తమరు కీలుబొమ్మలను కూర్చోపెడితే అంతే మరి!

తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు, గవర్నర్ తమిళి సైకు మధ్య ఏర్పడిన యుద్ధమేఘాలు తొలగిపోయే సరికి కమలనాధులకు కంటగింపుగా ఉన్నట్టుంది. గవర్నరు తమిళిసై , కేసీఆర్ తో లడాయిని తెగేవరకు లాగి ఉండాల్సిందని, అంత…

తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు, గవర్నర్ తమిళి సైకు మధ్య ఏర్పడిన యుద్ధమేఘాలు తొలగిపోయే సరికి కమలనాధులకు కంటగింపుగా ఉన్నట్టుంది. గవర్నరు తమిళిసై , కేసీఆర్ తో లడాయిని తెగేవరకు లాగి ఉండాల్సిందని, అంత త్వరగా రాజీ పడి ఉండాల్సింది కాదని.. రాజ్యాంగ సంక్షోభమే ఏర్పడే పరిస్థితి తీసుకువస్తే..రాజకీయంగా ఆట ఇంకాస్త రక్తి కట్టి ఉండేదని వారు కోరుకున్నట్టుగా ఉంది. 

తాత్కాలికమే అని భావిస్తున్నప్పటికీ.. తమిళిసై రాజీ పడడం బడ్జెట్ బిల్లుకు ఆమోదం చెప్పడం, శాసనసభలో ప్రభుత్వం అందించిన స్క్రిప్టు ప్రకారం ప్రసంగించడం, సభకు వచ్చిన గవర్నరు పట్ల సాక్షాత్తూ ముఖ్యమంత్రి సహా ప్రభుత్వ పెద్దలందరూ కూడా గౌరవ మర్యాదాపురస్సరంగా ప్రవర్తించడం ఇవన్నీ ఇతర బిజెపి నేతలకు రుచించడం లేదు. 

కొన్నాళ్లుగా కేసీఆర్ సర్కారు మీద విమర్శలనే రువ్వుతున్న తమిళిసై నోటినుంచి.. ప్రభుత్వాన్ని పొగిడే కితాబుల వర్షంతో సాగిన ప్రసంగాన్ని వారు తప్పుపడుతున్నారు. 

గవర్నరుతో ప్రభుత్వం అబద్ధాలు మాట్లాడించిందని కమల నాధులు ఆడిపోసుకుంటున్నారు. గవర్నరు ప్రసంగం అన్న తరువాత సహజంగా ప్రభుత్వం రూపొందించిన ప్రసంగాన్నే చదువుతారు. కానీ.. ఆమెతో అబద్ధాలు చెప్పించారంటూ వీరిలా కుమిలిపోవడం అర్థం లేని సంగతి. ఆ పార్టీ నాయకులు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ అందరూ దీనిని అబద్ధాల ప్రసంగం అంటూ తమ పార్టీ గవర్నరునే అంటున్నారు. 

అయినా.. అలా అని విమర్శలు చేయడానికి బిజెపి వారేమైనా కేసీఆర్ చేతి కీలుబొమ్మను గవర్నరు పదవిలో కూర్చోబెట్టారా? లేదు కదా? అనే ప్రశ్నలు వారికి ఎదురవుతున్నాయి. మీరేమైనా కీలుబొమ్మను పదవిలో కూర్చోబెట్టి ఉంటే అలా ఆవేదన చెందడంలో అర్థముందని, అదే సమయంలో కీలుబొమ్మలను కూర్చోబెట్టినందుకు మిమ్మల్ని మీరే దండించుకోవాల్సి ఉంటుందని విమర్శలు వస్తున్నాయి. 

గవర్నరు స్థానంలో నియమిస్తున్నది కీలుబొమ్మలను కాదు, స్వతంత్రంగా వ్యవహరించగల, ఆలోచించగల నాయకులనే అనే భావన ఉంటే గనుక.. తన చేతికి ఏ స్క్రిప్టు వస్తే దానిని చదువుకుంటూ పోవడం కాకుండా.. తన సొంత మాటను కూడా యాడ్ చేసి చదవగల వారిని నియమించి ఉంటే బాగుండేది. అలా చేసి ఉంటే మొత్తం గవర్నర్- కేసీఆర్ మధ్య ఏర్పడిన యుద్ధ వాతావరణం ఇంకాస్త ముదిరి ఉండేది. 

అయినా.. గవర్నరు తమ పార్టీకి చెందిన వారే అయినప్పుడు, ఆమెతో సర్కారు అబద్ధాలు మాట్టాడించిందని విమర్శలు చేసే నైతిక హక్కు తమకు లేనేలేదని కమల నాయకులు తెలుసుకోవాలి. తాము అధికారంలోకి  రావాలంటే మరింత క్రియాశీల పోరాటం ఉండాలే తప్ప.. ఇలాంటి టైంపాస్ ప్రకటనలు దండగ అని కూడా తెలుసుకోవాలి.