బాబుకి న్యాయ విచారణ.. జనసేనకు సీబీఐ విచారణ

వరదల కారణంగా నష్టపోయినవారికి ప్రభుత్వం తక్షణ సాయంగా 2వేల రూపాయలు అందించింది. సీఎం జగన్ సాయం ప్రకటించిన 24 గంటల్లోగా 90శాతం మందికి ఈ సాయాన్ని అందజేశారు అధికారులు. ఉరుకులు పరుగులతో అర్థరాత్రులు సైతం…

వరదల కారణంగా నష్టపోయినవారికి ప్రభుత్వం తక్షణ సాయంగా 2వేల రూపాయలు అందించింది. సీఎం జగన్ సాయం ప్రకటించిన 24 గంటల్లోగా 90శాతం మందికి ఈ సాయాన్ని అందజేశారు అధికారులు. ఉరుకులు పరుగులతో అర్థరాత్రులు సైతం సాయాన్ని బాధితులకు అందించి వారికి అండగా నిలిచారు. 

స్థానిక జిల్లాల మంత్రులు, ఇన్ చార్జ్ మంత్రులు మూడు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించారు. సీఎం జగన్ ఏరియల్ సర్వే తర్వాత పంట నష్టాలపై అంచనాలను ప్రకటించి తక్షణ సాయం చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. అంతా పద్ధతి ప్రకారం జరిగింది. అంతలోనే అలా జరగడానికి వీల్లేదంటూ వరదలతో బురద రాజకీయం మొదలుపెట్టాయి ప్రతిపక్షాలు.

న్యాయ విచారణ కావాలంటున్న చంద్రబాబు..

వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు ఇది ప్రకృతి విపత్తు కాదని, మానవ తప్పిదంతో జరిగిన విపత్తు అని విమర్శించడం విశేషం. అంతే కాదు, ఈ తప్పిదంపై న్యాయ విచారణ కూడా కావాలంటున్నారాయన.

వర్షాలు వచ్చి, వరద నీరు పెరిగి, ఏళ్లు, ఊళ్లు ఏకమైతే దాన్ని మానవ తప్పిదంగా ఎలా చెబుతున్నారో బాబుకే తెలియాలి.

నాదెండ్ల మనోహర్ కి ఏకంగా సీబీఐ కావాలి..

ఇక జనసేన కీలక నేత, పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, చంద్రబాబు కంటే ఎక్కువ కామెడీ చేశారు. వరద ప్రభావిత జిల్లాల్లో పర్యటిస్తున్న ఆయన సీబీఐ ఎంక్వయిరీ కావాలంటున్నారు. వరదల అనంతర పరిస్థితులపై విచారణ జరపాలని, అప్పుడే ప్రభుత్వం చేసిన తప్పులు బయటకొస్తాయని చెబుతున్నారు. సీబీఐ కేంద్రం చేతిలో పావు కాబట్టి.. బీజేపీ సపోర్ట్ తో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారేమో.

అలాంటి మాస్టర్ ప్లాన్ వేసే బదులు, కనీసం వరద ప్రాంతాల్లో సాయం పెంచేందుకు కేంద్రానికి జనసేన తరపున ఓ అభ్యర్థన ఇవ్వొచ్చుకదా అనేది సగటు బాధితుడి ప్రశ్న. కానీ అందులో రాజకీయ లాభం ఏదీ ఉండదు కాబట్టి.. నాదెండ్ల మనోహర్ సీబీఐ ఎంక్వయిరీ కావాలంటున్నారు.

బురద రాజకీయాల్లో ఇప్పటి వరకూ కేవలం విమర్శలే చూసిన జనాలకు ఈ ఎంక్వయిరీ వేషాలు కొత్తగా తోస్తున్నాయి. మొత్తమ్మీద న్యాయ విచారణ, సీబీఐ విచారణ అంటూ ప్రతిపక్షాలు కామెడీ చేయడం మాత్రం ఈసారి వరదల స్పెషల్ ఎఫెక్ట్.