జనసేనాని పవన్‌కల్యాణ్ జీవితం ఆయన చేతల్లో లేదా? అనే ప్రశ్నకు… ఔను అనే సమాధానం వస్తోంది. తాజాగా నందమూరి బాలకృష్ణ టాక్‌షోలో పలు ప్రశ్నలకు పవన్ సమాధానాలు ఇచ్చారు. వాటిని అధ్యయనం చేస్తే… ఏదీ తనకు సంబంధం లేకుండానే జరిగినట్టు చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆలోచనలు మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తాయంటారు. ఏ మనిషికైనా వారి ఆలోచనలకు తగ్గట్టే జీవితం ఒక రూపం పొందుతుంది.
అసలు తమకంటూ సొంత ఆలోచనలు, అభిప్రాయాలు లేకపోతే వారిని ఎలా అర్థం చేసుకోవాలి? తాజా ఇంటర్వ్యూలో పవన్ ఏమన్నారంటే….”నేను రాజకీయాల్లోకి రావాలని అనుకోలేదు. సాటి మనిషికి ఏదైనా చేయాలనే భావనతో స్వచ్ఛంద సంస్థ ప్రారంభించాలని అనుకున్నా. సినిమాల్లోకి రావాలని అనుకోలేదు. నటనపై అసక్తి లేదు. దర్శకుడిని కావాలని అనుకున్నా. అసలు పెళ్లే చేసుకోవాలని అనుకోలేదు. అలాంటిది మూడు పెళ్లిళ్లు చేసుకున్నా” అని పవన్ చెప్పుకొచ్చారు.
ప్రతిదీ అనుకోకుండానే జరిగిపోవడం ఏంటి? ఇలా ఎక్కడైనా వుంటుందా? తమకంటూ కొన్ని లక్ష్యాలు ఏర్పరచుకోవడం, వాటి సాధనకు కృషి చేయడం, సాధించడం గురించి అనేక స్ఫూర్తిదాయక కథనాలు చదివాం, విన్నాం. మరి పవన్ విషయానికి వస్తే… మనిషే ఏదో తేడా అనే అభిప్రాయం ఆయన మాటలు వింటే అర్థమవుతుంది. ఎలాంటి లక్ష్యం లేకుండా పవన్ రావడం వల్లే… అర్థంపర్థం లేని నిర్ణయాలు తీసుకుంటున్నారనే విమర్శ వుంది.
తాము ఎంచుకున్న రంగాన్ని ప్రేమించలేని వారు… అందులో ఏం సాధిస్తారు? అందుకే పవన్ ఎటూ కాకుండా అయిపోతున్నారు. రాజకీయాలంటే అఇష్టత వల్లే వీకెండ్స్‌లో మాత్రమే ఆయన కనిపిస్తుంటారు. ఆ తర్వాత షూటింగ్‌ల్లో బీజీ అవుతుంటారు. రేప్పొద్దున పొత్తులపై కూడా ఇట్లే మాట్లాడ్తారేమో! జగన్‌ను గద్దె దించేందుకు టీడీపీతో పొత్తు కుదుర్చుకోవాలని అనుకున్నానని, కానీ అటు వైపు నుంచి తగిన స్పందన రాకపోవడంతో ఏమీ చేయలేకపోయానని నిస్సహాయత వ్యక్తం చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.