మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు వివాదాలు కొత్త కాదు. మొన్న జరిగిన ఎన్నికల సందర్భంగా జరిగిన గొడవలు ఇంకా అందరికీ గుర్తే. కొత్త అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నికైన తర్వాత కూడా వివాదాలు కొనసాగాయి. సీసీటీవీ ఫూటేజ్ కావాలంటూ ప్రకాష్ రాజ్ కాస్త హంగామా చేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత సైలెంట్ అయ్యారు. అలా కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న 'మా' రాజకీయం ఇప్పుడు మరోసారి వార్తల్లోకెక్కింది.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫీస్ కొన్ని రోజులుగా మూతపడి ఉంది. ఎన్నికలు జరిగి, కొత్త కార్యవర్గం అమల్లోకి పదవిలోకి వచ్చినప్పటికీ అసోసియేషన్ ఆఫీస్ కు ఇంకా తాళాలు వేసి ఉన్నాయని కొంతమంది ఆరోపిస్తున్నారు. ఇలా ఆరోపణలు చేస్తున్న 'ఆ కొంతమంది' ఎవరనేది ఇక్కడ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
మా ఆఫీస్ కు ఎప్పుడు వెళ్లినా దానికి తాళాలు వేసి ఉంటున్నాయని, కార్యవర్గ సభ్యులెవ్వరూ ఆఫీస్ కు రావడం లేదని కొందరు ఆరోపిస్తున్నారు. పింఛను డబ్బులతో పాటు మరికొన్ని సమస్యల్ని చెప్పుకుందామని కార్యాలయానికి వస్తే, ప్రతిసారి లాక్ చేసి ఉంటోందని అంటున్నారు. మరి దీనిపై కొత్త అధ్యక్షుడు మంచు విష్ణు ఎలా స్పందిస్తాడో చూడాలి.
నిజానికి అసోసియేషన్ ఆఫీస్ కు ప్రతి రోజూ అందరూ రావాల్సిన అవసరం లేదు. మీటింగ్ ఉన్నప్పుడు అందరూ వస్తారు. లేనప్పుడు కేవలం పరిమిత సంఖ్యలో ఉన్న సిబ్బందితో కార్యాలయం పనిచేస్తుంది. ఈసారి ఆ వాతావరణం కూడా కనిపించడం లేదని ఆరోపిస్తున్నారు కొంతమంది సభ్యులు.
చూడ్డానికి ఇది చిన్న సమస్యే. కానీ ప్రకాష్ రాజ్ ప్యానెల్ లేవనెత్తితే మాత్రం ఇది మరోసారి వివాదాస్పదమయ్యే అవకాశం ఉంది. అటు మంచు విష్ణు మాత్రం తన కొత్త సినిమాల్ని సెట్స్ పైకి తీసుకొచ్చే పనిలో బిజీగా ఉన్నాడు. ఓవైపు అసోసియేషన్ పనులు చూసుకుంటూనే, మరోవైపు శ్రీనువైట్ల దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు.