ప్రతి ఎన్నికలకు ముందునా ఇలాంటి వ్యవహారాలు మామూలే. నేతలు అటూ ఇటూ గెంతుతూ ఉంటారు. అప్పటి వరకూ అధికారం అనుభవించిన పార్టీపై విమర్శలు సంధిస్తూ ఉంటారు. అప్పటి వరకూ తామే వీరుడు, శూరుడు అని పొగిడిన నేతను తెగనాడుతూ కొత్త నేత భజన అందుకుంటూ ఉంటారు. ఈ సారికి సంబందించి ఇప్పటికి తొలి పేరు ఖరారు అయినట్టే. అది కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఈ జాబితాలో మరో పేరు కూడా దాదాపు రెడీ అయినట్టుగా ఉంది. అది ఆనం రామనారాయణ రెడ్డి. గ్రేటర్ రాయలసీమకు సంబంధించి వీరిద్దరూ జగన్ ను వీడి చంద్రబాబు వైపు చేరడానికి దాదాపు రెడీ అయినట్టే. వీరిలో కోటంరెడ్డికి తెలుగుదేశం కొత్త కావొచ్చు. అయితే ఆనం రామనారాయణ రెడ్డికి మాత్రం టీడీపీ కొత్త కాదు. కాంగ్రెస్ పార్టీ పతనానంతరం ఈయన తెలుగుదేశం వైపు కూడా వెళ్లారు. అప్పట్లో ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం వివేకానందరెడ్డిలు తెలుగుదేశం పార్టీకి జై కొట్టారు. అయితే ఆ పార్టీలో ఎక్కువకాలం ఇమడలేకపోయారు. ఆనం వివేకానందరెడ్డి మరణానంతరం ఆనం రామనారాయణ రెడ్డి కొంతకాలం పాటు నిస్తేజంగానే గడిపి, గత ఎన్నికల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరోసారి ఎమ్మెల్యే అయ్యారు.
ఒకవేళ గత ఎన్నికల సమయంలో ఆనం రామనారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉండి ఉన్నా, లేక ఏ ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఉన్నా.. ప్రస్తుత ఎమ్మెల్యే టర్మ్ ఆయనకు దక్కేది కాదు. సొంతంగా కానీ, కిరణ్ కుమార్ రెడ్డి పెట్టిన చెప్పుల పార్టీ ద్వారా కానీ, కాంగ్రెస్ ద్వారా కానీ, తెలుగుదేశం పార్టీ ద్వారా కానీ.. ఎలా పోటీ చేసి ఉన్నా గత ఎన్నికల్లో ఆనంరామనారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా నెగ్గగలిగేవారు కాదు. మరి అలాంటి అవకాశం దక్కినా.. ఆనం రామనారాయణ రెడ్డి మాత్రం మంత్రి పదవి దక్కలేదని అనుకుంటే అది ఆయన వ్యక్తిగతం అనుకోవాలి!
మరి ఈ జాబితాలో ఇంకా ఎవరు ఉంటారనేది ఆసక్తిదాయకమైన అంశం. రాయలసీమ వరకూ చూస్తే కొంతమంది ఉండినా ఉండవచ్చు. ఎందుకంటే వచ్చే ఎన్నికల నాటికి సిట్టింగుల్లో చాలా మందికి వైఎస్ జగన్ టికెట్ ను నిరాకరించవచ్చు అనే ప్రచారం గట్టిగా జరుగుతూ ఉంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఇలా చాలా మంది సిట్టింగులకు వచ్చేసారి అవకాశం దక్కదని, ప్రత్యామ్నాయ వేటలో జగన్ ఉన్నారనే అభిప్రాయాల వినిపిస్తున్నాయి.
గత ఎన్నికల్లో ఆఖరి నిమిషంలో, అనూహ్య అభ్యర్థులకే వచ్చేసారి థ్రెట్ అనే టాక్ నడుస్తోంది. కనీసం నలభై శాతం మంది సిట్టింగులకు ఓవరాల్ గా టికెట్ దక్కకపోవచ్చనే ప్రచారం ఉంది. ఇలాంటి నేపథ్యంలో.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ దక్కని వారు సహజంగానే తెలుగుదేశం పార్టీ వైపు చూసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
గత ఎన్నికల సమయంలోనే ఇలాంటివి జరిగాయి. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ దక్కని ఐజయ్య, గౌరు చరిత లాంటి వారు జై తెలుగుదేశం అన్నారు. ఈ సారి అలాంటి వారి సంఖ్య మరింత ఎక్కువే ఉండవచ్చు. జగన్ గాలిలో గెలిచేసి తాము ఇక పెద్ద నేతలం అనుకుంటున్న కొందరు సిట్టింగులు టికెట్ దక్కకపోతే సహించే పరిస్థితి ఉండకపోవచ్చు! వారికి ఆ మాత్రం అసహనం ఉండటంలో పెద్ద ఆశ్చర్యమూ లేదు.
ఒక్కసారి ఎమ్మెల్యే, ఎంపీలు అయిపోతే.. తమ స్థాయి గురించి నేతలు ఎవ్వరూ రాజీ పడే పరిస్థితి ఉండదు. మళ్లీ టికెట్ దక్కలేదంటే అదే పార్టీ అయినా, టికెట్ ఇవ్వని నేత ఎవ్వరైనా వీరు రాజీ పడలేరు. విరుచుకుపడతారు. అసహనం వ్యక్తం చేస్తారు. వేరే పార్టీ లోకి వెళతారు. అక్కడ టికెట్ దక్కినా, దక్కకపోయినా వీరు కిక్కురుమనే పరిస్థితి ఉండదు!
రాజీనామా ద్వారా తమ అసహనాన్ని, అహాన్నీ చాటుకోవడానికి వీరు ప్రయత్నిస్తారు. ఈ క్రమంలోనే ఇలాంటి జంపింగులు ఉంటాయి. ఏపీలో ఎన్నికల వేడి పూర్తి పతాక స్థాయిని చేరడానికి మరో ఏడాది సమయం కూడా లేదు. మరో పది నెలల్లో పార్టీలు అభ్యర్థుల జాబితాలంటూ హడావుడిని పూర్తి పతాక స్థాయికి తీసుకెళతాయి, పార్టీల ఉత్సాహం చూస్తుంటే.. వీలైనంత ముందుగానే అభ్యర్థుల జాబితాలు అండూ హడావుడి చేస్తాయి.
ఈ నేపథ్యంలో… తమకు టికెట్ దక్కదనే నేతలంతా ఇలాంటి కయ్యాలకు కాలు దువ్వవచ్చు. నేతల అసహనాలను పరిగణనలోకి తీసుకుని పార్టీలు కూడా ఇంకా ముందుగానే టికెట్ల విషయంలో వ్యక్తిగతంగా అయినా క్లారిటీ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. ఆఖరి నిమిషంంలో ఇలాంటి వాటిని డీల్ చేయడం కన్నా.. ముందుగానే వీటిని డీల్ చేయడం పార్టీల అధినేతలకు సులువు కావొచ్చు!