గవర్నర్ తమిళిసైపై బీజేపీ గుర్రుగా వుంది. బడ్జెట్ సమావేశాల ప్రారంభోపన్యాసంలో కేసీఆర్ సర్కార్ను గవర్నర్ ఇరుకున పెడుతుందని ప్రతిపక్షాలు ఆశించాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ కేసీఆర్ ప్రభుత్వం తయారు చేసిన ప్రసంగ పాఠాన్ని గవర్నర్ చదవరని బీజేపీ ఊహించింది. ఇటీవల ఓ ప్రముఖ చానల్ డిబేట్లో బీజేపీ నేత సాగర్ ఇదే విషయాన్ని బహిరంగంగానే ప్రకటించారు. కానీ బీజేపీ ఆశించినట్టు జరగకపోవడంతో ఆమెను తప్పు పట్టడానికి కూడా బీజేపీ నేతలు వెనుకాడడం లేదు.
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మాటల్లో గవర్నర్ ప్రసంగంపై బీజేపీ ఉద్దేశం బయటపడింది. ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం చేసిన తప్పుల్ని గవర్నర్తో చెప్పించారని ఆరోపించారు. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఎక్కడ ఇస్తున్నారని ఆయన నిలదీశారు. కనీసం ఆరు గంటల కరెంట్ కూడా సరఫరా కాలేదని, రైతులు సబ్ స్టేషన్ల వద్ద ఆందోళన చేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. గవర్నర్ ప్రసంగంలో అనేక అబద్ధాలు ఉన్నాయని మండిపడ్డారు.
అలాగే గవర్నర్ ప్రసంగంలో ధరణి ప్రస్తావన లేకపోవడాన్ని ఆయన ప్రస్తావించారు. ధరణితో ప్రజానీకం పడుతున్న ఇబ్బందుల గురించి గవర్నర్ ప్రసంగంలో పేర్కొనలేదని విమర్శించారు. ధరణి, డబుల్ బెడ్ ఇళ్లు రాకపోవడంతో చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఈటల ఘాటు విమర్శలు చేశారు. గొప్పలు చెప్పుకోడానికి మాత్రమే గవర్నర్ ప్రసంగం పనికొచ్చిందని ఆయన ఎద్దేవా చేశారు.
మొత్తానికి గవర్నర్ ప్రసంగంతో బీజేపీ తీవ్ర నిరాశకు గురైందన్నది వాస్తవం. మరీ ముఖ్యంగా గవర్నర్ తాము ఇచ్చిన ప్రసంగ పాఠాన్ని మాత్రమే చదువుతుందని అధికార పార్టీ నేతలు అసలు ఊహించలేదు. గవర్నర్ ప్రసంగం అధికార పార్టీకి మోదాన్ని, ప్రతిపక్షాలకు ఖేదాన్ని మిగిల్చిందని చెప్పొచ్చు.