ప్రైవేట్ మంటకు వంటతో జవాబు

ప్రైవేట్ అంటే ఎందుకో పాలకులకు మోజు. అది ఎంత దాకా వచ్చింది అంటే బంగారం లాంటి పరిశ్రమలను సైతం ప్రైవేటుకు అడ్డగోలుగా బలి ఇచ్చేస్తున్నారు. ఈ దేశానికి ఆధునిక దేవాలయాలుగా పరిశ్రమలను పూర్వీకులు పేర్కొన్నారు.…

ప్రైవేట్ అంటే ఎందుకో పాలకులకు మోజు. అది ఎంత దాకా వచ్చింది అంటే బంగారం లాంటి పరిశ్రమలను సైతం ప్రైవేటుకు అడ్డగోలుగా బలి ఇచ్చేస్తున్నారు. ఈ దేశానికి ఆధునిక దేవాలయాలుగా పరిశ్రమలను పూర్వీకులు పేర్కొన్నారు. అయితే ఇపుడు మాత్రం వాటిని గుదిబండలుగా భావిస్తూ వదిలించుకోవడానికి చూస్తున్నారు.

లేకపోతే దేశంలోనే నవరత్నగా ఉంటూ అగ్రగామిగా భాసితుల్లుతున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయాలన్న ఆలోచన ఎలా కలుగుతుంది మరి. సీ షోర్ ప్రాజెక్ట్ గా ఉన్న స్టీల్ ప్లాంట్ ని అమ్మితే కొనడానికి తాము రెడీ అంటూ అనేక మంది ప్రైవేటు యజమానులు క్యూ కడుతున్నారూ అంటే స్టీల్ ప్లాంట్ విలువ గౌరవం ఏంటో తెలిసిపోవడంలేదా.

అయినా సరే అమ్మి తీరుతామని కచ్చితంగా చెబుతూ దూకుడు చేస్తున్న కేంద్రానికి ముకుతాడు వేసేందుకు పది నెలలుగా స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆందోళన పధంలోనే ఉన్నారు. ఇపుడు అది కాస్తా మరింతగా ముదురుతోంది. స్టీల్ ప్లాంట్ కి మంట పెడితే ఆ మంటలోనే మేము వంట చేసుకుంటాము, స్టీల్ ప్లాంట్ మంటను వంటతో ఆర్పేస్తామని కార్మికులు తెలివిగాగా బదులిస్తున్నారు.

విశాఖలో వంటా వార్పు కార్యక్రమం పెద్ద ఎత్తున కార్మికులు నిర్వహించి తమ నిరసననకు కొత్త రూపు ఇచ్చారు. ఈ నిరసనలో వైసీపీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి సహా కీలక నాయకులు పాల్గొని ఇప్పటికైనా ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయడం ఆపేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ సర్కార్ అసెంబ్లీలో తీర్మానం చేసి తమ చిత్తశుద్ధిని చాటుకుందని వారు పేర్కొన్నారు. 

అఖిల పక్ష నాయకులు సహా పెద్ద ఎత్తున ఉద్యమకారులు పాల్గొన్న ఈ వంటా వార్పుతో స్టీల్ పోరాటం కీలక మలుపు తిరిగింది. ఇంతకీ దిగిరాకపోతే మరింతగా తాము ప్రజ్వరిల్లుతామని, కేంద్రం వెనక్కి వెళ్ళేంతవరకూ ఆగేది లేదని కార్మిన సంఘాల నేతలు తెగేసి చెబుతున్నారు.