మెట్రోలకే దిక్కు లేదు.. మల్టీప్లెక్సులు నడుస్తాయా..?

లాక్ డౌన్ విషయంలో ఎంత కఠినంగా ఉందో.. అన్ లాక్ విషయంలో అంత ఉదాసీనంగా మారిపోయింది కేంద్రం. కరోనా కట్టడి భారమంతా రాష్ట్రాలపై నెట్టేసి చేతులు దులుపుకుంది. ఎడా పెడా అన్నిటికీ అనుమతులిచ్చేస్తోంది. బార్లు,…

లాక్ డౌన్ విషయంలో ఎంత కఠినంగా ఉందో.. అన్ లాక్ విషయంలో అంత ఉదాసీనంగా మారిపోయింది కేంద్రం. కరోనా కట్టడి భారమంతా రాష్ట్రాలపై నెట్టేసి చేతులు దులుపుకుంది. ఎడా పెడా అన్నిటికీ అనుమతులిచ్చేస్తోంది. బార్లు, సినిమాహాళ్లు తప్ప ప్రస్తుతం ఇంక వేటిపై ఆంక్షలు లేవు. స్కూళ్లు, కాలేజీలు కూడా రేపోమాపో తెరుచుకోబోతున్నాయి. ఈ నేపథ్యంలో సినిమాహాళ్ల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది.

కేంద్రం జోరు చూస్తుంటే సినిమా షూటింగ్ లకు పర్మిషన్ ఇచ్చినట్టే కనిపిస్తోంది.. జనాలు ఓటీటీకి అలవాటు పడితే ఇక థియేటర్ల మనుగడ కష్టమంటూ దేశవ్యాప్తంగా నిర్మాతలు కేంద్రంపై వత్తిడి తీసుకొస్తున్న వేళ.. సినిమా హాళ్లకు కూడా అనుమతులిచ్చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే కేంద్రం చేతులు దులుపుకున్నా ప్రజలు మాత్రం కరోనా విషయంలో పూర్తి అవగాహనతో ఉంటున్నారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ మెట్రో రైళ్లు.

మెట్రో రైళ్లపై ఆంక్షలు సడలించినా.. ప్రయాణికులెవరూ అత్యుత్సాహం చూపించడం లేదు. దాదాపుగా నగరాల్లో వ్యక్తిగత వాహనాలకు అలవాటుపడిపోయిన ప్రజలు ప్రజా రవాణాని పూర్తిగా పక్కనపెట్టేసినట్టే కనిపిస్తోంది. గుంపులోకి వెళ్తే తిప్పలు తప్పవని తెలుసుకున్నారు, అందుకే మెట్రో రైళ్లకు ఆదరణ అంతంతమాత్రంగానే ఉంది. కరోనా భయంతో హైదరాబాద్ లో కూడా మెట్రో ఆక్యుపెన్సీ దారుణంగా పడిపోయింది. ప్రజా రవాణాయే ఇలా ఉంటే.. ఇక వినోదరంగాన్ని ప్రజలు పట్టించుకుంటారా అనేది డిస్కషన్ పాయింట్.

ఇప్పటికే రెస్టారెంట్లు, ఫేమస్ హోటళ్లు కస్టమర్లు లేక ఈగలు తోలుకుంటున్నాయి. పూర్తిగా హోమ్ డెలివరీ ఆర్డర్లపై ఆధారపడ్డాయి. కొన్నిచోట్ల పేరున్న హోటళ్లు కూడా మూతపడ్డాయి. జిమ్ ల పరిస్థితి కూడా అంతే. ఎక్కువమంది ఇంట్లో వ్యాయామాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇలా ఆలోచిస్తే రేపు సినిమాహాళ్ల పరిస్థితి కూడా ఇంతే. మల్టీప్లెక్స్ లు, సినిమాహాళ్లు తెరిచినా పెద్ద ఉపయోగం లేదు.

అనుమతులు ఇచ్చేశామని చెప్పుకోవడానికి తప్ప రెవెన్యూపరంగా ఒరిగేదేం ఉండదు. ఇంకా చెప్పాలంటే షూటింగ్స్ కు అనుమతులు ఇచ్చినట్టే ఉంటుంది థియేటర్లు తెరిచే వ్యవహారం కూడా. సినిమాలూ చూడటం, చూడకపోవడం అనేది ప్రజల ఇష్టానికే వదిలేయబోతోంది కేంద్రం. ఇప్పటికిప్పుడు అనుమతులిచ్చేసినా, కాస్త ఆలస్యంగా తెరిచినా.. థియేటర్లకు జనం ఎగబడే పరిస్థితి మాత్రం లేదు. ఎట్ లీస్ట్ వ్యాక్సిన్ వచ్చేంతవరకు ప్రజలు తండోపతండాలుగా సినిమా హాళ్లకు రారనేది మాత్రం పక్కా. 

నాకు లవ్ స్టోరీలు నచ్చవు.. హెబ్బా

ఆ జోష్ వైసీపీకి ఇప్పట్లో వస్తుందా?