తన సినిమాలకు సీరియస్ సబ్జెక్టులు ఎంచుకుంటారు కె.విశ్వనాధ్. సీరియస్ విషయాల్ని చర్చిస్తారు, కామెడీ చాలా తక్కువగా ఉంటుంది. బలమైన సందేశాన్నిస్తారు. అయితే ఇదంతా తెర వరకు మాత్రమే. తెరవెనక కె.విశ్వనాధ్ ఎంత హుందాగా ఉంటారో, అంతే సరదాగా కూడా వ్యవహరిస్తుంటారు.
కళాతపస్వి శివైక్యం చెందిన నేపథ్యంలో ఆయనతో ఉన్న అనుబంధాన్ని కొంతమంది సీనియర్ సినీ పాత్రికేయులు పంచుకున్నారు. మీడియాతో ఎప్పుడూ సరదాగా ఉండేవారట కె.విశ్వనాధ్. మరీ ముఖ్యంగా ఎంత సీరియస్ ప్రశ్నకైనా కాస్త సరదాగా సమాధానాలివ్వడానికి ప్రయత్నించేవారట.
కెరీర్ ప్రారంభంలో ఖాకీ దుస్తుల్లో కనిపించేవారు కె.విశ్వనాధ్. చాలా సినిమాలకు ఆయన డ్రెస్ కోడ్ ఇదే. కొంతమంది దాన్ని సెంటిమెంట్ అన్నారు, మరికొంతమంది శ్రమకు ఇచ్చే గౌరవం అన్నారు. ఇదే విషయాన్ని గతంలో విశ్వనాధ్ ను అడిగితే ఆయన సరదాగా స్పందించారు.
తను తీసిన సినిమా ఆడకపోతే వెంటనే టాక్సీ డ్రైవర్ గా మారిపోవడానికి అనువుగా ఉంటుందని ఖాకీ డ్రెస్ లో షూటింగ్ కు వస్తాననేది విశ్వనాధ్ గారి మాట. అప్పటికప్పుడు కుట్టించుకోవడానికి వీలవుతుందో అవ్వదోనని, ముందుగానే కుట్టించుకున్నానంటూ ఆయన సరదాగా వ్యాఖ్యానించేవారు. కానీ అసలు మేటర్ ఏంటంటే.. లైట్ బాయ్ నుంచి దర్శకుడి వరకు అందరూ ఒకే రకంగా శ్రమపడతారని.. ఆ విషయంలో ఎలాంటి తారతమ్యాలు ఉండవనే విషయాన్ని చాటిచెప్పేందుకే ఖాకీ డ్రెస్ వేసుకుంటారు కె.విశ్వనాధ్.
కెరీర్ ప్రారంభించి, 3 సినిమాలు తీసిన తర్వాత కూడా తన గురించి పత్రికల్లో ఏమీ రాయొద్దని పాత్రికేయుల్ని కోరేవారు విశ్వనాధ్. మరో రెండు సినిమాలు రిలీజ్ అయిన తర్వాత తనలో ప్రతిభ ఉందని గుర్తిస్తేనే రాయమని చెప్పేవారు. ఆ తర్వాత విశ్వనాధ్ గురించి రాయని పత్రిక లేదు. ఆయన ప్రతి సినిమాపై పత్రికల్లో కోకొల్లలు విశ్లేషణలు వచ్చేవి.
దర్శకుడు శంకర్, విశ్వనాధ్ కు వీరాభిమాని. ఆయన సినిమాలు చూసి ఎంతో స్ఫూర్తి పొందానని చెప్పిన శంకర్, గతంలో ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ శంకరాభరణం గురించి సుదీర్ఘంగా మాట్లాడారు. ఆ సినిమాలో ప్రతి ఫ్రేమ్ క్లాసిక్ అంటూ కొనియాడారు. తక్కువ మాటలతో ఎక్కువ భావాన్ని అందించొచ్చనే విషయాన్ని తను శంకరాభరణం చూసిన తర్వాతే తెలుసుకున్నానని అన్నాడు శంకర్.