cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Reviews

మూవీ రివ్యూ: అనుభవించు రాజా

మూవీ రివ్యూ: అనుభవించు రాజా

చిత్రం: అనుభవించు రాజా
రేటింగ్: 2/5
బ్యానర్: అన్నపూర్ణా స్టూడియోస్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్
తారాగణం: రాజ్ తరుణ్, కషిష్ ఖాన్, పోసాని, ఆడుకాలం నరేన్, అజయ్, ఆదర్శ్, అరియాన తదితరులు
సంగీతం: గోపీ సుందర్
కెమెరా: నగేష్ బానెల్
ఎడిటర్: చోటా కె ప్రసాద్
నిర్మాత: సుప్రియ యార్లగడ్డ
దర్శకత్వం: శ్రీను గవిరెడ్డి
విడుదల తేదీ: నవంబర్ 26, 2021

పెద్ద స్టార్ల సినిమాలు, లేదా విపరీతమైన పబ్లిసిటీ జరుపుకున్న చిత్రాలు, యూత్ ని టార్గెట్ చేసి తీసిన కామెడీ సినిమాలు, మ్యూజికల్ హిట్స్ మాత్రమే సినిమా హాల్స్ లో అదృష్టాన్ని పరీక్షించుకునే రోజులివి. 

మిగతావన్నీ ఓటీటీలో వచ్చినప్పుడు చూద్దాంలే అనుకునే బాపతుకి ప్రజలొచ్చేసారు. 

అల్లరి నరేష్ ఒకప్పుడు పూర్తి స్థాయి కామెడీ చిత్రాలు చేసాడు. ఆ కోవలో ప్రస్తుతం ఉన్న హీరో రాజ్ తరుణ్. 

"అనుభవించు రాజా" టైటిల్ తో కనిపించాడు. సరదాగా సాగే ట్రైలరు చూపించాడు. అక్కడక్కడా ఫైటింగులు గట్రా ట్రైలరులో కనిపించినా ఇది కామెడీ ప్రధాన చిత్రమనే అంచనాలు ఏర్పడ్డాయి. 

విడుదలకి ముందు ఈ సినిమాలో ఏ పాటా హిట్ కాలేదు. ట్రైలరులోని ఏ పార్టూ వైరల్ కాలేదు. పెద్దగా ప్రమోషన్ కూడా చెయ్యలేదు. 

అయినా కూడా కామెడీ విషయంలో రాజ్ తరుణ్ టైమింగ్ మీద నమ్మకం వల్ల, అన్నపూర్ణా బ్యానర్ కావడం వల్ల ఒక వర్గం ప్రేక్షకులకి కొన్ని అంచనాలు ఏర్పడి చూడాలనే ఆసక్తి మాత్రం కలిగుండొచ్చు.

పరమలోభియైన ఒక రాజుగారు బోలెడంత ఆస్తి కూడబెడతాడు. పోతూ పోతూ ఉన్న ఆస్తినంతా మనవడికిచ్చి, తనలా కాకుండా హాయిగా అనుభవించమని చెబుతాడు. 

ఇక ఆ మనవడు ఆస్తిని ఎలా అనుభవిస్తాడనేది కథ అయ్యుంటే, పూర్తి కామెడీ సినిమాగా తీయడానికి ఫుల్ స్కోప్ ఉండేది. కానీ అలా కాకుండా ఈ కథలోకి కుట్రలు, సుపారీ హంతకులు ప్రవేశించారు. దాంతో కామెడీ అనుకున్న కథ కాస్తా సీరియస్ అయింది.  

కోటీశ్వరుడు హైద్రాబాదులో సెక్యూరిటీ గార్డ్ ఎందుకయ్యాడు? అతనొక సాఫ్ట్ వేర్ అమ్మాయి ప్రేమని ఎలా గెలుచుకున్నాడు? ఇదంతా ఒక ట్రాక్. సుపారీ హంతకులు ఎవరు? వాళ్లకి హీరోకి లింకేంటి? ఈ యాక్షన్ ఎపిసోడ్ అంతా ఇంకొక ట్రాక్. 

ఇలా రెండు మూడు ట్రాకుల్ని మూడుపేటల జడలాగ అల్లి తీసిన సినిమా ఇది. 

