దిశా హత్య కేసు.. నిందితులకు పోలీస్ కస్టడీ

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశా అత్యాచారం, హత్య కేసులో కీలక నిందితులు నలుగుర్ని పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది కోర్టు. 10 రోజుల పాటు వీళ్లను కస్టడీలో ఉంచుకోవచ్చంటూ వెల్లడించింది. నిందితుల వాంగ్మూలం…

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశా అత్యాచారం, హత్య కేసులో కీలక నిందితులు నలుగుర్ని పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది కోర్టు. 10 రోజుల పాటు వీళ్లను కస్టడీలో ఉంచుకోవచ్చంటూ వెల్లడించింది. నిందితుల వాంగ్మూలం రికార్డు చేయాలని, దిశా మొబైల్ ఫోన్ ను కూడా రికవరీ చేయాల్సి ఉందని, దీనికి సంబంధించి నిందితుల్ని తమకు అప్పగించాలని పోలీసులు పిటిషన్ వేశారు. దీంతో పాటు విచారణకు సంబంధించి మరిన్ని వివరాల్ని రాబట్టాల్సి ఉందని వెల్లడించారు. పోలీసులు వేసిన పిటిషన్ పై సానుకూలంగా స్పందించింది కోర్టు.. 10 రోజుల కస్టడీకి అంగీకరించింది.

కోర్టు కస్టడీకి అంగీకరించడంతో ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. కేసును ఎంత పకడ్బందీగా ఫైల్ చేస్తే, శిక్ష అంత కఠినంగా ఉంటుందనే విషయం తెలిసిందే. అందుకే ఈ కేసులో ఏ చిన్న ఆధారాన్ని వదలకూడదని పోలీసులు భావిస్తున్నారు. ఈ 10 రోజుల్లో సమగ్రంగా పూర్తి సమాచారాన్ని రాబట్టాలని, నిందితులకు ఉరిశిక్ష పడేలా సాక్ష్యాలు సేకరించాలని పోలీసులు భావిస్తున్నారు.

మరోవైపు చర్లపల్లి జైలు వద్ద 3 రోజులుగా నిరసన కార్యక్రమాలు, ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. పలు మహిళా సంఘాలు, ప్రజాసంఘాలతో పాటు స్థానికులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. నిందితుల్ని తమకు అప్పగించాలని ధర్నాలు చేస్తున్నారు. ఇప్పటికే చర్లపల్లి జైలు వల్ల భద్రతను రెట్టింపు చేసిన పోలీసులు.. కస్టడీకి కోర్టు అనుమతించడంతో 144 సెక్షన్ ను కూడా విధించారు.

దిశ హత్యపై సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు అంతా ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఈరోజు మంచు విష్ణు దిశ తల్లిదండ్రుల్ని పరామర్శించాడు. అతడితో పాటు ఫైట్ మాస్టర్లు రామ్-లక్ష్మణ్ కూడా ఉన్నారు. నిందితులకు కఠిన శిక్ష పడేవరకు తాను పోరాటం చేస్తానని, దిశా తల్లిదండ్రులకు మంచు మనోజ్ ధైర్యం చెప్పాడు.