ఇంతకీ ఏ లెక్కన హార్ధిక్ పాండ్యా భారత క్రికెట్ జట్టు టీ20 టీమ్ కు కెప్టెన్ అయ్యాడు? ఇంతటితో ఆగడం కాదు.. రేపోమాపో వన్డే జట్టు పగ్గాలను కూడా హార్ధిక్ పాండ్యాకు అప్పగించడానికి బీసీసీఐ రెడీ అవుతోందనే వార్తలూ వస్తున్నాయి! భారత క్రికెట్ అభిమానుల్లో ఒకరకంగా హార్ధిక్ కెప్టెన్సీ కలవరాన్నే పుట్టిస్తోంది. త్వరలోనే వన్డే వరల్డ్ కప్ జరగబోతోంది. అలాంటి తరుణంలో ప్రపంచకప్ నాటికి హార్ధిక్ ను 50 ఓవర్ల ఫార్మాట్ కు కెప్టెన్ గా అనౌన్స్ చేసేయరు కదా అనే ఆందోళన కూడా అభిమానుల్లో మొదలవుతోంది.
ఒక్క మాటలో చెప్పాలంటే కెప్టెన్ గా హార్ధిక్ పాండ్యాకు భారత క్రికెట్ అభిమానుల ఆమోదం అయితే లేదు. అభిమానుల ఆమోదంతో సంబంధం ఏమీ లేకపోయినా బీసీసీఐ అతడినికి కెప్టెన్ గా చేసుకోవచ్చు. అది వేరే కథ. అయితే ఎప్పుడైతే ఇలాంటి ఎమోషనల్ టచ్ పోతుందో.. అప్పుడు బీసీసీఐ వ్యాపారానికి కూడా అది నష్టం చేస్తుందని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు. అభిమానుల ఎమోషనే ఆటపై వారి ఆసక్తే బీసీసీఐ వేల కోట్ల వ్యాపార సామ్రాజానికి పునాది! బీసీసీఐ చేస్తున్నది అచ్చంగా క్రికెట్ తో వ్యాపారమే. క్రికెట్ వైపు వెళ్లిన యువకులకు బీసీసీఐ జీతభత్యాలను ఇవ్వొచ్చు. వారిలో స్టార్లు అయిన వారికి కోట్ల రూపాయలనూ చెల్లించవచ్చు. అయితే ఇదంతా బీసీసీఐ పెట్టుబడి. అభిమానుల ఆదరణే బీసీసీఐకి లాభాల పంట.
మరి ఈ లాభాలు హెచ్చుగా రావాలంటే… జట్టుతో అభిమానుల ఎమోషనల్ టచ్ ఎప్పుడూ ఉండాల్సిందే. గతంలో కెప్టన్లు కల్ట్ ఫేమస్ అయ్యారు. ఎప్పుడో కపిల్ దేవ్, గవాస్కర్, అజర్, గంగూలీ, ధోనీ, కొహ్లీ, రోహిత్.. వీళ్లంతా ఆయా కాలాల్లో అభిమానులు మెచ్చిన కెప్టెన్లు. వీళ్లే కాదు మరి కొందరు కొద్ది కాలమో, కొన్ని మ్యాచ్ లకో కెప్టెన్లుగా వ్యవహరించారు. అయితే అది ఎవరికీ పెద్దగా గుర్తుండదు! శ్రీకాంత్, రవిశాస్త్రి, అజయ్ జడేజా, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్ వీళ్లంతా లెక్కబెట్టదగినన్ని మ్యాచ్ లకు కెప్టెన్లుగా వ్యవహరించారు. ఇంకా కుంబ్లే కొన్ని టెస్టులకు పరిమితం కాగా, సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ ఇంకా రైనా.. కూడా కొన్ని మ్యాచ్ లకు కెప్టెన్లే. వీళ్లంతా ఆపత్కాలాల్లో కెప్టెన్లు. మరి హార్ధిక్ పాండ్యా అలాంటి కెప్టెన్ ఏమీ కాదు. అనధికార, అధికారిక కెప్టెన్ గా పాండ్యా చలామణి అవుతున్నాడు!