ఉన్నంతలో ప్రధమార్థంలో కాస్త సస్పెన్స్ పండింది. స్క్రీన్ ప్లే పరంగా ఇక్కడ మార్కులేయొచ్చు. కానీ క్రమంగా ఎంత కట్టుదిట్టమైన స్క్రీన్ ప్లే నడిపినా కథలో డొల్లతనం వల్ల చివరాఖరికి తేలిపోయింది. 

ఈ సినిమా బాలేదని కొట్టిపారేయలేం. అలా అని బాగుందనీ మనస్ఫూర్తిగా చెప్పలేం. హాయిగా కామెడీ చూద్దామని ఫిక్స్ అయినవాళ్లకి యాక్షన్ ట్రీట్మెంట్ నచ్చదు. ఎటువంటి అంచనాలూ లేకుండా చూసేవాళ్లకి మాత్రం పర్వాలేదనిపించొచ్చు. అంతే తప్ప ఊహించని కథతో కట్టిపారేసిన ఫీలింగ్ మాత్రం రాదు. 

రాజ్ తరుణ్ ట్యాలెంట్ ఉన్న నటుడు. కథ ఎలా ఉన్నా తన ఈజ్ తో సినిమాని మోసేయగలడు. కానీ అతను ఎంచుకునే కథల్లోనే లోపముంటోంది. 

తన పర్సనాలిటీకి, ఇమేజ్ కి అల్లరి నరేష్ మార్కు విలేజ్ కామెడీ వర్కౌట్ అయినట్టు యాక్షన్ కథలు వర్కౌట్ కావు. తనకు తగ్గ కథలు ఎంచుకోవడంలోనే హీరో సక్సెస్ ఉంటుంది. అప్పుడే తనకంటూ ఒక మార్క్ వస్తుంది. 

హీరోయిన్ కషిష్ ఖాన్ చూడ్డానికి బాగుంది. సగటు కమెర్షియల్ హీరోయిన్ గా చేయాల్సినివి చేసింది. నెల్లూర్ సుదర్శన్ కామెడీ ఈ సారి అస్సలు నవ్వించలేకపోయింది. 

ఒక సీన్లోనూ, ఒక పాటలో కాసేపు కనిపించిన అరియానా గ్లోరీ మీద ఒక ట్రాక్ నడిపినా బానే ఉండేది. ఆమెని గెస్ట్ పాత్రకి పరిమితం చేసారు. మిగతా నటీనటులంతా ఎప్పటిలాగానే చేసారు తప్ప కొత్తదనం చూపించలేదు. 

గోపీ సుందర్ సంగీతం ఏ విధంగానూ పనిచెయ్యలేదు. హమ్మింగ్ చేసుకోవడానికి వీలుగా ఉండే పాటకానీ, కథలో లీనం చేయగలిగే నేపథ్యసంగీతం కానీ పండలేదు. కెమెరా, ఎడిటింగులు ఓకే. 

ఒక చిన్న కథకి రెండు మూడు లేయర్స్ కలిపి రెండుంపావు గంటల సినిమా తీసాడు. దర్శకుడి కష్టం కనపడింది. కానీ ఆ కష్టానికి తగ్గ సంతృప్తి చూసినవాళ్లకి కూడా కలగాలిగా. అది జరగలేదు. 

ఒక సినిమాలోనే అన్ని పార్శ్వాలూ చూపించేయాలనుకోవడం, దర్శకుడు హీరో కలిసి ఏ జానర్ అయినా చేయగలమని నిరూపించుకోవడానికి ఒక సినిమాలోనే ప్రతాపన్నంతా చూపించేయాలనుకోవడం సాధారణంగా చాలామంది చేసే పెద్ద తప్పు. అటువంటి తప్పు ఇక్కడ కూడా జరిగింది. పూర్తి స్థాయి కామెడీ సినిమాగా దీనిని మలచుంటే రాజ్ తరుణ్ సినిమాల లిస్టులో మంచి చిత్రం నమోదయ్యేది. ప్రస్తుతానికి మాత్రం ఈ సినిమా చేసిన నిర్మాతలకి "అనుభవం" మిగులుతుంది. 

బాటం లైన్: అనుభవించడానికేం లేదు

రమ్యకృష్ణ గారికి వయస్సు ఏమిటి?

హను రాఘవపూడి చాలా కష్ట పెడతాడు