నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తిరుగుబాటుతో వైసీపీ ఎదురు దాడికి దిగింది. విమర్శలు, ప్రతివిమర్శలతో నెల్లూరు రాజకీయం హీటెక్కింది. రేపో ఎల్లుండో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయనే రాజకీయ వాతావరణం నెల్లూరులో నెలకుంది. ఈ నేపథ్యంలో కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై అదే జిల్లాలోని సర్వేపల్లి ఎమ్మెల్యే, మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి విరుచుకుపడ్డారు.
తనకు కోటంరెడ్డి దగ్గరి బంధువని చెప్పుకొచ్చారు. 2014 ఎన్నికల సమయంలో నెల్లూరు రూరల్ టికెట్‌కు ఎంతో పోటీ ఉండిందన్నారు. ఈ విషయం కోటంరెడ్డికి కూడా తెలుసన్నారు. నాడు జగన్ స్థానంలో మరెవరున్నా కోటంరెడ్డికి సీటు దక్కేది కాదని కాకాణి స్పష్టం చేశారు. ఈ విషయమై కోటంరెడ్డిని అడిగితే చెబుతారన్నారు. తాను వాస్తవమే మాట్లాడుతున్నట్టు ఆయన తెలిపారు.
పార్టీ మార్పు అనేది కోటంరెడ్డి వ్యక్తిగత విషయమన్నారు. కానీ వైసీపీపై బురదజల్లడం సరైన పద్ధతి కాదన్నారు. కోటంరెడ్డి ఆరోపిస్తున్నట్టు ఫోన్ ట్యాపింగ్ జరగలేదన్నారు. మ్యాన్ ట్యాపింగ్ జరిగిందని ఆయన సెటైర్ విసిరారు. కోటంరెడ్డిని చంద్రబాబు ట్యాప్ చేశారని ఆరోపించారు. చంద్రబాబు ట్యాప్‌లో కోటంరెడ్డి పడ్డారని కాకాణి విమర్శించారు. కోటంరెడ్డి చెబుతున్నట్టు వైఎస్ జగన్‌కు ఆయన వీరవిధేయుడు కాదన్నారు. మరొకరికి విధేయుడని కాకాణి చురకలు అంటించారు.
జగన్ ముందు లేకపోతే మనమంతా జీరోలమన్నారు. ఒకరిద్దరు పార్టీ నుంచి వెళ్లిపోయినంత మాత్రాన వైసీపీకి నష్టం లేదని, ఇంకా మంచి నేతలు పార్టీలోకి వస్తారన్నారు. కోటంరెడ్డి తీసుకున్న నిర్ణయం ఆత్మహత్యా సదృశ్యంగా మారనుందని కాకాణి గోవర్ధన్‌రెడ్డి తేల్చి చెప్పారు.