అనంతపురంలోని పెద్ద థియేటర్‌లలో శాంతి ఒకటి. 1980లో ఏఎన్ఆర్, ఎన్టీఆర్ సినిమాలకి మాత్రమే హౌస్‌ఫుల్ బోర్డు పడేది. కానీ శంకరాభరణం ఆ రికార్డులు బద్దలు కొట్టింది. కారణం కె.విశ్వనాథ్.
ఆయన మీద అభిమానంతో ఫిబ్రవరి 2వ తేదీ (1980) ఉదయం ఆటకి శంకరాభరణం వెళ్లాను. హాల్లో జనం లేరు. సోమయాజులు, మంజుభార్గవిని చూసి ఎవరొస్తారు? పొద్దున్నే సైకిల్‌లో బయల్దేరిన నన్ను చూసి స్నేహితులంతా నవ్వారు. జనం లేని థియేటర్‌లో సినిమా చూడాలంటే విసుగు. అనవసరంగా వచ్చానేమో అనుకున్నా. అయినా విశ్వనాథ్ మీద నమ్మకం. సినిమా స్టార్ట్ అయ్యింది. అదో సంగీత ప్రవాహం. సినిమా ముగిశాక గంధర్వ లోకం నుంచి బయటికొచ్చినట్టు వుంది. అందరికీ చెప్పా. ఎవరూ నమ్మలేదు. మరుసటి రోజు ఊరంతా అవే పాటలు. క్యాసెట్ సెంటర్లు కిటకిట. శాంతి టాకీస్‌లో వరుస హౌస్‌ఫుల్ బోర్డులు. ఊళ్లోని సంగీతం, డ్యాన్స్ టీచర్లకి విపరీతంగా స్టూడెంట్స్ పెరిగారు. విశ్వనాథ్ తపస్సు శంకరాభరణం.
విశ్వనాథ్ సినిమాలపై ఇష్టం ఎప్పుడు ఏర్పడిందో గుర్తు లేదు. చాలా చిన్నప్పుడు చూసిన శారదలో, ఆమె బాధ వెంటాడింది. జీవనజ్యోతి (1975)ని ఏదో పండగకి వేశారు. రథ చక్రాల కింద పడిపోయిన పిల్లవాడిని గుర్తు చేసుకుని తిండి తినాలనిపించలేదు. సిరిసిరిమువ్వ (1976)కి స్కూల్ ఎగ్గొట్టి త్రివేణి టాకీస్‌కి వెళ్లాను. రూ.1.30 పైసల క్లాస్‌లో కూచున్నా. కాసేపటికి మా నాన్న వచ్చాడు. ఆయన సినిమాలు చూస్తాడని తెలుసు కానీ, విశ్వనాథ్ సినిమాలు మొదటి రోజు చూస్తాడని తెలియదు. భయమేసింది. నా పక్కన కూచుని “స్కూల్ లేదా” అన్నాడు. స్ట్రైక్ అన్నాను ( ఆ రోజుల్లో ఏఐఎస్ఎఫ్ వాళ్లు వారంలో మూడు రోజులు స్ట్రైక్ చేయించేవాళ్లు). ఇంకేమీ మాట్లాడకుండా ఇంటర్వెల్‌లో మురుకులు కొనిపెట్టాడు. ఇద్దరికీ సినిమా తెగ నచ్చేసింది.
తర్వాత విశ్వనాథ్ సినిమాలు అన్నీ చూశాను. కాలాంతకులు, అల్లుడు పట్టిన భరతం, ప్రెసిడెంట్ పేరమ్మ లాంటి టార్చర్ సినిమాలు కూడా భరించాను. ఉత్తమ సినిమాలతో పాటు చెత్త సినిమాలు కూడా ఆయన ఖాతాలో వున్నాయి. అయితే దర్శకుడిగా కథ చెప్పే విధానం అద్భుతం. ఆయన సినిమాల్లో విలన్లు వుండరు. పరిస్థితులే శత్రువులు. ఒకవేళ వున్నా వాళ్లు దురాశపరులే తప్ప దుర్మార్గులు కాదు. కళని ప్రమోట్ చేశాడే తప్ప చెడుని కాదు. ఏదీ కూడా అతిగా వుండకుండా సున్నితంగా వుంటుంది. మాటని , పాటని శక్తివంతంగా వాడుకున్నారు.
