మహారాష్ట్రలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాటల యుద్ధం కొనసాగుతూ ఉంది. పాత మిత్రులు ఇప్పుడు శత్రువులు అయ్యారు, పాత శత్రువులు ఇప్పుడు మిత్రులయ్యారు. ఇలాంటి నేపథ్యంలో మాటల యుద్ధం సాగుతూ ఉంది. ఈ సందర్భంగా తమ అంతర్గత చర్చల గురించి పార్టీల వారు మాట్లాడుతూ ఉన్నారు.
మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పడానికి ముందు జరిగిన రాజకీయ హైడ్రామా గురించి వారు ఎద్దేవా చేసుకుంటూ మాట్లాడుతున్నారు. పొలిటికల్ హైడ్రామా సమయంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ వెళ్లి ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సమావేశం అయిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా ఆయన తమతో కొన్ని ప్రతిపాదనలు చేసినట్టుగా బీజేపీ వాళ్లు ప్రకటించారు.
సుప్రియా సూలేకు కేంద్రంలో వ్యవసాయ శాఖ మంత్రి పదవి ఇవ్వాలని.. అప్పుడు బీజేపీతో కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తాము రెడీ అని శరద్ పవార్ ప్రతిపాదించాడంటూ బీజేపీ లీకులిచ్చింది. మోడీతో ఆ మేరకు పవార్ ప్రతిపాదన చేసినట్టుగా బీజేపీ వాళ్లు అంటున్నారు. అయితే అలా పొత్తు పార్టీలకు కేంద్రంలో మంత్రి పదవులు ఇస్తే..జేడీయూ కూడా డిమాండ్ చేస్తుందని పవార్ ప్రతిపాదనకు నో చెప్పినట్టుగా కూడా కమలం పార్టీ వాళ్లు ముక్తాయింపునిస్తున్నారు!
అయితే ఈ విషయంలో శరద్ పవార్ కూడా కౌంటరిచ్చారు. తను భారతీయ జనతా పార్టీతో ప్రతిపాదించడం కాదు, బీజేపీనే తనతో ఆ ప్రతిపాదన చేసిందని ఆయన అంటున్నారు. తన కూతురుకు కేంద్రంలో వ్యవసాయ శాఖ మంత్రి పదవిని ఇవ్వడానికి రెడీ అని, మహారాష్ట్రలో బీజేపీకి సపోర్ట్ చేయాలని కమలం వాళ్లు తనను కోరారని పవార్ అంటున్నారు!
ఇందులో ఎవరిది నిజమో, ఎవరిది అబద్ధమో కానీ.. అడిగారని ఒకరు, ఆఫర్ చేశారని మరొకరు అంటున్నారు. ఎవరికి వారు తామే తిరస్కరించినట్టుగా చెప్పుకుంటున్నారు. ఏది నిజమో, ఏది అబద్ధమో!