వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి ఏకైక టార్గెట్ చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ మాత్రమే. ఇంతకు మించి ఆయన రాజకీయంగా ఇతరులపై పెద్దగా సోషల్ మీడియా వేదికగా దాడి చేయరు. ఏ మాత్రం అవకాశం దొరికినా చంద్రబాబు, లోకేశ్‌లపై వ్యంగ్యాస్త్రాలు సంధించడానికి సిద్ధంగా ఉంటారు. తాజాగా ట్విటర్ వేదికగా చంద్రబాబుపై ఘాటు కామెంట్స్‌తో విరుచుకుపడ్డారు.
“తుఫాన్లను కంట్రోల్ చేశానంటాడు. సీమ వరదలు మానవ తప్పిదం అంటాడు. తాను ఏడిస్తే ఎవరూ పట్టించుకోవట్లేదంటాడు. తన బాధ ప్రపంచ బాధ అంటాడు. కుప్పం దెబ్బకు కకావికలమయ్యాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరిస్తాడట! మరి14 ఏళ్లు ఏం పీకాడని జనం చెవులు కొరుక్కుంటున్నారు” అని వెటకరించారు.
చంద్రబాబు వెక్కివెక్కి ఏడ్వడం ప్రత్యర్థులకు పెద్ద కామెడీ అయ్యింది. బాబు ఏడ్పుపై ఇప్పటికే సోషల్ మీడియాలో కావాల్సినంత ట్రోలింగ్ జరుగుతోంది. ఇది చాలదన్నట్టు విజయసాయిరెడ్డి కూడా దెప్పి పొడుస్తూ ట్వీట్ చేయడం గమనార్హం. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఏం చేశారని జనం చెవులు కొరుక్కుంటున్నారనే వ్యాఖ్య ప్రాధాన్యం సంతరించుకుంది.
ఎందుకంటే చంద్రబాబు ఎదుటి వాళ్లపై ఒక వేలు చూపితే, మిగిలినవన్నీ తన వైపే చూపుతూ ప్రశ్నిస్తున్నాయి. ఇదే చంద్రబాబుకు పెద్ద ఇబ్బందిగా మారింది.