ఒకానొక దశలో మరో కపిల్ దేవ్ అని కీర్తించబడిన హార్ధిక్ కు అంత సీన్ లేదని ఆ తర్వాత స్పష్టత వచ్చింది. ఇతడికి ఇప్పటికే జాతీయ జట్టులో బోలెడన్ని అవకాశాలు దక్కాయి. కానీ అద్బుతం అనిపించుకోదగిన ప్రదర్శనలు ఏవీ లేవు! కొన్ని కీలక సందర్భాల్లో అయితే కనీసం బ్యాట్ తో బాల్ ను కనెక్ట్ చేసుకోలేనంత పేలవంగా ఇతడి బ్యాటింగ్ సాగింది. ఇక తను కెప్టెన్ కాక ముందు చివరి సారి పాండ్యా తన కోటా ఓవర్లను పూర్తి చేసుకున్న సందర్భాలు ఎన్ని? ఒక వన్డే మ్యాచ్ లో ఇతడి చేత వేరే కెప్టెన్లు 10 ఓవర్ల కోటాను పూర్తి చేయించగలిగే వారు కాదు!
కొన్ని మ్యాచ్ లలో అసలు బౌలింగ్ కు ఇచ్చే సాహసం కూడా చేసే వారు కాదు. పేరుకు ఆల్ రౌండర్ అయినా.. బాల్ ఇచ్చే వారు కాదు! అందులో వివక్ష ఏమీ లేదు. ఇతడి ప్రతిభపైనే అనుమానం! టీ20 మ్యాచ్ లలో కూడా అదే కథ. కెప్టెన్ కాకముందు ఇతడు నాలుగు ఓవర్ల కోటాను పూర్తి చేసిన మ్యాచ్ లు అరుదు! ఇప్పుడు కెప్టెన్ అయ్యాకా.. వేరే ఎవ్వరికీ అవకాశం ఇవ్వకుండా తనే తొలి ఓవర్ వేసేస్తున్నాడు. స్పెషలిస్ట్ బౌలర్లు, పేస్ బౌలర్లు, వైవిధ్యం ఉన్న బౌలర్లు, యంగ్ బౌలర్లకు అవకాశం ఇవ్వకుండా తనే ఫస్ట్ ఓవర్ వేస్తాడు. పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉన్నా.. వారి కోటాను పూర్తి చేయనీయకుండా తను మాత్రం నింపాదిగా నాలుగు ఓవర్లూ పూర్తి చేసుకోవడానికి పాండ్యా ఉబలాటపడతాడు.
ఇక మైదానంలో ఇతడి ప్రవర్తన కూడా ఏదో లా ఉంటుంది తప్ప ఒక నాయకుడిలా అయితే ఉండదు! ఇక గణాంకాల ప్రకారం చూసుకుంటే.. 66 వన్డేలు ఆడినా ఒక్క సెంచరీ లేదు. యావరేజ్ కూడా 33 ఉంది. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మన్ కు సెంచరీ అవకాశాలు రావనుకుంది. అయితే ఐదు, ఆరు స్థానాల్లో బ్యాటింగ్ చే వారి యావరేజ్ అయినా మెరుగ్గా ఉంటుంది. ఇక వన్డేల్లో ఇతడు 62 వికెట్లు తీశాడు, ఒక్కో వికెట్ కు ఇచ్చిన సగటు పరుగులు 38! టీ20ల్లో 87 మ్యాచ్ లలో 69 వికెట్లు తీశాడు! ఇలా పాండ్యా గణాంకాలు పేలవ రీతిలోనే ఉన్నాయి.
అయినా ఇప్పుడు ఇతడే కెప్టెన్. కివీస్ తో టీ20 మ్యాచ్ లకు మ్యాన్ ఆఫ్ ద సీరిస్ కూడా ఇతడికే ఇచ్చేశారు! మరి ఇదంతా ఇతడు గుజరాతీ కావడం వల్ల దక్కుతున్నదే తప్ప ఇంకోటి కాదనే మాట అభిమానుల్లోనే గట్టిగా వినిపిస్తోంది! ఒకప్పుడు భారత క్రికెట్ లో ముంబై లాబీ గురించి చెప్పుకునే వారు. ఇప్పుడు గుజరాతీ లాబీ!