చాలా రోజుల కిందట మొదలైంది 'ప్రాజెక్ట్ K' మూవీ. కానీ ప్రభాస్ మాత్రం ఈ సినిమా సెట్స్ పైకి రాలేదు. ఇన్నాళ్లకు ఆ టైమ్ రానే వచ్చింది. త్వరలోనే డైరక్టర్ నాగ్ అశ్విన్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు ప్రభాస్. డిసెంబర్ 2 నుంచి ఈ సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు. ఇంకో విశేషం ఏంటంటే, ప్రభాస్ సెట్స్ పైకొచ్చిన వారం రోజులకే దీపిక పదుకోన్ కూడా ఈ సినిమా షూట్ లో జాయిన్ కాబోతోంది.
దాదాపు 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో, సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ తో వస్తోంది 'ప్రాజెక్ట్ K'. ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ ను అమితాబ్ బచ్చన్ తో పూర్తిచేశారు. సినిమాలో ఆయనది ఓ చిన్న ప్రత్యేక పాత్ర. కాబట్టి ముందుగా ఆయనతో కొన్ని సన్నివేశాల్ని పూర్తిచేశారు. ఆ తర్వాత మళ్లీ మరో షెడ్యూల్ ఇప్పటివరకు స్టార్ట్ కాలేదు.
రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్.. 'ప్రాజెక్ట్ K'కు టైమ్ కేటాయించలేకపోయాడు. ఇప్పుడు ఆ రెండు సినిమాలు పూర్తవ్వడంతో ఈ సినిమా మరోసారి సెట్స్ పైకి రాబోతోంది. తాజా సమాచారం ప్రకారం.. 'ప్రాజెక్ట్ K'కు ప్రభాస్ 200 రోజులు కాల్షీట్లు ఇచ్చాడంట.
అయితే బాహుబలి టైపులో పూర్తిగా ఈ ఒక్క సినిమాకే ప్రభాస్ పరిమితం అవ్వడం లేదు. ఓవైపు ప్రాజెక్ట్-Kను పూర్తిచేస్తూనే, మరోవైపు సలార్ సినిమాలో కూడా నటిస్తాడు. అప్పటికీ నాగ్ అశ్విన్ సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వకపోతే, సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ మూవీని కూడా స్టార్ట్ చేస్తాడు.
ప్రపంచంలో ఇప్పటివరకు ఎవ్వరూ టచ్ చేయని సైన్స్-ఫిక్షన్ కాన్సెప్ట్ తో వస్తున్న ప్రాజెక్ట్-Kను పూర్తిచేయాలంటే షూటింగ్ కే ఏడాదికి పైగా పడుతుందని నాగ్ అశ్విన్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.