సాగరసంగమంలో డ్యాన్స్ ఫెస్టివల్‌కి వెళ్లాల్సిన హీరో, చావుబతుకుల మధ్య ఉన్న తల్లి కోసం నాట్యం చేసే సన్నివేశం మరిచిపోలేం. స్వాతిముత్యంలో అమ్మమ్మ చనిపోయిన విషయాన్ని కూడా అర్థం చేసుకోలేని అమాయకపు హీరో ఆకలేస్తోంది అనడం కన్నీళ్లు తెప్పిస్తుంది. నేపథ్య సంగీతాన్ని శక్తివంతంగా వాడుకున్న దర్శకుడు. ఆయన సినిమాలకి ప్రాణం పోసింది మహదేవన్, ఇళయరాజా.
నటుడిగా కూడా చాలా బ్యాలెన్స్‌డ్. ఎమోషనల్ సీన్స్‌లో కూడా అతి లేకుండా సమతూకంగా నటించడం తెలిసిన వారు. ఆయన మాంత్రిక శక్తితో రాత్రికి రాత్రి స్టార్స్ అయిన వాళ్లున్నారు. సిరిసిరిమువ్వ, హిందీ సర్‌గమ్‌తో జయప్రద జాతీయ నటిగా మారారు. రెవెన్యూలో ఉద్యోగం చేసుకుంటున్న సోమయాజులు, వ్యాంప్ పాత్రలు వేస్తున్న మంజుభార్గవిలకి స్టార్ హోదాని తెచ్చిన వ్యక్తి. సుధాకర్ ఇంటి పేరే శుభలేఖగా మారిపోయింది.
ఆయన సినిమాలు బ్రాహ్మణవాదంతో వుంటాయనే విమర్శ వుంది. అది నిజం కూడా. ఆయనకి తెలిసిందే చెప్పారు. పుట్టి పెరిగిన నేపథ్యం నుంచే కథలు చెప్పారు. ఎవరైనా అంతే. ఆయనది సంస్కరణ వాదం. పా.రంజిత్‌లా ధిక్కార స్వరం కాదు. కాలాన్ని బట్టి మనుషుల్ని అర్థం చేసుకోవాలి. అప్పటికి దళితవాదం అంబేద్కరిజం మీద ఇంత చర్చ లేదు. అవగాహన లేదు. దళిత కుర్రాడికి మనుమరాలిని ఇచ్చి పెళ్లి చేయడం సోమయాజులు పెద్ద మనసు లేదా అభ్యుదయం అని సప్తపదిలో విశ్వనాథ్ అనుకున్నారు. కాంతారాలో మా ఇళ్లకి మీరు వస్తే మీ ఇళ్లకి మేము రాకూడదా అని హీరో ప్రశ్నించినట్టు సప్తపదిలో ఆ కుర్రాడు అంటే అది వేరే సినిమా అయి వుండేది.
సాగరసంగమంలో జయప్రద బొట్టు చెరిగిపోకుండా (తకిట తకిట పాట తర్వాత) కమలహాసన్ ప్రయత్నం ఇప్పుడు కామెడీగా అనిపిస్తుంది. ఆనాడు జనానికి నచ్చింది. కాలం చాలా మారుస్తుంది. భిన్నాభిప్రాయాలు పక్కన పెడితే గొప్ప దర్శకుల్లో నిస్సందేహంగా విశ్వనాథ్ ఒకరు.
కళా తపస్సు ముగిసింది. ఎంతో ఇష్టమైన శివుడి దగ్గరికి వెళ్లిపోయారు. శివపార్వతుల ఎదుట ఆయనతో పాటు సోమయాజులు, అల్లు రామలింగయ్య, నిర్మలమ్మ వినయంగా కూచుని వుండగా కెవి. మహదేవన్ వేళ్లు హార్మోనియం మెట్ల మీద తచ్చాడుతుండగా, బాలసుబ్రహ్మణ్యం “శంకరా, నాదశరీరాపర” అని పాడుతూ వుంటాడు.
అంతా శివుడి ఆట!
జీఆర్ మహర్షి