ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆధ్యాత్రిక కేంద్రం తిరుపతిలో ఓ వింత చోటు చేసుకుంది. సిమెంట్‌తో తయారు చేసిన ఓ వాటర్ ట్యాంక్ భూమి పొరల్లో ఒక్కసారిగా బయటికొచ్చింది. ఈ నేపథ్యంలో తమకేం జరుగుతుందోననే భయం తిరుపతి వాసులను వెంటాడుతోంది. తిరుపతి శ్రీకృష్ణానగర్‌లో చోటు చేసుకున్న వింత ఘటన గురించి తెలుసుకున్న ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి వెంటనే అక్కడికి వెళ్లారు. ప్రజలకు భరోసా కల్పించేందుకు ఆయన ప్రయత్నించారు.
శ్రీకృష్ణానగర్‌లో ఓ ఇంటి పరిసరాల్లో భూమి లోపల వాటర్ ట్యాంక్‌ను పదేళ్ల క్రితం ఏర్పాటు చేశారు. ఇటీవల తిరుపతిని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఈ నేపథ్యంలో ట్యాంకర్‌ను శుభ్రం చేసేందుకు సదరు కుటుంబానికి చెందిన మహిళ అందులో దిగింది. అందులోని నీళ్లను తోడేశారు. ఆ తర్వాత ఒక్కసారిగా ట్యాంక్ దానికదే కదలింది. ఆ మహిళ అందులో పడిపోయి స్వల్ప గాయాలపాలైంది.
అనంతరం ఆ మహిళను నిచ్చెన వేసి రక్షించారు. ఇదే సమయంలో సుమారు 11 అడుగుల పైనున్న సదరు ట్యాంక్ ఒక్కసారిగా భూమిపైకి వచ్చింది. ఈ విషయమై తిరుపతిలో పెద్ద ఎత్తున ప్రచారమైంది. ఈ వింత చూడడానికి జనం పెద్ద ఎత్తున అక్కడికి వెళ్లారు.
తిరుపతి ఎమ్మెల్యే భూమన సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు కొత్తేమీ కాదన్నారు. భూమి పొరల్లో వరద నీటి ప్రవాహానికి తొట్టి పైకి వచ్చి వుంటుందన్నారు.
అంతే తప్ప సిమెంట్ ట్యాంక్ బయటికి రావడం వెనుక మాయామర్మాలు లేవని చెప్పుకొచ్చారు. మొదట ప్రజానీకం భయాన్ని వీడాలని కోరారు. తమకేదో అవుతుందనే భయాన్ని ప్రతి ఒక్కరూ విడనాడాలని కోరారు. అన్నింటికి సైన్స్ సమాధానం ఇస్తుందన్నారు.
ఎస్వీ యూనివర్సిటీ భూగర్భశాఖ అధికారులు వచ్చి అసలు సమస్యకు కారణాలేంటో తేలుస్తారని చెప్పారు. కావున ప్రజలు ధైర్యంతో సమస్యను ఎదుర్కోవాలని, అపోహలను వీడాలని విజ్ఞప్తి చేశారు.