనిపిస్తోంది.

ఎప్పుడైతే నాయకుడు పవన్ కళ్యాణ్ పూర్తిగా తెలుగుదేశం వైపు మొగ్గిపోయినట్లు కనిపిస్తున్నారో, కేడర్ కూడా అదే తీరుగా మారుతున్నారు. నిన్నటికి నిన్న రాజమండ్రిలో జనసేన జిల్లా నేత తేదేపా యువనేత లోకేష్ వెన్నెంటే వున్నారు. ఇది పార్టీ కార్యకర్తల్లోకి జనాల్లోకి ఎలా వెళ్తుంది. రెండు పార్టీలు ఒక్కటే అన్న ఫీల్ జనాల్లోకి వెళ్తోంది. దీనివల్ల తెలుగుదేశం పార్టీకి లాభం వుండొచ్చు. కానీ జనసేనకు మాత్రం కాదు. ఎందుకంటే తేదేపా పోటీ చేసినన్ని స్థానాల్లో జనసేన పోటీ చేయదు. అలాగే తేదేపా నాయకులు జనసేన నాయకుల వెనుక తిరగడం లేదు.

మరోపక్క భాజపా జనాల వైఖరి కూడా ఇలాగే వుంది. విశాఖ విష్ణు కుమార్ రాజు కావచ్చు, పురంధీశ్వరి కావచ్చు పూర్తిగా తేదేపా అనుకూల వైఖరి కనబరుస్తున్నారు. ఈ తరహా వైఖరి ఆంధ్ర భాజపాలో దాదాపు దశాబ్దాలుగా నెలకొని వుంది. అందువల్లనే ఆంధ్రలో భాజపా ఎదుగు బొదుగు లేకుండా వుంది. వామపక్షాలు కూడా ఇదే దారిలో పోయి పోయి అంతరించి పోయే స్థితికి చేరుకున్నాయి.

జగన్ కు వ్యతిరేకంగా ఒక్కటి కాక తప్పలేదు అని చెప్పడం వరకు ఓకె. కానీ ముందుగా ఎవరి ఫైట్ వారు సాగించి, ఎవరి బలం వారు పెంచుకుని, ఎన్నికల సమయంలో ఒక్కటిగా కలిసి పోటీ చేస్తే ఎవరి అస్థిత్వం వారికి వుంటుంది. అప్పుడు ఓ సమాన స్థాయి వుంటుంది.

జాతీయ స్థాయిలో కలిసి పార్టీలు అన్నీ వెళ్తున్న తీరు వేరు. ఏ పార్టీకి ఆ పార్టీ బలం పెంచుకుంటూ ముందుకు వెళ్తున్నాయి. కానీ ఆంధ్రకు వచ్చేసరికి కేవలం వైకాపా, తేదేపా మాత్రమే బలం పెంచుకుంటున్నాయి. మిగిలినవి తోక పార్టీలుగా మిగిలిపోతున్నాయి. వాటికి అనుగుణంగా కేడర్, నాయకులు నడుచుకుంటూ వుంటే ఇక ఎప్పటికి ఆంధ్రలో మరో కొత్త పార్టీ లేదా మూడో పార్టీ అనేది అధికారం దిశగా నడవడం కష్టమే అనుకోవాల్సి వస్తోంది.