భర్త మాటే తన బాట అని నారా భువనేశ్వరి మరోసారి చాటి చెప్పారు. గత కొన్ని రోజులుగా భువనేశ్వరి కేంద్రంగా ఏపీ రాజకీయాలు వేడెక్కిన సంగతి తెలిసింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక మహిళ శీలాన్ని శంకించేలా జుగుప్సాకర రాజకీయాల్లో చోటు చేసుకున్నాయి.
భువనేశ్వరి పేరుతో రాజకీయంగా సొమ్ము చేసుకోవాలని ప్రతిపక్షం, అలాగే ప్రత్యర్థి ఎత్తులను చిత్తు చేసేందుకు పాలకపక్షం ఒకరిపై మరొకరు పైచేయి సాధించే వికృత రాజకీయ క్రీడకు తెరలేపారు.
పాలకప్రతిపక్ష పార్టీలకు రాజకీయ ప్రయోజనాలే తప్ప, ప్రజా ప్రయోజనాలు పట్టలేదని ఈ ఎపిసోడ్ నిరూపిస్తోందని పౌరసమాజం వాపోతోంది. ఈ నేపథ్యంలో వివాదానికి కేంద్ర బిందువైన నారా భువనేశ్వరే స్వయాన నేడు ఓ ప్రకటన విడుదల చేశారు. అది కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ లెటర్ ప్యాడ్‌పై కావడం గమనార్హం. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ కూడా అయిన భువనేశ్వరి విడుదల చేసిన ప్రకటనలో ఏముందంటే…
‘ఆంధ్రప్రదేశ్ శాసనసభలో నాపై చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం చేసిన వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. నాకు జరిగిన అవమానాన్ని మీ తల్లి, తోబుట్టువు, కూతురికి జరిగినట్లుగా భావించి నాకు అండగా నిలబడటం నా జీవితంలో మర్చిపోలేను. చిన్నతనం నుంచి అమ్మానాన్న మమ్మల్ని విలువలతో పెంచారు.
నేటికీ మేము వాటిని పాటిస్తున్నాం. విలువలతో కూడిన సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. కష్టాలు, ఆపదలో ఉన్న వారికి అండగా నిలబడాలి. ఇతరుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా, గౌరవానికి భంగం కలిగించేలా ఎవరూ వ్యవహరించకూడదు. నాకు జరిగిన ఈ అవమానం మరెవరికీ జరగకుండా ఉండాలని ఆశిస్తున్నాను’ అని భువనేశ్వరి పేర్కొన్నారు.