పార్టీ కోసం పని చేస్తున్నదెవరు? చేయనదెవరో అన్నీ రాసి పెడుతున్నట్టు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నేతలు మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, ఆయన కుమారుడు భూపేష్‌రెడ్డి టీడీపీలో చేరిక సందర్భంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
వలస పక్షులకు ఇక పార్టీలో అవకాశం లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. ఈసారి పనిచేసే వారికి మాత్రమే పార్టీలో పదవులు ఇస్తామని స్పష్టం చేశారు. పార్టీ మారి వచ్చే వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఉండదని తేల్చి చెప్పారు. భూపేష్‌రెడ్డికి జమ్మలమడుగు బాధ్యతలు అప్పగిస్తున్నట్టు బాబు తెలిపారు. టీడీపీకి జమ్మలమడుగు కంచుకోట అని తెలిపారు. జమ్మలమడుగులో పార్టీ కోసం పని చేసే ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందన్నారు.
ఇదిలా వుండగా వలసనేతలకు ఇక మీదట కీలక పదవులు ఇవ్వకూడదని చంద్రబాబు నిర్ణయించుకోవడం శుభపరిణామమని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. తమ నాయకుడికి ఇప్పటికైనా జ్ఞానోదయం కావడం మంచిదే అంటున్నారు. అయితే ప్రస్తుతం జమ్మలమడుగు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది కూడా వలస నేతలకే కావడం విశేషం.
గతంలో వైసీపీ తరపున ఎమ్మెల్సీ పదవి దక్కించుకున్న నారాయణరెడ్డి… టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అటు వైపు మొగ్గు చూపారు. ఎందుకంటే తన తమ్ముడు దేవగుడి ఆదినారాయణరెడ్డి టీడీపీలో చేరి మంత్రి పదవి దక్కించుకోవడంతో అధికారానికి దగ్గరయ్యారు. ఆ తర్వాత టీడీపీ అధికారం నుంచి దిగిపోగానే, మళ్లీ వైసీపీ వైపు మొగ్గు చూపినా జగన్ చేరదీయలేదు. దీంతో మళ్లీ దేవగుడి కుటుంబం టీడీపీలో చేరాల్సిన పరిస్థితి ఏర్పడింది.